logo
Published : 24 May 2022 02:33 IST

సమస్య తీరదు.. సాయం అందదు!

న్యాయం చేయాలని వేడుకుంటున్న మునిదేవునిపల్లి రైతులు

కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయామని ఆవేదన

ఈనాడు, సంగారెడ్డి


ప్రభుత్వం ఇచ్చిన భూములివే

ఆ రైతులకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములేదిక్కు. వాటిలోనే సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వంశపారంపర్యంగా వస్తున్న ఈ భూములున్నాయనే భరోసాతో వారు బతుకుతున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత వీరికి కొత్త పాసుపుస్తకాలు ఇవ్వలేదు. కొందరు సాగులో లేకపోయినా.. కేవలం దస్త్రాల్లో ఉన్నా అలాంటి వారికి ఇచ్చారని, తమకు అన్యాయం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండాపూర్‌ మండలం మునిదేవునిపల్లిలోని సర్వే సంఖ్యలు 92, 112, 154లలో దాదాపు 300 ఎకరాలకు సంబంధించి సమస్య ఉంది. పాసుపుస్తకాలు అందకపోవడంతో వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. రైతుబంధు నగదు ఖాతాల్లో జమవడం లేదు. ఎప్పుడు వెళ్లినా... త్వరలోనే ఇస్తామని అధికారులు సమాధానమిస్తున్నారని రైతులు చెబుతున్నారు. సమస్యకు పరిష్కారం చూపేలా దృష్టిసారించి... తమ ఇబ్బందులు తీర్చాలని వారు వేడుకుంటున్నారు.

 


చాలా ఇబ్బందులు పడుతున్నాం

ఎల్లకొండ అంజయ్య

మా తండ్రి పెద్దనారాయణ పేరిట ప్రభుత్వం భూమిని కేటాయించింది. సర్వే సంఖ్య 154లో ఆయన పేరుపై 4ఎకరాల భూమి ఉంది. ఇదే సర్వే సంఖ్యలో నాకూ రెండెకరాలు ఇచ్చారు. కాస్తులో మేమే ఉన్నాం. మా నాన్న చనిపోయింది పన్నెండేళ్లు కావొస్తోంది. ఆయన పేరిట ఉన్న భూమిని మా అమ్మ పేరుమీదకు మార్పించాలని చాలా ప్రయత్నించా. అధికారులు పట్టించుకోలేదు. మా అమ్మ కూడా మరణించింది. ఇప్పటికీ ఆ భూమి ఫౌతి జరగలేదు. పాసుపుస్తకాలు రాలేదు.


కాస్తులో లేనోళ్లకు పాసుపుస్తకాలిచ్చారు

టేకులపల్లి వెంకటేశంగౌడ్‌

నాకు సర్వే సంఖ్య 112లో 1.11 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గత కొన్నేళ్లుగా ఈ భూమే ఆధారంగా సాగు చేస్తున్నా. పాత పాసుపుస్తకాలున్నాయి. భూ దస్త్రాల ప్రక్షాళన తర్వాత మాకు కొత్త పుస్తకాలు ఇవ్వలేదు. ఇన్నేళ్లుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఊళ్లోనే ఉంటూ సాగు చేస్తున్న వారికి కొత్త పాసుపుస్తకాలు ఇవ్వలేదు. కానీ కేవలం పట్టా పంపిణీ ధ్రువపత్రాలు చూపుతూ... కాస్తులో లేకున్నా కొందరికి మాత్రం అధికారులు వాటిని అందించారు. అలా ఎలా ఇచ్చారో వారు సమాధానం చెప్పాలి. మాకు న్యాయం చేయాలి.


ఆన్‌లైన్‌లో మా పేర్లే కనిపిస్తున్నాయి

- మందుల శ్రీనివాస్‌

సర్వే సంఖ్య 92లో మాకు 3 ఎకరాల అసైన్డు భూమి ఉంది. ఇందులో నేను నీటి వసతి ఏర్పాటు చేసుకున్నా. కూరగాయలు, పూల సాగు చేస్తున్నా. ఇదే మాకు జీవనాధారం. కానీ ఇప్పటి వరకు కొత్త పాసుపుస్తకాలు ఇవ్వలేదు. ధరణి వెబ్‌సైట్‌లో మాత్రం ఈ భూములు మా పేరిటే ఉన్నట్లు చూపిస్తుంది. అధికారుల వద్దకు వెళితే వారి నుంచి సరైన సమాధానం రావడం లేదు. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తే తప్ప మాకు ఊరట దక్కదు.


తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది

 

- మాల బాలయ్య

మా గ్రామంలోని సర్వే సంఖ్య 92లో మా నాన్న పేరిట ప్రభుత్వం 3.20 ఎకరాలు కేటాయించింది. భూమి లేకపోవడంతో సాగు చేసుకొని బతకమని అప్పట్లో ఈ భూమిని పంపిణీ చేశారు. ఇందులో బావి తవ్వించాం. బోర్లు వేయించాం. ప్రస్తుతం మామిడితోట ఉంది. మా నాన్న చనిపోయాక నా పేరిట ఫౌతి చేయించుకున్నా. అయితే కొత్త పాసుపుస్తకాలు ఇవ్వడం లేదు. రైతుబంధు రావడం లేదు. ఉన్నతాధికారులు మా సమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని కోరుతున్నాం.

 

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని