logo

అర్జీలతో సరి.. ఆశలు ఆవిరి!

యువతను స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయించాలన్న లక్ష్యం నీరుగారుతోంది. రాయితీ విడుదలకు నిధుల కేటాయింపు లేకపోవడమే దీనికి కారణం. బీసీ యువతకు పథకాల అమలు మూడు అడుగులు ముందుకు..

Published : 24 May 2022 02:33 IST

నాలుగేళ్లుగా యువత నిరీక్షణ

బీసీ కార్పొరేషన్‌ రాయితీ రుణాల తీరు

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: యువతను స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయించాలన్న లక్ష్యం నీరుగారుతోంది. రాయితీ విడుదలకు నిధుల కేటాయింపు లేకపోవడమే దీనికి కారణం. బీసీ యువతకు పథకాల అమలు మూడు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. స్వయం ఉపాధి యూనిట్లకు దరఖాస్తు చేసిన వారి ఆశలు ఆవిరవుతున్నాయి. 2017-18కి బీసీ కార్పొరేషన్‌ ద్వారా స్వీకరించిన అర్జీలకు ఇప్పటికీ మోక్షం లభించడంలేదు. జిల్లా జనాభా 15.27లక్షలు. ఇందులో అత్యధికంగా బీసీలే. ఆయా వర్గాలకు చెందిన కులవృత్తిదారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేక ఉపాధికి దూరమై అవస్థలు పడుతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయితీ రుణాలకు దరఖాస్తు చేసినా సాయం అందకపోవడంతో స్వయం ఉపాధికి బాటలు వేసుకోలేకపోతున్నారు.

‘శతశాతం’ కొందరికే: గతంలో ఎప్పుడూ లేనివిధంగా రూ.లక్షలోపు యూనిట్లకు అర్జీ చేసుకున్న వారికి శతశాతం రాయితీ కింద రూ.50వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా నిధులు విడుదలచేసింది. చిరు వ్యాపారాల ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద 766 యూనిట్లకు రూ.3.83కోట్లు అందజేశారు.

రూ.లక్ష ఆపై యూనిట్లకు నిరాశే: రూ.లక్షలోపు యూనిట్లను కేటగిరి-1, రూ.రెండు లక్షలలోపు యూనిట్లను కేటగిరి-2, రూ.2లక్షలకు పైగా యూనిట్లను కేటగిరి -3గా నిర్ణయించారు. రూ.లక్ష ఆపై యూనిట్లకు అర్జీ చేసిన వారికి ఎదురుచూపులే మిగిలాయి. రాయితీ రుణాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలియని పరిస్థితి. మూడేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడంపై నిరుద్యోగ యువత అసంతృప్తి వ్యక్తంచేస్తోంది.

పరిశీలనలేదు.. ముఖాముఖికి పిలవరు

రాయితీ రుణాల కోసం జిల్లా వ్యాప్తంగా 10,047 మంది దరఖాస్తు సమర్పించారు. ఇందులో ఎంతమంది అర్హులని తేల్చలేదు. పరిశీలించి ముఖాముఖి నిర్వహించాల్సి ఉండగా నాలుగేళ్లుగా అదీ ముందుకుసాగని పరిస్థితి. దరఖాస్తుల స్వీకరణకు అనుమతించి, తదుపరి ప్రక్రియపై మార్గదర్శకాలు విడుదల చేయకపోవడం ఎంతవరకు సమంజసమని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. నిధుల కేటాయింపుతోనే యూనిట్ల గ్రౌండింగ్‌కు మార్గం సుగమం అవుతుంది. పాతవారికే అందకపోవడంతో కొత్త వారికి అవకాశం లేకుండాపోయింది. నాలుగేళ్లుగా దరఖాస్తులు సైతం స్వీకరించని పరిస్థితి.


ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది

జగదీశ్‌, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి

బీసీ కార్పొరేషన్‌ ద్వారా రాయితీ రుణాల కోసం వచ్చిన దరఖాస్తులపై ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకుసాగుతాం. యూనిట్ల మంజూరు, రాయితీ విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిధులు విడుదల కాగానే యూనిట్ల గ్రౌండింగ్‌కు చర్యలు తీసుకుంటాం. అర్హులందరికీ అందే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని