logo

పచ్చిరొట్ట.. అందక తంటా!

భూమి సారం కోల్పోయి.. సరైన పోషకాలు లేక.. పంటల దిగుబడి రాక అన్నదాతలు ఏటా కుదేలవుతున్నారు. రసాయన ఎరువుల వినియోగంతో నేల కలుషితమయి ఈ విపత్కర పరిస్థితి నెలకొంటోంది. దీని నుంచి బయటకు రావాలంటే ఏటా పచ్చిరొట్ట సాగుచేస్తే పైరుకు బలం చేకూరుతుంది. వారం రోజులుగా జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి.

Published : 24 May 2022 02:33 IST

జిల్లాలో జీలుగ, జనుము విత్తనాల కొరత

కేంద్రాల చుట్టూ తిరుగుతున్న రైతులు

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌


కలియ దున్నుతున్న రైతు

భూమి సారం కోల్పోయి.. సరైన పోషకాలు లేక.. పంటల దిగుబడి రాక అన్నదాతలు ఏటా కుదేలవుతున్నారు. రసాయన ఎరువుల వినియోగంతో నేల కలుషితమయి ఈ విపత్కర పరిస్థితి నెలకొంటోంది. దీని నుంచి బయటకు రావాలంటే ఏటా పచ్చిరొట్ట సాగుచేస్తే పైరుకు బలం చేకూరుతుంది. వారం రోజులుగా జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. త్వరలోనే రోహిణి కార్తె రానుంది. జూన్‌ 5 నుంచి 8 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితితో వరి సాగు చేసే రైతులు ముందుగా జీలుగ, జనుము విత్తాల్సిందే. అయితే ప్రస్తుతం జిల్లాలో కేటాయింపునకు అనుగుణంగా సరఫరాకు నోచుకోవడం లేదు. వారం రోజుల నుంచి రైతులు ఆయా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా సంబంధిత కేంద్రాల సిబ్బంది రేపు, మాపంటూ కాలం వెల్లదీస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో జనుము, 10 మండలాల్లో జీలుగ విత్తనాలు అందుబాటులో లేవు. మిగిలిన మండలాల్లోనూ అరకొరగా సరఫరా చేశారు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేటలోని పీఏసీఎస్‌ కేంద్రానికి ఒక్క బస్తా రాలేదు. దీంతో రైతులు తిరిగిపోతున్నారు. కంది మండలం ఆరుట్ల, చిద్రుప్ప, బేగంపేట, ఎర్దనూర్‌ తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. జోగిపేటలోనూ ఇటీవల కర్షకులు ఆందోళనకు దిగారు. జిల్లాలో అత్యధికంగా వ్యవసాయమే ఆధారం ప్రతి ఏటా వానా కాలంలో పత్తి, వరి, కంది, సోయాబీన్‌, పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న, తదితర పంటలు సాగు చేస్తాకు. ఇందులో అత్యధికంగా ఈసారి వరి 78వేల ఎకరాలు సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతేడాదిలో వానా కాలంలో 1,13,783 ఎకరాల్లో సాగైంది. ఏటా ఇదే సమయంలో పచ్చిరొట్ట సాగుకు రైతులు ఏటా ఆసక్తి చూపుతారు. నాటు వేసే ముందు కలియదున్ని నాటు వేస్తారు. దీని వల్ల పైరుకు బలమని రైతుల నమ్మకం. ఇదే విషయాన్ని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తుంటారు. విత్తనాలు అవసరమైన వారు పట్టపాసు పుస్తకం, ఆధార్‌కార్డు జీరాక్స్‌ ప్రతులను తీసుకుని పీఏసీఎస్‌, ఆగ్రోస్‌ సేవా కేంద్రాలు, జాతీయ విత్తన కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌సీ)సంస్థ కేంద్రాలకు వెళ్లి తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే చాలా చోట్ల అందుబాటులో లేవు.

పరీక్షలు చేశాక విక్రయాలు

కలెక్టర్‌ నుంచి అనుమతి ఉన్నా దుకాణాలకు విత్తనాలు, ఎరువులు కేంద్రాలకు చేరుతాయి. ప్రభుత్వం వచ్చిన ప్రతి ఎరువులు, విత్తనాలను పరీక్షలు చేశాకే అమ్మాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. నకిలీ విత్తనాలు, ఎరువులు , పురుగుల మందుల వల్ల అన్నదాతలు మోసపోవద్దనేది లక్ష్యం.కేంద్రానికి విత్తనాలు వచ్చాయంటే చాలు అక్కడికి ఏఈవో వెళ్లి.. సంగారెడ్డిలోని భూసార పరీక్షల కేంద్రంలో విశ్లేషణకు పంపించాలి. వారు ఫలితాలు ఇచ్చాకే సరఫరా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జీలుగ, జనుము విత్తనాల నమానాలు 133 వచ్చాయని, 81 ఫలితాలు ఇచ్చామని భూసార పరీక్షల అధికారి తెలిపారు. నమూనాల పరీక్షలకు అయిదు రోజుల వరకు సమయం పడుతోందని అందువల్లే ఆలస్యమవుతోందని పేర్కొంటున్నారు.

సరఫరా తీరిలా.. (క్వింటాళ్లలో..)

* జీలుగ: 5,652

* జనుము: 2,500

* అందుబాటులో ఉన్న జీలుగ: 2,364, జనుము: 680

* ఇప్పటి వరకు సరఫరా చేసింది జీలుగ: 159, జనుము: 66


అందించేందుకు చర్యలు తీసుకుంటాం

కరుణాకర్‌రెడ్డి, ఇన్‌ఛార్జి జేడీ

జీలుగ, జనుము విత్తనాలు డిమాండ్‌ మేరకు జిల్లాకు ఇంకా పూర్తిగా రాలేదు. వచ్చినవి వచ్చినట్లుగా ఆయా విత్తనాలు కేంద్రాలకు పంపిస్తున్నాం. అనంతరం ల్యాబ్‌లో పరీక్షించాక రైతులకు పంపిణీ చేస్తున్నాం. 65శాతం పైగా భూమిలో తేమ శాతం ఉన్న సమయంలోనే ఏ పంటలైనా విత్తుకోవాలి. లేకపోతే మొలకెత్తవు. పచ్చిరొట్ట విత్తనాలు ఎకరానికి 10 నుంచి 12 కిలోలు సరిపోతుంది. ప్రభుత్వ 65శాతం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని