logo

25 ఎకరాలు.. 11వేల మొక్కలు

అటవీ రక్షణకు సంబంధిత శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఖాజీపల్లి బీట్‌లోని కిష్టాయపల్లి అడవిలో ఇప్పటికే నటుడు ప్రభాస్‌ వితరణ చేసిన రూ.2 కోట్ల పనులు కొలిక్కి వస్తున్నాయి.

Published : 24 May 2022 02:33 IST

కిష్టాయపల్లి అడవిలో నాటేందుకు ఏర్పాట్లు

న్యూస్‌టుడే, జిన్నారం


అటవీప్రాంతంలో చేపట్టిన చదును పనులు..

అటవీ రక్షణకు సంబంధిత శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఖాజీపల్లి బీట్‌లోని కిష్టాయపల్లి అడవిలో ఇప్పటికే నటుడు ప్రభాస్‌ వితరణ చేసిన రూ.2 కోట్ల పనులు కొలిక్కి వస్తున్నాయి. గతంలో రింగురోడ్డులో కోల్పోయిన భూమికి పరిహారంగా ఇక్కడ కేటాయిచిన 17 హెక్టార్లలోనూ అటవీ సంపదను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి తోడు క్రమంగా అంతరించిపోతున్న అటవీ మొక్కలను కాపాడుకునేందుకు తాజాగా కిష్టాయపల్లి అడవిలోని 25 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు పనులు చేపట్టిన నేపథ్యంలో కథనం.

పారిశ్రామికవాడ ఆనుకొని..

అడవుల్లోని కలప తరిగిపోతోంది. చిరు అడవులు కనుమరుగవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో జిన్నారం మండలం కిష్టాయపల్లి శివారులో.. అటు గడ్డపోతారం పారిశ్రామికవాడను.. ఇటు ఖాజీపల్లి అడవిని ఆనుకొని ప్లాంటేషన్‌ సిద్ధమవుతోంది. ప్రధానంగా అల్లనేరేడు, వేప, ఇప్ప, మొర్రి, నెమలినార, మారేడు, వెలగ, చీమచింతకాయ, రావి, మర్రి, జువ్వ, చింత, పనస, మద్ది, నల్లమద్ది, వాగుమద్ది తదితర మొక్కలను తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. కిష్టాయపల్లి అడవిలోని 25 ఎకరాల్లో 11వేల వరకు మొక్కలు నాటుతామని సంబంధిత శాఖాధికారులు ‘న్యూస్‌టుడే’కు వివరించారు. వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటేందుకు భూమిని చదును చేశారు. పిచ్చి మొక్కలను తొలగింపజేశారు. మొక్కలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని నర్సరీల నుంచి తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిని కాపాడేందుకు కార్యాచరణను సిద్ధం చేసి అమలు చేయనున్నారు.

కాలుష్యం నుంచి ఉపశమనానికి..

నగర శివారులోని చిల్కూరు వద్ద అటవీ ప్రాంతం రింగురోడ్డులో పోగా.. దానికి పరిహారంగా ఖాజీపల్లిలో 17 హెక్టార్లను కేటాయించారు. ఆయా అటవీ ప్రాంతాన్ని కొన్నేళ్లుగా అభివృద్ధి చేసి. రకరకాల మొక్కలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. నగరానికి సమీపంలో ఉన్న ఈ అటవీ ప్రాంతాన్ని అర్బన్‌ ఫారెస్ట్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందనుంది. వాచ్‌టవర్‌, నడక బాటలు వంటివి ఏర్పాటు చేయడం ద్వారా ప్రముఖులు ఇక్కడికి తరచూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెలవు దినాల్లో అటవీ ప్రాంతం భవిష్యత్తులో కిక్కిరిసి పోనుందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. ఇదే సమయంలో స్థానిక పారిశ్రామిక వాడల వల్ల నిత్యం వెలువడుతున్న కాలుష్యం నుంచి కొంతవరకైనా ఉపశమనం కలుగనుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కిష్టాయపల్లిలో చదును పనులు జరుగుతున్నాయని, మొక్కలు నాటేందుకు సిద్ధం చేస్తున్నామని అటవీశాఖ రేంజి అధికారి వీరేంద్రబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని