logo

సాగుకు బాసట.. పంచసూత్రాలు

ఇప్పటికే యాసంగిలో సాగు చేసిన పంటలు చేతికొచ్చాయి. కర్షకులు దిగుబడులను మార్కెట్‌కు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సాగు ప్రణాళికను ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఐదు అంశాలపై అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా వివరాలు ఇలా..

Published : 24 May 2022 02:33 IST


పచ్చిరొట్ట సాగును వివరిస్తూ..

ఇప్పటికే యాసంగిలో సాగు చేసిన పంటలు చేతికొచ్చాయి. కర్షకులు దిగుబడులను మార్కెట్‌కు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సాగు ప్రణాళికను ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఐదు అంశాలపై అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా వివరాలు ఇలా..

- న్యూస్‌టుడే, రామాయంపేట


రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

భూసారం పెరిగేలా..

ఏళ్లుగా రసాయనాల వాడకంతో భూమి సారం కోల్పోతుంది. భూమిలో సేంద్రియ కర్బనం తగ్గుతుండటంతో పంటను చీడపీడలు ఆశిస్తున్నాయి. వాటి నుంచి సంరక్షణకు పచ్చిరొట్ట దోహదపడుతుంది. జనుము, జీలుగ, పిల్లి పెసర, నవధాన్యాలు వంటివి సాగు చేస్తే భూసారం పెరుగుతుంది. 65 శాతం రాయితీపై అందిస్తున్నారు.

పీఎస్బీ వాడకం..

పంటకు కావాల్సిన ప్రధాన పోషకాల్లో భాస్వరం ఒకటి. భూమిలో పేరుకుపోయిన కాంప్లెక్సు, సూపర్‌ పాస్ఫెట్‌, డీఏపీని తిరిగి అందించేందుకు ఫాస్పరస్‌ సొల్యూబలైజింగ్‌ బ్యాక్టీరియా తోడ్పడుతుంది. ఎకరాకు 30 కిలోల పశువుల పేడలో, 2 కిలోల బెల్లం, 350 మి.లీ. పీఎస్బీని కలిపి వారం పాటు మాగబెట్టి పిచికారీ చేస్తే మేలు.

లాభాలు వచ్చేలా..

మన దగ్గర పండే పత్తికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. మరోవైపు అధిక సాంద్రత విధానంలో పత్తి సాగును ప్రయోగాత్మకంగా చేపడితే దిగుబడి పెరిగే అవకాశం ఉంది. ఇక పప్పు దినుసులకు మార్కెట్‌లో మద్దతు ధర అధికంగా ఉంది. ఈ మేరకు ఆయా వాటి సాగుకు ప్రోత్సహించనుంది.

సమగ్ర యాజమాన్యం..

వరి సాగులో మెలకువలు పాటిస్తే ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. వెదజల్లే పద్ధతి, డ్రమ్‌ సీడర్‌ విధానం మేలైనవి. కూలీల ఖర్చు తగ్గడంతో పాటు తొలకరి వానలకే షురూ చేసుకోవచ్ఛు పెట్టుబడి వ్యయం ఎకరాకు రూ.8 వేల వరకు తగ్గుతుంది. వెద పద్ధతిలో మొక్కలు, వరుసల మధ్య దూరం ఉండటం వల్ల గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడలు ఆశించవు.

మెలకువలు పాటిస్తే..

పంటకాలంలో ఎరువులు ఒకేసారి చల్లడం మంచిది కాదు. అలా కాకుండా పలు దఫాలుగా వాడాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మొక్కలకు నేరుగా అందడమే కాకుండా వృథా తగ్గుతుంది. పోషకాలు మొక్కకు నేరుగా అందడం వల్ల, ఖర్చు తగ్గడంతో పాటు పంట దిగుబడి పెరుగుతుంది.


నాణ్యతే ప్రధానం

మామిడి కోతలో రైతులు కొన్ని మెలకువలు పాటిస్తే విపణిలో మంచి ధర లభిస్తుందని ఉద్యాన శాఖ అధికారి భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే మామిడి కోతలు ఆరంభమయ్యాయి. చాలా ప్రాంతాల్లో బంగినినపల్లి 50 శాతం కోతలు పూర్తవగా, దసేరి కోత దశలో ఉంది. మార్కెట్‌లో మంచి ధర రావాలంటే కాయల నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే జీడి అంటకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. కోసేటప్పుడు కాయకు ఒక అంగుళం తొడిమ ఉండేలా చూసుకోవాలి.

- న్యూస్‌టుడే, నంగునూరు


ఆయిల్‌పామ్‌ రైతులకు ‘బిందు’ రాయితీ

ఆయిల్‌పామ్‌ సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తాజాగా రాయితీ పథకాన్ని అమల్లోకి తెచ్చిందని ఉద్యాన శాఖ జిల్లా అధికారిణి రామలక్ష్మీ తెలిపారు. బిందు సేద్యం పరికరాలను రాయితీపై అందించనుంది. పట్టాపాసుపుస్తకం, 1బీ పత్రం, ఆధార్‌, బ్యాంకు పాసుపుస్తకం, ఫొటోతో సహా దరఖాస్తు చేయాలి. ఉద్యాన అధికారికి సైతం ఆయా పత్రాలు ఇవ్వాలి.

రాయితీ: ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రభుత్వం 100 శాతం రాయితీపై అందిస్తుంది. జీఎస్‌టీ మాత్రం చెల్లించాలి. సన్న, చిన్నకారు (ఐదు ఎకరాల్లోపు) రైతులకు 90 శాతం రాయితీ లభిస్తుంది. పెద్ద రైతులకు (ఐదు ఎకరాలకు పైగా) 80 శాతం రాయితీ. ఒక్కొక్కరికి 5 హెక్టార్ల వరకు మాత్రమే రాయితీ అందిస్తారు. వివరాలకు ‘టీఎస్‌ఎంఐపీ’ వెబ్‌సైట్‌లో సంప్రదించాలి.

- న్యూస్‌టుడే, చేర్యాల


సమయం స్వల్పం.. ఆదాయం అధికం

అతడో సాధారణ రైతు. మార్కెట్‌కు అనుగుణంగా పంటలు పండిస్తూ లాభాలు ఆర్జించడంలో మాత్రం దిట్ట. ఆయనే గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామానికి చెందిన సయ్యద్‌ అజీజ్‌. ఈయనకు రెండెకరాల పొలం ఉంది. మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. వ్యవసాయ కుటుంబం కావడంతో చిన్నతనంలోనే సాగుపై మక్కువ ఏర్పడింది. తండ్రికి చేదోడుగా ఉండి మెలకువలు నేర్చుకున్నారు. కాలానికి అనుగుణంగా ఏ పంటకు మంచి ధర పలుకుతుందో బేరీజు వేసుకుని సాగు చేస్తుంటారు. కౌలుకు తీసుకున్న భూమిలో వరి వేశారు. ఇక తన సొంత పొలంలో రెండు నెలల కిందట బెండ తోట వేశారు. ఉద్యాన అధికారుల సూచనల ప్రకారం అడుగేశారు. తెగుళ్లు రాకుండా అన్ని జాగ్రత్తలు పాటించారు. విత్తనాల దగ్గరి నుంచి కలుపు నివారణ, తదితర వాటికి రూ.30 వేల వరకు ఖర్చయింది. ఇప్పటి వరకు 2 కాతల పంట చేతికొచ్చింది. దిగుబడులను విక్రయించగా.. రూ.85 వేల వరకు వచ్చింది. ఖర్చులన్నీ పోగా రూ.55 వేలు మిగిలాయి. మరో 8 కాతల వరకు పంట వచ్చే అవకాశం ఉంది. ఇదంతా లాభాల పంటే. కూరగాయల సాగుతో తక్కువ పెట్టుబడితో అనుకున్న స్థాయిలో లాభాలు రావడం ఖాయమని చెబుతున్నారీ రైతు.

- న్యూస్‌టుడే, గుమ్మడిదల


ప్రశ్న.. సమాధానం..

ప్రశ్న: తీగజాతి కూరగాయల్లో పండు ఈగ నివారణకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

- సక్రి, హత్నూర

సమాధానం: మలాథియాన్‌ 2 మి.లీ. లేదా ప్రొఫినోపాస్‌ 2 మి.లీ... ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది.

-బాల్‌రెడ్డి, ఏవో, చిలప్‌చెడ్‌

-న్యూస్‌టుడే, చిలప్‌చెడ్‌

సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబరు 94938 40360

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని