logo

అంచనాల ఆర్భాటం.. పనుల తాత్సారం!

సర్కారు పాఠశాలల్లో వసతులు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగానే ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బడులు ప్రారంభించే లోపు పనులు పూర్తి చేయాలని నిర్దేశించుకున్నారు.

Updated : 25 May 2022 04:31 IST

మన ఊరు- మన బడి కార్యక్రమం అమలు తీరిలా


బొల్లారంలో వంటగది నిర్మాణం

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, సంగారెడ్డి మున్సిపాలిటీ: సర్కారు పాఠశాలల్లో వసతులు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగానే ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బడులు ప్రారంభించే లోపు పనులు పూర్తి చేయాలని నిర్దేశించుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, క్షేత్ర స్థాయిలో టెండర్లు, ఒప్పందాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఒక వైపు గడువు దగ్గర పడుతోంది. ఇటువంటి సమయంలో హడావుడిగా పనులు చేస్తే నాణ్యత ఏమేరకు ఉంటుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిని అధిగమించాలంటే ఇంజినీరింగ్‌ శాఖల మధ్య సమన్వయం అవసరం.

జిల్లాలో ఈ పథకంలో భాగంగా బడుల బలోపేతానికి తొలి విడతలో 441 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిల్లో సౌకర్యాల కల్పనకు రూ.217 కోట్లు అవసరం అవుతాయని అంచనా రూపొందించారు. వీటిల్లో 396 బడులకు రూ.13.43 కోట్ల అవసరమవుతాయని సంబంధిత శాఖ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు లెక్క తేల్చారు. వీటిని మూడు విభాగాలుగా చేపట్టాలన్నది నిబంధన. దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది.

* మొదటగా రూ.2 లక్షల నుంచి 30లక్షల లోపు వరకు జిల్లా స్థాయిలో పనులు చేపట్టనున్నారు. వీటికి టెండరు నిర్వహించరు. విద్యాకమిటీ ఛైర్మన్‌, ప్రధానోపాధ్యాయుడికి సంయుక్త చెక్‌ పవర్‌ ఉంటుంది. ఇలా జిల్లాలో 293 బడుల్లో పనులను గుర్తించారు. వీటిలో 172 పనులు ప్రగతిలో ఉండగా, ఇంకా 121 ప్రారంభానికి నోచుకోలేదు.

* రెండులో రూ.30 లక్షలకుపైగా ఉన్న వాటిని 58గా గుర్తించారు. వీటికి రూ.35.20 కోట్లు ప్రతిపాదించారు. 19 పనులకు టెండర్లు పిలిచారు. రాష్ట్రస్థాయిలో అనుమతి తీసుకుని పనులు చేయాల్సి ఉంటుంది.

* మూడులో ఉపాధి హామీ పథకం నిధులను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు వెచ్చించనున్నారు. ఇందులో 136 పాఠశాలల్లో చేపట్టాలని,  రూ.22.02కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా రూపొందించారు. వీటిలో 18 పనులు ప్రగతిలో ఉండగా, 118 ప్రారంభానికే నోచలేదు.  పనులు చేసేందుకు కూలీలు అందుబాటులో లేరని,  విద్యాకమిటీ ఛైర్మన్లు ఉత్సాహం చూపడంలేదని, ఇంజినీరింగ్‌ విభాగాల మధ్య సమన్వయ లోపం వల్ల తాత్సారం జరగుతోందని అధికారులు పేర్కొంటున్నారు.  

నిత్యం సమీక్షిస్తున్నాం: జగదీశ్వర్‌ పీఆర్‌ ఈఈ, రాంకుమార్‌, డిప్యూటీ ఈఈ,సంగారెడ్డి

ఎంపికైన పాఠశాలల్లో పనులు వేగంగా జరిగేలా చూస్తాం. పలు చోట్ల ఇప్పటికే ఆరంభించాం. టెండర్లు పిలిచిన వాటిలో ఒప్పందం చేసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు అదనపు కలెక్టర్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. రోజువారీగా నివేదిక అందజేస్తున్నాం. జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని