logo

ఉన్నత విద్యకు గ్రహణం వీడేనా..!

‘ప్రధాన పట్టణమైన తూప్రాన్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. వచ్చే ఏడాది నుంచే డిగ్రీ కళాశాలలో తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నా. తూప్రాన్‌ సమీప గ్రామాల విద్యార్థులు హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు

Published : 24 Jun 2022 02:26 IST

తూప్రాన్‌, రామాయంపేటల్లో ఏర్పాటు కాని డిగ్రీ కళాశాలలు

తూప్రాన్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలం ఇదే..

‘ప్రధాన పట్టణమైన తూప్రాన్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. వచ్చే ఏడాది నుంచే డిగ్రీ కళాశాలలో తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నా. తూప్రాన్‌ సమీప గ్రామాల విద్యార్థులు హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు తీరుతాయి. సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటాం.’
- సీఎం కేసీఆర్‌ (2018లో తూప్రాన్‌లో 50 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా..)

ఇలా సాక్షాత్తూ ముఖ్యమంత్రినే హామీ ఇచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా.. ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. అంతకంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం ఇదే హామీ ఇచ్చారు. జిల్లాలోని ప్రధాన పట్టణాలైన తూప్రాన్‌, రామాయంపేట పట్టణాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల కాలంగా కళాశాలల ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం.
దూర ప్రాంతాలకు వెళ్లాల్సిందే.. :
జిల్లా కేంద్రం మెదక్‌, నర్సాపూర్‌ సమీపంలోని పెద్దచింతకుంటలో ప్రభుత్వం డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేసింది. ఇక తూప్రాన్‌, రామాయంపేట పట్టణాల్లో వీటి ఊసే లేకపోవడంతో కొన్నేళ్లుగా ఎంతోమంది విద్యార్థులు ఇంటర్‌తోనే చదువుకు స్వస్తి పలుకుతున్నారు. ఉన్నత విద్యాభ్యాసానికి తూప్రాన్‌వాసులు హైదరాబాద్‌, గజ్వేల్‌, రామాయంపేట సమీప గ్రామాల ప్రజలు మెదక్‌, కామారెడ్డి, సిద్దిపేటకు వెళ్లాల్సిందే. దూర ప్రాంతాలకు వెళ్లక తప్పని పరిస్థితి.
55 కి.మీ. పరిధిలో.. : దేశంలో అత్యంత పొడవైన 44వ జాతీయ రహదారితో తూప్రాన్‌, రామాయంపేట పట్టణాలు విస్తరించి ఉన్నాయి. సదరు జాతీయ రహదారి జిల్లాలో విస్తరించి ఉన్న 55 కి.మీ. పరిధిలోని మనోహరాబాద్‌, తూప్రాన్‌, మాసాయిపేట, చేగుంట, నార్సింగి, రామాయంపేట మండలాల పరిధిలో ఒక్కటంటే ఒక్క కళాశాల లేకపోవడం గమనార్హం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. నెలకు వేలాది రూపాయలు ఫీజులు చెల్లించలేక, కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకోలేక నానాఅవస్థలు పడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు ఈ ఏడాదైనా ఆయా చోట్ల కళాశాలల ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటే మేలు చేసినట్లవుతుంది.

ఏటా 1300 మంది వరకు..
తూప్రాన్‌, రామాయంపేటల్లో ప్రతి ఏటా 1300 మంది వరకు ఇంటర్‌ పూర్తి చేసి బయటకు వస్తున్నారు. వీరిలో ఆర్థికంగా ఉన్న వారు దూర ప్రాంతాలకు వెళ్తుండగా.. ఇక కూలీల పిల్లలు ఇక్కడితోనే ఆపేస్తున్నారు. 50 శాతం మంది మాత్రమే అష్టకష్టాలు పడి డిగ్రీ విద్యను పూర్తి చేస్తుండటం గమనార్హం. తూప్రాన్‌లో గతంలో కళాశాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు సైతం ప్రతిపాదించారు. ఆ తర్వాత దాని ఊసే మరిచారు. రామాయంపేటలో చాలా కాలంగా కళాశాల ఏర్పాటుకు స్థానికుల నుంచి డిమాండ్‌ వినిపిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.


సమస్యను గుర్తించాలి
తూప్రాన్‌ డివిజన్‌ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో ప్రతి ఏటా వందలాది మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. స్థలం కేటాయించినా కళాశాల మంజూరు మాత్రం కాలేదు. ఇక్కడున్న అధికారులు పాలకులు ప్రత్యేక దృష్టిసారించి చొరవ చూపాలి. లేదంటే రానున్న రోజుల్లో మరింత మంది చదువు మధ్యలో మానేసే అవకాశం ఉంది.
- సాయికుమార్‌, స్థానికుడు


మూడేళ్ల క్రితమే..
తూప్రాన్‌లో మూడేళ్ల క్రితమే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాం. ప్రస్తుతం జూనియర్‌ కళాశాల సమీపంలోనే కళాశాల నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని గుర్తించి అధికారులకు నివేదిక అందించాం. కళాశాల మంజూరు కాగానే పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
- శ్యామ్‌ప్రకాశ్‌, ఆర్డీవో, తూప్రాన్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని