logo

ధరణిలో సమూల మార్పులకు..శ్రీకారం

ఎన్నో దశాబ్దాలుగా నెలకొన్న భూదస్త్రాల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చింది. ఇందులో కొన్ని భూసమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని వాపోతున్నారు.

Published : 24 Jun 2022 02:26 IST

నమూనాగా ములుగులో సమస్యల పరిష్కారం
భారీగా వస్తున్న ఫిర్యాదులు

ములుగు పంచాయతీ కార్యాలయం వద్ద  అర్జీదారులు

ఎన్నో దశాబ్దాలుగా నెలకొన్న భూదస్త్రాల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చింది. ఇందులో కొన్ని భూసమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని వాపోతున్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి కొందరు నాయకులు తీసుకువెళ్లారు. స్పందించిన సీఎం.. క్షేత్రస్థాయిలో భూ సమస్యలను పరిశీలించి.. పరిష్కార మార్గాలు చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఇటీవల మంత్రి హరీశ్‌రావు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ములుగులో నేరుగా రైతులతో మాట్లాడారు. వారి నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. ప్రస్తుతం వాటిని అధికారులు పరిశీలించి.. పరిష్కారం చూపుతున్నారు. ధరణి పోర్టల్‌లో లేని అంశాలను అందులో చేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా ములుగును తీసుకున్నారు. ఇందులోభాగంగా భూ సమస్యలు లేని గ్రామంగా చేయనున్నారు.
పలు సమస్యలు..
పట్టా ఉన్నవి ప్రభుత్వభూములుగా మారిపోవడం, సాదాబైనామా, మ్యూటేషన్‌, భూములు కోల్పోయినవారికి పరిహారం రానివి, సర్వే నెంబర్ల తారుమారు, తప్పుల సవరణ తదితర సమస్యలు అధికారులు దృష్టికి వచ్చాయి. పోర్టల్‌లో కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని.. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు ములుగుకు చెందిన డీసీసీబీ డైరెక్టర్‌ భట్టు అంజిరెడ్డి అన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫిర్యాదుదారుల సమక్షంలోనే..
ప్రత్యేకంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో స్థానిక రైతుల నుంచి 186 ఫిర్యాదులు వచ్చాయి. ఇవి కాకుండా తాజాగా 86 మంది.. అధికారులకు అర్జీలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వీటిని పూర్తి స్థాయిలో పరిష్కరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ముగ్గురు తహసీల్దార్లు, నలుగురు ఉప తహసీల్దారులతో పాటు 22 మంది సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, జిల్లా అదనపు పాలనాధికారి శ్రీనివాస్‌రెడ్డి, గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. దగ్గరుండి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ములుగు పంచాయతీ కార్యాలయంలో రైతుల ఫిర్యాదులను వారి సమక్షంలోనే పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి సమస్యను ధరణి పోర్టల్‌లో నమోదు చేసేందుకు ప్రత్యేకంగా పంచాయతీ కార్యాలయం ఆవరణలోనే 12 మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ 20 మంది రైతుల ఫిర్యాదులను పరిశీలించి పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు. ఈ అంశాలను ఎప్పటికప్పుడు ధరణి పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు.


మార్పులు చేస్తున్నాం....
రాష్ట్రంలోనే ములుగును భూసమస్యలు లేని గ్రామంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కోర్టు కేసులు, కుటుంబ తగాదాలు లేని సమస్యలన్నింటిని పరిష్కరిస్తాం. ప్రక్రియ పూర్తి కాగానే ధరణిలో మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. త్వరలోనే ములుగులో అన్ని సమస్యలను పరిష్కరించి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను అందిస్తాం.
- ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సిద్దిపేట జిల్లా పాలనాధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని