logo

ఉపాధికి మార్గం... భవితకు ఊతం

నవ భారత్‌..కొత్త అవసరాలు..ఆధునిక సమృద్ధి..ఈ నినాదాలతోనే కేంద్రం ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్‌ మేళాలకు శ్రీకారం చుట్టింది. ఐటీఐ విద్యార్థులకు ఇది వరంలా మారనుంది.

Published : 24 Jun 2022 02:51 IST

ఐటీఐ విద్యార్థులతో అప్రెంటిస్‌షిప్‌ మేళాలు

నెలకోసారి నిర్వహణకు ఉత్తర్వులు
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

నవ భారత్‌..కొత్త అవసరాలు..ఆధునిక సమృద్ధి..ఈ నినాదాలతోనే కేంద్రం ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్‌ మేళాలకు శ్రీకారం చుట్టింది. ఐటీఐ విద్యార్థులకు ఇది వరంలా మారనుంది. ఈ మేళాల ద్వారా ఐటీఐ విద్యార్థులు కోర్సు పూర్తికాగానే తమకు నచ్చిన కంపెనీలో అప్రెంటిస్‌షిప్‌లో చేరేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రతినెలా మేళాలు ఏర్పాటుచేయాలని ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో కథనం.
ఏర్పాటు ఉద్దేశం నెరవేరేలా..
విద్యార్థులకు ఉపాధి అవకాశాలు దక్కేలా చేయాలన్న ఉద్దేశంతో పారిశ్రామిక శిక్షణ సంస్థలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇక్కడ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నారు. జీవితంలో వెంటనే స్థిరపడాలనుకునే విద్యార్థులు ఐటీఐ కోర్సులనే ఎంపికచేసుకుంటున్నారు. పూర్తికాగానే అప్రెంటిస్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది.  
ఎదురుచూపులకు చెల్లు
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 35 ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ ఏడు. సంగారెడ్డి, సిద్దిపేటలో మూడు చొప్పున ఉండగా మెదక్‌లో ఒకటి మాత్రమే ప్రభుత్వ ఐటీఐ ఉండటం గమనార్హం. వీటిలో  చదువున్న విద్యార్థులు 18వేల మంది. ప్రతి సంవత్సరం కోర్సు పూర్తిచేసుకునే వారు 5వేల మందికి పైగా ఉంటారు. వీరు అప్రెంటిస్‌షిప్‌ కోసం ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల పిలుపుకోసం ఎదురుచూడాల్సి వస్తోంది. పరిశ్రమలకు వెళ్లి దరఖాస్తులు సమర్పించినా ఒక్కోసారి ఫలితం ఉండటంలేదు. ఇదే సమయంలో కొన్ని పరిశ్రమలకు సరైన అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఇలాంటి తరుణంలో అభ్యర్థులు, పరిశ్రమల ప్రతినిధులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు రూపొందించిన ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్‌ మేళాలు ఇద్దరి సమస్యను తీర్చనున్నాయి.  
ఆధునిక యంత్రాలపై పట్టు
మారుతున్న కాలానికి అనుగుణంగా పరిశ్రమ యాజమాన్యాలు భారీ ఉత్పత్తులు, పెట్టుబడి వ్యయం నియంత్రణ, లాభాల పెంపు లక్ష్యంగా ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం ఐటీఐ కళాశాలల్లో ఇందుకు అనుగుణంగా యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. అప్రెంటిస్‌షిప్‌లో చేరే విద్యార్థులకు యంత్రాల వినియోగంపై అవగాహన పెరుగుతుంది.  
మంచి అవకాశం :  రాజేశ్వరరావు, ప్రిన్సిపల్‌, ప్రభుత్వ ఐటీఐ, సంగారెడ్డి
ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్‌ మేళా కార్యక్రమంలో భాగంగా ప్రతినెలా మేళాలు నిర్వహించాలని ఉత్తర్వులు వచ్చిన మాటవాస్తవమే. ఐటీఐ పూర్తిచేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్రెంటిస్‌షిప్‌ కోసం గతంలో పరిశ్రమల చుట్టూ తిరగాల్సివచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. మేళాకు పరిశ్రమల ప్రతినిధులు హాజరవుతూ ప్రతిభ ఆధారంగా అవకాశాలు కల్పిస్తున్నారు.

 


వివరాలు.. ఇలా..
జిల్లా   కళాశాలలు        
ప్రభుత్వ ప్రైవేటు
సంగారెడ్డి 03 15
మెదక్‌ 01 06
సిద్దిపేట 03 07
వికారాబాద్‌ 01 02

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని