logo

చెరువు దారిలో..మురుగు

ఆహ్లాదకరంగా చెరువులను మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక వేస్తుంటే.. మరోవైపు నీటి వనరులకు మురుగు కాలువను అనుసంధానిస్తూ కాలుష్య కాసారాలుగా స్థానిక యంత్రాంగం మార్చేస్తోంది. దుబ్బాక పురపాలికలో మురుగు కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది

Published : 24 Jun 2022 02:51 IST

మోస్తరు వానకే దుబ్బాక అస్తవ్యస్తం

రామసముద్రం చెరువులో కలుస్తున్న  మురుగు

ఆహ్లాదకరంగా చెరువులను మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక వేస్తుంటే.. మరోవైపు నీటి వనరులకు మురుగు కాలువను అనుసంధానిస్తూ కాలుష్య కాసారాలుగా స్థానిక యంత్రాంగం మార్చేస్తోంది. దుబ్బాక పురపాలికలో మురుగు కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. పురపాలికగా ఆవిర్భవించి 8 సంవత్సరాలు గడుస్తున్నా పంచాయతీ నాటి అవస్థలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. 20 వార్డులు, 35 వేల జనాభా ఉన్న పురపాలికలో మూడు సంవత్సరాల నుంచి ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ.2.2 కోట్లతో వార్డుల్లో సీసీ మురుగు కాల్వలను నిర్మించారు. కొన్ని వార్డుల్లో 30 సంవత్సరాల క్రితం నాటి రాళ్ల కట్టడంతో నిర్మితమైన మురుగు కాల్వలు ఉన్నాయి. అవి అధ్వానంగా తయారయ్యాయి. మురుగు పారుదలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సీసీ రహదారుల ఎత్తు పెంచారు. ఇళ్లు లోతట్టుగా మారాయి. మోస్తరు వర్షానికే మురుగు కాల్వల్లో ప్రవాహం పోయే దారి లేక ఇళ్లల్లోకి చేరుతున్నాయి. వర్షం కురిసిపుడు కొన్ని వార్డుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌, బస్‌ డిపో, అంగడి బజార్‌, సీఎం కేసీఆర్‌ పాఠశాల వద్ద రహదారులు నీరు, బురదతో అస్తవ్యస్తంగా అవుతున్నాయి. వాన నీరు రోజుల తరబడి నిలిచి మురికి కూపంలా మారుతున్నాయి. పురపాలికలో 15, 16, 17, 18, 19, 20 వార్డుల్లోని వరద, మురుగు నీరు రామసముద్రం చెరువులోకి చేరుతోంది. 12, 13, 14 వార్డుల్లో మురుగు నీరు పెద్ద చెరువు, మరి కొన్ని వార్డుల్లో నుంచి దుంపలపల్లికి వెళ్లే దారిలోని ఎదుల్లా చెరువు, బైపాస్‌ రోడ్డు నుంచి ధర్మాజీపేట చెరువులోకి చేరుతున్నాయి. ఫలితంగా మిషన్‌ కాకతీయ ద్వారా కోట్ల రూపాయలు పెట్టి చెరువుల అభివృద్ధి చేస్తున్నా మురుగు నీటితో కలుషితంగా మారుతున్నాయి. పురపాలికలో నాలాలు లేవు. రెండేళ్ల క్రితం కొన్ని చోట్ల లోతు, వెడల్పు ఎక్కువగా ఉన్న వర్షపు నీటి ప్రవాహ కాల్వలు నిర్మించారు. సిద్దిపేట, గజ్వేల్‌ తరహాలో భూగర్భ మురుగు నీటి కాల్వలు నిర్మించాలని పుర ప్రజలు కోరుతున్నారు.


రూ.4.5 కోట్లతో కాల్వలు నిర్మిస్తాం
పురపాలికలో కొన్ని చోట్ల మురుగు నీటి కాల్వలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రస్తుతం చేపడుతున్న రూ.20 కోట్ల అభివృద్ధి పనులలో రూ.4.5 కోట్లతో పలు వార్డుల్లో నూతనంగా మురుగు కాల్వలు నిర్మిస్తాం. వాన నీరు ఇళ్లలోకి చేరి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో పురపాలికలో భూగర్భ మురుగు కాల్వలు నిర్మిస్తాం. రహదారులను మరమ్మతు చేస్తాం.
-గణేశ్‌రెడ్డి, పురపాలిక కమిషనర్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని