logo

తూలుతూ.. తోలుతూ!

మద్యం మత్తులో వాహన చోదకులు రోడ్డెక్కుతున్నారు. పోలీసులు తరచూ హెచ్చరిస్తున్నా.. బేఖాతరు చేస్తున్నారు. తనిఖీల్లో పోలీసులకు చిక్కిన వారికి జరిమానా విధిస్తున్నా.. కొందరికి జైలు శిక్ష ఖరారవుతున్నా.. చోదకుల్లో మార్పు రాకపోవడం ఆందోళనకర పరిణామం.

Published : 24 Jun 2022 02:51 IST

మద్యం మత్తులో రోడ్డెక్కుతున్న వాహనదారులు
ఐదు నెలల్లో...1,145 కేసులు
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌

వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు

మద్యం మత్తులో వాహన చోదకులు రోడ్డెక్కుతున్నారు. పోలీసులు తరచూ హెచ్చరిస్తున్నా.. బేఖాతరు చేస్తున్నారు. తనిఖీల్లో పోలీసులకు చిక్కిన వారికి జరిమానా విధిస్తున్నా.. కొందరికి జైలు శిక్ష ఖరారవుతున్నా.. చోదకుల్లో మార్పు రాకపోవడం ఆందోళనకర పరిణామం. మద్యం మత్తులో వాహనాలు నడిపించడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇతర వాహనదారులకూ ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో గత ఐదు నెలల్లో 1,145 డ్రంక్‌అండ్‌డ్రైవ్‌ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో కథనం.
నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నా..
జిల్లాలో సంగారెడ్డి, పటాన్‌చెరు, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ పోలీసు సబ్‌ డివిజన్‌లున్నాయి. వాటి పరిధిలో ఎనిమిది సర్కిల్‌ కార్యాలయాలతో 33 మహిళా, ట్రాఫిక్‌, సీసీఎస్‌, శాంతి భద్రతల ఠాణాలున్నాయి. డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది నిత్యం గస్తీ నిర్వహిస్తూనే.. మరో వైపు వాహన తనిఖీలు చేపడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు బ్రీత్‌ ఎనలైజర్‌ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా పట్టుబడిన వారికి రూ.2వేల వరకు జరిమానా, లేదంటే జైలు శిక్ష, కొందరికి రెండింటినీ కోర్టులు విధిస్తున్నాయి. రెండోసారి మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కితే వారం రోజుల పాటు జైలు శిక్షతోపాటు ఆరు నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్సు రద్దుకు పోలీసులు వెనుకంజ వేయడం లేదు. ఇంతా కఠినôగా వ్యవహరిస్తున్నా.. మద్యం ప్రియుల్లో మార్పు రాకపోవడం గమనార్హం. ఇలాంటి వారి వల్ల జిల్లాలో రోజుకు సగటున రెండు ప్రమాదాలు జరగుతుండగా.. పలువురు క్షతగాత్రులవుతున్నాయి. కొందరు ప్రాణాలొదులుతున్నారు.
కౌన్సెలింగ్‌తోనూ.. కనిపించని మార్పు
జిల్లాలో మద్యం తాగి రోడ్డెక్కిన వారిలో కొందరు బాలలూ ఉంటున్నారు. ఇలాంటి వారి పట్టుబడితే.. తల్లిదండ్రులను పిలిపించి ఠాణాల్లో కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. మరోసారి ఇలా చేయవద్దంటూ హెచ్చరించి వదిలేస్తున్నారు. దీంతో పాటు తరచూ రహదారుల వెంట, పోలీస్టేషన్లలో పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మత్తులో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతున్న తీరు, వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్న దృష్టాంతాలనూ ఉదహరిస్తున్నారు. ఇంత చేసినా.. తాగి రోడ్డెక్కేవారిలో పెద్దగా మార్పు కనిపించడం లేదని పోలీసులే చెబుతుండటం గమనార్హం. గత ఐదు నెలల్లో మద్యం తాగి వాహనాలతో రోడ్కెనవారు 1,145 మంది పోలీసులకు చిక్కారు. ఈ కాలంలో రూ.135.16 లక్షల జరిమానా వసూలయింది. ఇలా పోలీసులకు పట్టుబడుతున్న వారిలో యువతే ఎక్కువగా ఉండటం ఆందోళనకర పరిణామం. గత ఐదు నెలల్లో మద్యం తాగి పోలీసులకు చిక్కిన కేసుల్లో ఆరుగురికి కోర్టు జైలు శిక్ష విధించింది.


డ్రంక్‌అండ్‌డ్రైవ్‌ కేసులిలా..
(జనవరి 1 నుంచి మే 31 వరకు)
నెల కేసులు జరిమానా
(రూ.లక్షల్లో)
జనవరి 202 3.31
ఫిబ్రవరి 55 0.65
మార్చి 256   39.70
ఏప్రిల్‌ 219 36.00
మే 413 55.50


నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
- బాలాజీనాయక్‌, డీఎస్పీ, సంగారెడ్డి

మద్యం తాగి వాహనాలు నడిపించడం చట్టరీత్యా నేరం. వాహనాలతో రోడ్డెక్కేటప్పుడు అన్ని పత్రాలు ఉన్నాయా.. లేవా.. అని గమనించుకోవాలి. రహదారి నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. ప్రమాదానికి గురైతే కుటుంబీకులు ఇబ్బంది పడతారనే విషయాన్ని విస్మరించవద్దు. ప్రధానంగా యువత మద్యం మత్తులో వాహనాలు నడపడం, ప్రమాదాలకు గురవడం ఆందోళనకరం. ఇలాంటి వారిని గుర్తించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నా.. చాలామందిలో మార్పు రావడం లేదు. వారి విలువైన భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నాం.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు