logo

క్వారీల నిర్వాకం.. పేలుళ్ల భయం

క్వారీల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు చేపడుతుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామాన్ని దుమ్ము కమ్మేయడంతో పాటు.. రసాయనాల ఘాటుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

Published : 24 Jun 2022 02:51 IST

న్యూస్‌టుడే, జిన్నారం

ఖాజీపల్లి గ్రామాన్ని కమ్మేసిన దుమ్ము

క్వారీల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు చేపడుతుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామాన్ని దుమ్ము కమ్మేయడంతో పాటు.. రసాయనాల ఘాటుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిన్నారం మండల పరిధిలోని పలు కంకర క్వారీల నిర్వాహకుల తీరుతో ఎదురవుతున్న ఇక్కట్లివి. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు. జిన్నారం మండలం ఖాజీపల్లి, మాదారం, మంత్రికుంట, కొర్లకుంట గ్రామాలకు కంకర క్వారీల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అధికారులు విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు విన్నవిస్తున్న తీరుపై కథనం.
ఇళ్లకు బీటలు...
క్వారీల వద్ద నిర్వహించే పేలుళ్ల వల్ల సమీపంలోని పంట పొలాలు రాళ్లతో నిండిపోతున్నాయి. వ్యవసాయ బోర్లు కూరుకుపోవడం, తెల్లటి రాతి పొడి గ్రామాలపై పొగలా చేరుతోంది. దీనికి తోడు రసాయనాల ఘాటుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిన్నారం మండలం ఖాజీపల్లిలో వారం వ్యవధితో రెండుసార్లు ఇలాంటి పరిస్థితి ప్రజలు ఎదుర్కొన్నారు. మంత్రికుంట, మాదారంవాసులదీ నిత్యం ఇదే దయనీయ పరిస్థితి. పేలుళ్ల కోసం వినియోగించే సామగ్రిలో రసాయనాలు వాడటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తే.. పేలుళ్ల వ్యవహారం తమ పరిధిలోకి రాదని అంటున్నారని పలువురు తెలిపారు. మండలంలోని రాళ్లకత్వ, శివానగర్‌, దాదిగూడెంలోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది.
అధిక సామర్ధ్యం వల్లనే...
క్వారీల నిర్వాహకులు పరిమితికి మించి మందు గుండును వినియోగిస్తున్నారు. తవ్వకాల కోసం కొన్ని అడుగుల లోతు వరకు రంధ్రాలు చేసే యంత్రాలున్నాయి. ఇందులో అమ్మోనియంతోపాటు.. మూడు రకాల రసాయన పదార్థారాలు వినియోగిస్తున్నారు. దీంతో అధిక సామర్ధ్యం పేలుళ్లు జరిగి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇటీవల మాదారం, రాళ్లకత్వ శివారులో నూతనంగా ఏర్పాటు చేసే క్వారీలను గ్రామస్థులు మూకుమ్మడిగా అడ్డుకున్నారంటే.. క్వారీల నిర్వాహకుల తీరును అర్థం చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో రసాయన పరిశ్రమల ప్రభావం కంటే క్వారీల సమస్య అధికమవుతోందనే ఆరోపణలున్నాయి. చాలా క్వారీలు పలుకుబడి కలిగిన నేతలవే కావడంతో అధికారులు చర్యలకు వెనుకంజ వేస్తున్నారనే విమర్శలున్నాయి. మండల సర్వసభ్య సమావేశం, జిల్లా పరిషత్‌ సమావేశాల్లో పలు పర్యాయాలు క్వారీల నిర్వహణ తీరుపై చర్చలు జరిగినా.. పరిస్థితిలో మార్పు రాలేదు. ఇకనైనా సమస్య పరిష్కారానికి వివిధ విభాగాల అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
దుమ్ము మాత్రమే మా పరిధి...: - రవికుమార్‌, పీసీబీ ఈఈ
క్వారీల వల్ల వచ్చే దుమ్ము మాత్రమే మా పరిధిలోకి వస్తుంది. బ్లాస్టింగ్‌ విషయాన్ని మైనింగ్‌ శాఖ చూసుకుంటుంది. గాలిలో దుమ్ము ఎంత మేరకు కలుస్తోంది.. ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్న తీరుపై విచారణ చేస్తాం. వాస్తవమని తేలితే క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.
యాజమాన్యాలను హెచ్చరించాం..: రమేశ్‌, ఆర్‌ఐ, మైనింగ్‌ శాఖ
క్వారీల్లో పేలుళ్ల సమస్య మా దృష్టికి వచ్చింది. సంబంధిత యాజమాన్యాలను హెచ్చరించాం. నిబంధనలు పాటించాలని స్పష్టం చేశాం. లేదంటే మూసేయాలని ఆదేశించాం. కొత్తరకం బ్లాస్టర్ల వల్ల ఇలా జరిగిందని చెప్పారు. సమస్య పునరావృతం కాదని హామీ ఇచ్చారు. నిఘా ఏర్పాటు చేసి.. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటాం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని