logo

మంత్రి ఆదేశాలు పాటించరు.. వైద్యసేవలు అందించరు!

వైద్యసేవలు అందించడానికి కోట్లాది రూపాయలతో నిర్మించిన భవనం అది. కార్పొరేట్‌ తరహాలో వసతులు సమకూర్చారు. భవనాన్ని ప్రారంభించి నాలుగు వారాలు కావొస్తున్నా.. ఇప్పటికీ సేవలు మాత్రం అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. మెదక్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల

Updated : 25 Jun 2022 04:26 IST

ఎంసీహెచ్‌ ప్రారంభించి 28 రోజులు..

న్యూస్‌టుడే, మెదక్‌

వైద్యసేవలు అందించడానికి కోట్లాది రూపాయలతో నిర్మించిన భవనం అది. కార్పొరేట్‌ తరహాలో వసతులు సమకూర్చారు. భవనాన్ని ప్రారంభించి నాలుగు వారాలు కావొస్తున్నా.. ఇప్పటికీ సేవలు మాత్రం అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. మెదక్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. స్థానికులతోపాటు కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, లింగంపేట, ఎల్లారెడ్డి మండలాల నుంచి కాన్పుల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు. ప్రతి రోజూ సగటున పది ప్రసవాలు జరుగుతుంటాయి. దీంతో ఆసుపత్రిలో సమస్యలు తలెత్తేవి. ఈనేపథ్యంలో పట్టణం పరిధి పిల్లికొట్టాల్‌ శివారులోని హైదరాబాద్‌ మార్గంలో తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.17 కోట్లతో వంద పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని (ఎంసీహెచ్‌) నిర్మించారు. సుమారు 140కి పైగా గదులతో, అత్యాధునిక సదుపాయాలతో ఆసుపత్రి రూపుదిద్దుకుంది. మూడు ఆపరేషన్‌ థియేటర్లతో పాటు శిశువులకు ఆరోగ్య సమస్యలు వస్తే వైద్యం అందించేందుకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. చిన్నారులకు టీకాలు, స్కానింగ్‌, ఎక్స్‌రే, ఈసీజీ, అత్యవసర రక్తనిధి, ఆరోగ్యశ్రీ, కేసీఆర్‌ కిట్‌లకు ప్రత్యేక గదులను కేటాయించారు. అత్యవసర విభాగాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఆసుపత్రిని గత నెల 27న వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.


సిబ్బందిని సర్దుబాటు చేసినా..

అసంపూర్తిగా రహదారి నిర్మాణం

మాతా శిశు సంరక్షణ కేంద్రానికి ప్రత్యేకంగా వైద్యసిబ్బందిని నియమించాల్సి ఉంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని 40 శాతం సిబ్బందిని ఎంసీహెచ్‌కు కేటాయించారు. ఆరుగురు గైనకాలజిస్ట్‌లు, ముగ్గురు పిల్లల వైద్యులు, ముగ్గురు మత్తుమందు వైద్యులతో పాటు ముగ్గురు హెడ్‌నర్సులు, 26 మంది నర్సులను ప్రారంభోత్సవానికి ముందే నియమించారు. జిల్లా ఆసుపత్రిలో ప్రసవాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గదుల కొరతతో వరండాలో వసతి కల్పిస్తున్నారు. దీంతో ఆరుబయటనే చంటిపిల్లలతో బాలింతలు ఉండాల్సి వస్తోంది.


మంత్రి హరీశ్‌రావు ఆగ్రహించినా..


ఆసుపత్రి వెనకాల ఏర్పాటు కాని గేటు

మెదక్‌- చేగుంట మార్గంలో ఎంసీహెచ్‌ నిర్మించారు. ప్రధాన రహదారి నుంచి ఆసుపత్రికి వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ సమయానికి మట్టి రహదారిని సిద్ధం చేయడంతో మంత్రి హరీశ్‌రావు.. అధికారుల తీరుపై మండిపడ్డారు. తారురోడ్డు నిర్మించాల్సి ఉన్నప్పటికీ పనులు పూర్తి చేయకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది గడిచి 28 రోజులు అవుతున్నా పూర్తిస్థాయిలో దారి అందుబాటులోకి రాలేదు. ఒక వైపు కంకర వేయగా, మరో వైపు మట్టి రోడ్డు మీదగా రాకపోకలు సాగిస్తున్నారు. మూడు చోట్ల కల్వర్టులు నిర్మించారు. ఇదిలా ఉంటే ఆయా వార్డుల్లో సామగ్రిని లోపలికి తీసుకువచ్చేందుకు గోడను కూల్చివేశారు. ఆసుపత్రి వెనకభాగంలో కిటికీని తీసేసి.. గోడను కాస్త తొలగించి తలుపు బిగించనున్నారు. విద్యుత్తు దీపాల స్తంభాలను ఏర్పాటు చేయలేదు. మరోవైపు ఆసుపత్రి వెనకాల గేటు ఇప్పటి వరకు బిగించకపోవడం గమనార్హం.


అందుబాటులోకి తీసుకువస్తాం..

- పి.చంద్రశేఖర్‌, పర్యవేక్షకులు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి

ఎంసీహెచ్‌లో ముందుగా ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తాం. వారం రోజుల్లో అన్నింటిని కొత్త భవనంలోకి మార్పించి..పూర్తిస్థాయిలో సేవలు అందించేలా తగిన చర్యలు తీసుకుంటాం. ప్రధాన రహదారి నుంచి ఆసుపత్రికి ఒక వైపు రహదారిని నాలుగైదు రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఆసుపత్రి వెనక భాగంలో గేటు ఏర్పాటు చేయిస్తాం.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని