logo
Published : 25 Jun 2022 01:25 IST

ఎట్టకేలకు గ్రామీణ దారులకు మోక్షం

160 పనులకు రూ.158.4 కోట్లు మంజూరు

త్వరలోనే టెండర్ల ప్రక్రియ

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌

సదాశివపేట మండలం సూరారం దారి

పల్లెదారులు అస్తవ్యస్తంగా మారాయి. మారుమూల ప్రాంతాల నుంచి జిల్లా, మండల కేంద్రాలకు వెళ్లాలంలే వ్యయప్రయాసలు తప్పడం లేదు. రోడ్లన్నీ గుంతలుగా మారాయి. కొన్ని చోట్ల తారు రోడ్లు ఆనవాళ్లు కోల్పోయి.. కంకర దారులను తలపిస్తున్నాయి. రెండళ్లుగా భారీ వర్షాలు కురవడంతో ఇలా మారాయని అధికారులు చెబుతున్నా.. నిధులు లేవని మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు ఇన్నాళ్లు ఇబ్బందుల మధ్యే ప్రయాణం సాగించారు. కొన్ని మార్గాల్లో ‘108’ అత్యవసర సేవలు నిలిచాయి. ఆర్టీసీ బస్సులు రద్దయ్యాయి. వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని పలువురు చోదకులు వాపోయారు. గత ఫిబ్రవరి 21న.. నారాయణఖేడ్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటించిన సందర్భంగా.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లాలోని పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని రహదారుల పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మరమ్మతులకు నిధులు కావాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి ఆదేశాలతో జిల్లా అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రహదారుల పరిస్థితిపై అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాల్లో 160 పనులకు రూ.154.4 కోట్లు మంజూరు చేస్తూ ఈ నెల 21న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా నిధులతో సకాలంలో పనులు చేపడితే పల్లె దారులు బాగుపడనున్నాయి. ఈ నేపథ్యంలో కథనం.

పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో..

జిల్లాలో సంగారెడ్డి, పటాన్‌చెరు, నారాయణఖేడ్‌, అందోలు, జహీరాబాద్‌ నియోజకవర్గాలున్నాయి. నర్సాపూర్‌ నియోజకవర్గంలోని హత్నూర మండలం సంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో అధ్వానంగా ఉన్న పంచాయతీ రాజ్‌ రహదారులను గుర్తించి ఎన్ని నిధులు కావాలో అంచనా వేశారు. ఆయా వివరాలు నివేదికను జిల్లా శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. దీంతో ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసిందని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు తెలిపారు త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించారు.

నాణ్యతగా చేపడితేనే మేలు

ఇప్పటికే వానాకాలం ఆరంభమైంది. ఇప్పట్లో పనులు చేస్తే నాణ్యతపై సదేహాలు వ్యక్తమవుతాయి. పది కాలాల పాటు దారులు మన్నికగా ఉండాలంటే సరైన పర్యవేక్షణ మధ్యే పనులు కొనసాగాలి. వానాకాలం అనంతరం నవంబరు, డిసెంబరులో ప్రారంభించి.. వేసవిలోగా పూర్తి చేస్తే ప్రజల రవాణా కష్టాలు తీరుతాయి. జిల్లాలో ఇప్పటికే చేపట్టిన కొన్ని పనులకు బిల్లులు సకాలంలో అందక గుత్తేదారులు మధ్యలోనే ఆపేశారు. అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. భారీ ఎత్తున నిధులు మంజూరు చేసినందున వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


పనులు ఆరంభించేలా చర్యలు

- జగదీశ్వర్‌, పీఆర్‌ఈఈ, సంగారెడ్డి

జిల్లాలో రహదారులు అధ్వానంగా మారాయని మంత్రి హరీశ్‌రావుకు గతంలో విన్నవించాం. గత ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్‌ దృష్టికి మంత్రి ఈ సమస్యను తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాకు నిధులు మంజూరయ్యాయి. వాటికి త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. పనుల నాణ్యత విషయంలో రాజీపడం. ఏళ్లనాటి దారులకు మంచి రోజులు  రానున్నాయి.


 

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts