logo
Updated : 25 Jun 2022 04:55 IST

అప్రమత్తమవుదాం.. జాగ్రత్తలు పాటిద్దాం

75 రోజుల తరువాత కరోనా జాడ..!

న్యూస్‌టుడే, సిద్దిపేట

జిల్లా కేంద్రానికి చెందిన తల్లీకొడుకు ఇటీవల హైదరాబాద్‌లోని ఓ వివాహ వేడుకకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఆ వేడుకలో పాల్గొన్న బంధువు ఒకరికి కరోనా పాజిటివ్‌ రాగా అప్రమత్తమైన ఆ తల్లీకొడుకులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాలు పాజిటివ్‌గా వెల్లడయ్యాయి. పెద్దగా లక్షణాలు, తీవ్రత లేకున్నా.. స్వీయ గృహనిర్బంధంలోకి వెళ్లారు. కరోనా మూడో దశ అనంతరం.. జిల్లాలో నమోదైన రెండు కేసులు ఇవే కావడం గమనార్హం.

మహమ్మారి.. ఇంకా వీడటం లేదు. 2020 సంవత్సరంలో మొదలైన వ్యాప్తి.. దశల వారీగా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పలు దశల్లో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ కొనసాగిన విషయం తెలిసిందే. రెండో దశలో వైరస్‌.. ఎన్నో కుటుంబాలకు తీరని నష్టాన్ని, విషాదాన్ని మిగిల్చింది. ఈ ఏడాది మూడో దశలో కేసులు పెద్దసంఖ్యలో నమోదైనా.. పెద్దగా ప్రభావం చూపలేదు. జిల్లాలో 75 రోజులుగా ఒక్క పాజిటివ్‌ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల (గురువారం) రెండు కేసులు వెలుగుచూడటం గమనార్హం. ఈ తరుణంలో జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8,52,143 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 39,508 మందికి పాజిటివ్‌గా తేలింది. 161 మంది మహమ్మారికి బలయ్యారు. మిగిలిన వారు కోలుకున్నారు. చివరగా ఏప్రిల్‌ 8న ఒకరికి వైరస్‌ సోకిన కేసు నమోదైంది. ఆ తరువాత ఒక్క కేసు కూడా వెలుగుచూడ లేదు.

ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు.. ఔషధాలు

జిల్లాలో 39 ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. వైద్యారోగ్య సిబ్బంది సగటున రోజుకు 400 పరీక్షలు చేస్తున్నారు. ప్రతి కేంద్రంలో ర్యాపిడ్‌ కిట్లకు అదనంగా దాదాపు పది ఆర్టీపీసీఆర్‌ కిట్లు అందుబాటులో ఉంటున్నాయి. గత ఏప్రిల్‌ 9 నుంచి ఇప్పటి వరకు 16,361 మందికి పరీక్షలు జరిగాయి. మరోవైపు 18 ఏళ్లు పైబడిన వారికి టీకా (రెండు డోసులు) పంపిణీ శతశాతాన్ని అధిగమించారు. 12- 14 ఏళ్ల వారికి మొదటి డోసు 30,146 (99 శాతం), రెండో డోసు 13,965 (45.9 శాతం) మందికి పూర్తయింది. 15-17 ఏళ్ల వారికి మొదటి డోసు - 45,884 (93 శాతం), రెండో డోసు - 38,911 (78.9 శాతం) మందికి పంపిణీ చేశారు. వివిధ విభాగాల్లో ప్రికాషన్‌ డోసు 1,49,809 మందికి ఇవ్వాల్సి ఉండగా.. 22,472 (15.09 శాతం) మందికి పూర్తయింది.


ఆందోళన వద్దు..: కాశీనాథ్‌, జిల్లా వైద్యాధికారి

దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్తలు పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆందోళనకు గురికావొద్దు. ఒకవేళ వ్యాప్తి చెందినా.. తగిన పరీక్షలు, చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే సిద్దిపేట సర్వజన ఆసుపత్రిలో 100 పడకలకు పైగా ఉన్న కొవిడ్‌ వార్డు అందుబాటులో ఉంది. ముందు జాగ్రత్తగా సిద్ధం చేస్తాం. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వీలుగా కిట్లు, సరిపడా ఔషధాలు ఉన్నాయి.  జలుబు, జ్వరం, వాసన కోల్పోవడం, ఇతరత్రా లక్షణాలు ఉంటే జాప్యం చేయకుండా సమీప కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలి. వారం పాటు స్వీయ నియంత్రణ పాటిస్తూ ఐసోలేషన్‌లో ఉండాలి. మాస్కుధారణ, భౌతిక దూరం పాటింపు, చేతుల శుభ్రత మరువొద్దు. తల్లిదండ్రులు తమ పిల్లలకు బాధ్యతగా కొవిడ్‌ టీకా వేయించాలి.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts