logo

మంజీరాలోకి మురుగు

మంజీర.. జిల్లాకు వరప్రదాయని. మెదక్‌, హవేలి ఘనపూర్‌, కౌడిపల్లి, చిలప్‌చెడ్‌, కొల్చారం తదితర మండలాలకు ఈ నదితోనే తాగు, సాగునీరు అందుతోంది. దీని ఆధారంగానే పంటలు పండిస్తున్నారు

Published : 28 Jun 2022 01:11 IST

న్యూస్‌టుడే, మెదక్‌ టౌన్‌

మహబూబ్ నహర్‌ కాలువలో కలుస్తున్న వ్యర్థాలు

మంజీర.. జిల్లాకు వరప్రదాయని. మెదక్‌, హవేలి ఘనపూర్‌, కౌడిపల్లి, చిలప్‌చెడ్‌, కొల్చారం తదితర మండలాలకు ఈ నదితోనే తాగు, సాగునీరు అందుతోంది. దీని ఆధారంగానే పంటలు పండిస్తున్నారు. జిల్లా కేంద్రం మెదక్‌ పట్టణంలోనూ ఈ నది ప్రవహిస్తోంది. జిల్లా కేంద్రంలోకి ప్రవేశించే వరకు మంజీర నది స్వచ్ఛంగానే ఉంటోంది. ఇక మెదక్‌లో అడుగుపెట్టడంతోనే మురుగు చేరి కలుషితమవుతుండటం గమనార్హం.
మెదక్‌ పట్టణంలోకి మహబూబ్‌ నహర్‌ కాలువ ద్వారా మంజీర అడుగుపెడుతుంది. 9, 10, 27 వార్డులతో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి వెలువడే వ్యర్థాలన్నీ కాలువలోకి చేరుతోంది. ఈ కలుషిత నీరే సాగుకు ఉపయోగిస్తున్నారు. ఇక తాగేందుకు ఎంతమాత్రం వినియోగించలేని పరిస్థితి నెలకొంది. పట్టణంలోని వార్డులు పచ్చదనం, పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలుచేసిన విషయం విదితమే. ఆయా కాలనీల నుంచి మురుగు పారే కాలువలన్నీ మహబూబ్‌ నహర్‌ కాలువలోకి వెళ్తుండటంతో వ్యర్థాలతో నిండిపోయి దుర్గంధానికి మారుపేరుగా మారింది.

నిర్లక్ష్యంతో..
సదరు కాలువ అధ్వానంగా మారినా ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందులో వ్యర్థాలను సైతం తొలగించడం లేదు. తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. 11వ వార్డు పరిధిలో ఉన్న మహబుబ్‌ నహర్‌ కాలువకు ఇరువైపులా స్థానిక కౌన్సిలర్‌ చొరవతో పలు రకాల మొక్కలను నాటారు. వర్షాకాలం సమీపించడంతో ఆ మొక్కల చుట్టూ చెత్తాచెదారాన్ని తొలగించిన పారిశుద్ధ్య కార్మికులు వ్యర్థాలన్నీ ఆ నీటిలోనే వేయడం గమనార్హం.


కాలువల నిర్మాణానికి..
- శ్రీహరి, పురపాలిక కమిషనర్‌

అన్ని వార్డుల్లో భూగర్భ మురుగు కాలువల నిర్మాణానికి గతేడాది రూ.100 కోట్లతో ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించాం. ప్రస్తుతం మహబూబ్‌నహర్‌ కాలువలో మురుగు నీరు కలవకుండా ప్రస్తుతం ఉన్న కాలువకు పైపులను అనుసంధానం చేసి 11వ వార్డులో ఉన్న మురుగు కాలువలోకి మళ్లించేందుకు ప్రణాళిక రూపొందించాం. ఇటీవల పుర ఛైర్మన్‌ చంద్రపాల్‌తో కలిసి స్థలాన్ని సైతం పరిశీలించాం. త్వరలో పనులు చేపట్టి సమస్య పరిష్కరిస్తాం.

మరొకటి అందుబాటులోకి వస్తే..
ఆయా వార్డుల నుంచి వచ్చే మురుగునీరు మహబూబ్‌ నహర్‌ కాలువలో కలువకుండా ఉండేందుకు ఓ కాలువను నిర్మించారు. అయితే దాని నిర్వహణ లోపించడం, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అదంతా అధ్వానంగా మారింది. మట్టి పేరుకుపోవడంతో పాటు మొక్కలతో నిండిపోయింది. దీనికితోడు అక్కడక్కడ కూడా కూలిపోయింది. దీంతో మురుగంతా పక్కనే ఉన్న మహబూబ్‌నహర్‌ కాలువలోకి చేరుతోంది. ఇక ప్రధానంగా వర్షాలు కురిసినప్పుడు, పై నుంచి నీటిని వదిలిన సమయంలో అందులోకి మురుగు చేరుతోంది. ప్రస్తుతం ఉన్న మరో కాలువను బాగుచేయించి మట్టిని తొలగిస్తే మురుగు ముందుకు సాఫీగా సాగే అవకాశం ఉంటుంది. ఇకనైనా ఈ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి సమస్య పరిష్కరించాలని పట్టణ వాసులు విన్నవిస్తున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని