logo

చెరువులకు హద్దు... దాటి రావొద్దు

చెరువుల కబ్జా ఇక అంత సులువు కాదు. ఒకవేళ ఆక్రమించి ప్లాట్లు వేసినా.. ఇళ్లు కట్టినా.. ఎప్పుడు కూల్చివేస్తారో తెలియక బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. చెరువులను భావి తరాలకు భద్రంగా అందించేందుకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) చేపడుతున్న చర్యలు తుది దశకు చేరుకుంటున్నాయి.

Published : 28 Jun 2022 01:11 IST

7 జిల్లాల్లో 3,114 తటాకాలకు ఎఫ్‌టీఎల్‌ గుర్తిస్తూ నోటిఫికేషన్‌
ఈనాడు, హైదరాబాద్‌

చెరువుల కబ్జా ఇక అంత సులువు కాదు. ఒకవేళ ఆక్రమించి ప్లాట్లు వేసినా.. ఇళ్లు కట్టినా.. ఎప్పుడు కూల్చివేస్తారో తెలియక బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. చెరువులను భావి తరాలకు భద్రంగా అందించేందుకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) చేపడుతున్న చర్యలు తుది దశకు చేరుకుంటున్నాయి. ఏడు జిల్లాల పరిధిలో మొత్తం 3,532 చెరువులను ఇప్పటికే గుర్తించారు. పూర్తి స్థాయిలో సర్వే చేసి.. పూర్తి నిల్వ సామర్థ్యం(ఎఫ్‌టీఎల్‌)ను అంక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా పక్కాగా హద్దులు గీస్తున్నారు. 3,114 చెరువులకు ఇప్పటికే ఎఫ్‌టీఎల్‌ హద్దులు పూర్తి చేశారు. భవిష్యత్తులో మార్చేందుకు అవకాశం లేకుండా పక్కాగా చేపడుతున్నారు. ఇందులో 2,436 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశారు. 230 చెరువులకు తుది నోటిఫికేషన్‌ వెలువరించారు. తుది నోటిఫికేషన్‌ ఇచ్చిన వాటి విషయంలో అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోరు. వచ్చే ఆరు నెలల్లో తుది నోటిఫికేషన్‌ తతంగం పూర్తి చేయనున్నామని అధికారులు తెలిపారు.
రక్షణ ఇలా
*చాలా చెరువులు ఆక్రమణలతో కుంచించుకుపోయాయి. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) 1992, 2002, 2012 మ్యాపులను పరిగణలోకి తీసుకొని ఎఫ్‌టీఎల్‌ను గుర్తించారు. సర్వే ఆఫ్‌ ఇండియా టోపోషీట్లు, రెవెన్యూ మ్యాపులను ఆధారం చేసుకున్నారు.
* పకడ్బందీగా చేయడం వల్ల ఎఫ్‌టీఎల్‌ పక్కాగా నిర్ధారణ అయింది. నగరంలోని బతుకమ్మకుంట చుట్టూ భారీ ఆక్రమణలున్నట్లు సర్వేలో తేలింది. బండరావిర్యాల చెరువు చుట్టూ సినీ, రాజకీయ ప్రముఖుల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో అనేక చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణల గుర్తింపునకు, చర్యలకు మ్యాపులు కీలకం కానున్నాయి. లేఅవుట్లు, కట్టడాలకు అనుమతులు ఇచ్చేందుకు ఇది ఉపయోగపడనున్నాయి. హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో 2,408 చెరువుల ఎఫ్‌టీఎల్‌ వివరాలు పొందుపరిచారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని