logo

దివ్యాంగుల మార్గదర్శి!

దివ్యాంగుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వాలు అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల వినియోగంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారి కోసం ప్రవేశపెట్టిన పథకాలు, విద్య, ఉపాధి, ఉద్యోగ తదితర వివరాలు సులభంగా తెలుసుకునేలా కేంద్ర ప్రభుత్వం

Updated : 28 Jun 2022 05:31 IST

 అందుబాటులోకి ప్రత్యేక యాప్‌
విద్య, ఉద్యోగ, ఉపాధి సమాచారం ఒకే చోట
న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట

దివ్యాంగుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వాలు అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల వినియోగంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారి కోసం ప్రవేశపెట్టిన పథకాలు, విద్య, ఉపాధి, ఉద్యోగ తదితర వివరాలు సులభంగా తెలుసుకునేలా కేంద్ర ప్రభుత్వం ‘దివ్యాంగ సారథి’ పేరిట యాప్‌ను రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చింది. వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా యాప్‌ సాయంతో తెలుసుకునే వెసులుబాటు కల్పించడం విశేషం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి తెలియక ఎంతో మంది అవకాశాలను వినియోగించుకోలేక వెనుకంజ వేస్తున్నారు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు సదరు యాప్‌ను రూపొందించారు. ఇందులో వారికి సంబంధించిన అన్ని అంశాలనూ తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. యాసిడ్‌ దాడి బాధితులు, పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికీ ఉపయోగపడే పథకాల గురించి తెలుసుకోవచ్చు.

డౌన్‌లోడ్‌ ఇలా..
యాప్‌ని స్మార్ట్‌ చరవాణిలో డౌన్‌లోడ్‌ చేసుకొని ఎప్పటికప్పుడు విలువైన సమాచారాన్ని తెలుసుకుని లబ్ధి పొందవచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి దివ్యాంగ సారథి అని టైప్‌ చేస్తే సదరు యాప్‌ ప్రత్యక్షమవుతుంది. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఎంచక్కా వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో సమాచారం లభిస్తుంది. అంతేకాకుండా ఎవరిని ఎలా సంప్రదించాలో తెలిపే ఫోన్‌ నెంబర్లు సైతం పొందుపర్చారు.
ఉద్యోగావకాశాలు..
దివ్యాంగులకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ పథకాల వివరాలనూ తెలుసుకోవచ్చు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఈ యాప్‌ ఎంతో దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంధత్వం, వినికిడి, మూగ లక్షణాలు ఉన్నవారు, నడవ లేని వారు, మరుగుజ్జులు, మానసిక దివ్యాంగులు, మస్తిక్క పక్షవాతం, ఆమ్ల దాడి బాధితులు, తీవ్ర నాడి సంబంధ సమస్యలు కలిగిన వారికి ఉపయోగడపడుతుంది.
* భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ వివరాలను తెలుసుకోవచ్చు. అవసరమైన అవయవాలు కావాలంటే ఏం చేయాలి, ఎలా దరఖాస్తు చేసుకుని పొందాలి అనే వివరాలు ఉండటంతో పాటు ఆయా ప్రాంతాల వారీగా సమాచారం ఉంటుంది.


వీటి గురించి సైతం..
రవాణా, ఇతరత్రా వాటిల్లో రాయితీలు, దీన్‌దయాళ్‌ దివ్యాంగుల పునరావాస పథకం, ఉన్నత చదువులు, ఉద్యోగాలు దక్కించుకునేందుకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు, జాతీయ ఉపకార వేతనాలు, ప్రీమెట్రిక్‌, పోస్టుమెట్రిక్‌ ఉపకార వేతనాలు, విదేశాల్లో చదువు తదితర అంశాలు, ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి సదరు యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. దీనికితోడు ఎవరెవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలూ ఉంటాయి. వీటి ఆధారంగా ఆసక్తి ఉండి, అర్హతలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రత్యేక సంస్థల వివరాలు..
దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్న సంస్థల గురించి ఇందులో ఉంచారు. జాతీయ దివ్యాంగ ఆర్థిక అభివృద్ధి సంస్థ, అలీయావర్‌ జంగ్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ద హియరింగ్‌ హ్యాండీకాప్డ్‌, స్వామి వివేకానంద జాతీయ పునరావాస శిక్షణ కేంద్రం, పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ వికలాంగ జాతీయ సంస్థ, భారతీయ సంజ్ఞ భాషల పరిశోధనా కేంద్రం, తదితర సంస్థల వివరాలు, వాటిలో చేరడం ఎలా, కలిగే ప్రయోజనాలు, అవకాశాలు ఇందులో కనిపిస్తాయి. అంతేకాకుండా ఆయా సంస్థలకు చెందిన ప్రాంతీయ కేంద్రాల వివరాలు, దివ్యాంగుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థల వివరాలను సైతం పొందుపర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు