logo

కలుషితాహారం తిని 128 మంది విద్యార్థినుల అస్వస్థత

కలుషితాహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జిల్లా కేంద్రం సిద్దిపేటలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి భోంచేసి పడుకున్న బాలికలు అర్ధరాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో అవస్థలు పడ్డారు

Published : 28 Jun 2022 01:22 IST

మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఘటన


బాలికలకు గురుకులంలోనే చికిత్స

సిద్దిపేట, సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: కలుషితాహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జిల్లా కేంద్రం సిద్దిపేటలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి భోంచేసి పడుకున్న బాలికలు అర్ధరాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో అవస్థలు పడ్డారు. గురుకులంలో ఐదు నుంచి ఇంటర్‌ వరకు 485 మంది చదువుతున్నారు. ఆదివారం 323 మంది విద్యార్థినులు ఉన్నారు. గురుకులంలో మధ్యాహ్నం చికెన్‌ కూర, బగారా వండారు. రాత్రి వంకాయ కూర, సాంబారు, సాధారణ అన్నం చేశారు. రాత్రిపూట వంకాయ కూరలో మధ్యాహ్నం మిగిలిన చికెన్‌ను కొందరు కలిపి తిన్నారు. అర్ధరాత్రి నుంచి 128 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, కళ్లు తిరగడం, ఇతరత్రా లక్షణాలతో అవస్థపడ్డారు. సోమవారం ఉదయం స్థానిక ప్రభుత్వ వైద్యుడు, సిబ్బందిని నిర్వాహకులు రప్పించి చికిత్సలు ప్రారంభించారు. కొందరికి అక్కడే సెలైన్‌లు ఎక్కించారు. ద్రావణాలు అందించారు. సమాచారం అందుకున్న రాష్ట్ర మైనార్టీ గురుకులాల విద్యా సంస్థ అసిస్టెంట్‌ కార్యదర్శి ఎండీ యూసుఫ్‌ ఆలీ, విజిలెన్స్‌ అధికారి గౌస్‌పాష, జిల్లా మైనార్టీ సంక్షేమ ఇన్‌ఛార్జి అధికారి గోపాల్‌రావు, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్‌ చేరుకొని పరిస్థితి తెలుసుకున్నారు. విద్యార్థులను పరామర్శించారు. పరిస్థితి అదుపులోనే ఉందని, విద్యార్థులు క్షేమంగా ఉన్నారని వివరించారు. ప్రిన్సిపల్‌ శ్రీలత, వార్డెన్‌ రజియాసుల్తానాను విచారించారు. ఆదివారం వారాంతపు సెలవు కావడంతో ప్రిన్సిపల్‌ లేరు. వార్డెన్‌ సాయంత్రం 7 గంటల అనంతరం అత్యవసర సొంత పని నిమిత్తం బయటకు వెళ్లారు. భోజనాల సమయంలో ఒక ఉపాధ్యాయురాలు, ఇద్దరు సిబ్బంది ఉన్నారని విద్యార్థులు వివరించారు.
జిల్లా ఆసుపత్రికి 19 మంది తరలింపు..
ఈ హఠాత్‌ పరిణామంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లలకు ఏమైందంటూ పలువురు పాఠశాలకు చేరుకున్నారు. ఈ ఘటనపై నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తానని యూసుఫ్‌ ఆలీ చెప్పారు. జిల్లా వైద్యాధికారిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. విద్యార్థినులు క్షేమంగా ఉన్నారని, ఒకరోజు పరిశీలన కొనసాగుతుందన్నారు. సోమవారం రాత్రి 19 మంది విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు.వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఘటనపై స్పందిస్తూ.. మెరుగైన వైద్య సేవలు అందించాలని, బాలికలు కోలుకునేంత వరకు పర్యవేక్షించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఘటనపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని