logo

సమస్యల పరిష్కారమే ప్రజావాణి లక్ష్యం: పాలనాధికారి

‘ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజావాణి లక్ష్యం కావాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం ఏమాత్రం తగదు. ప్రతి సోమవారం విధిగా అన్ని విభాగాల ఉన్నతాధికారులు హాజరవ్వాలి’ అంటూ జిల్లా పాలనాధికారి డాక్టర్‌ ఎ.శరత్‌ స్పష్టం చేశారు.

Published : 28 Jun 2022 01:22 IST

గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ను సన్మానిస్తున్న జిల్లా అధికారులు, చిత్రంలో పాలనాధికారి శరత్‌..

ఈనాడు, సంగారెడ్డి: ‘ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజావాణి లక్ష్యం కావాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం ఏమాత్రం తగదు. ప్రతి సోమవారం విధిగా అన్ని విభాగాల ఉన్నతాధికారులు హాజరవ్వాలి’ అంటూ జిల్లా పాలనాధికారి డాక్టర్‌ ఎ.శరత్‌ స్పష్టం చేశారు. ఈనెల 27న నిర్వహించిన ప్రజావాణికి ఆయన హాజరై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను   స్వీకరించారు. వారి సమస్యలేంటనే విషయాన్ని తెలుసుకున్నారు. వాస్తవానికి అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రజావాణికి రావాలి. గత కొన్నేళ్లుగా ఎవరూ దీనిని పాటించడం లేదు. తమ కిందస్థాయి ఉద్యోగులను పంపుతూ మమ అనిపిస్తున్నారు. కనీసం తమ విభాగానికి సంబంధించి ప్రజావాణిలో ఎన్ని వినతులు వచ్చాయనే విషయాన్నీ వారు తెలుసుకోవడం లేదు. ఈ విషయాలన్నీ జిల్లా పాలనాధికారి డాక్టర్‌ ఎ.శరత్‌ దృష్టికి రావడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజావాణికి హాజరుకాని జిల్లాస్థాయి అధికారులకు మోమోలు జారీ చేయాలని డీఆర్వో రాధికా రమణిని ఆదేశించారు. చిన్న చిన్న కారణాలతో ప్రజలను పదే పదే తిప్పించుకోవద్దని చెప్పారు. సమస్య ఏంటనే విషయాన్ని సావధానంగా విని పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. జాప్యం చేయకుండా ఆయా సమస్యలను సాధ్యమైనంత త్వరగా తీర్చాలన్నారు. ఎన్నిరోజుల్లో పరిష్కరిస్తారనే విషయాన్నీ అర్జీదారులకు స్పష్టంగా చెప్పాలన్నారు. ఒకవేళ వారి స్థాయిలో సమస్య తీర్చలేరని భావిస్తే.. ఎందుకు జిల్లాస్థాయిలో ఈ సమస్యను పరిష్కరించలేరనే సంగతివారికి చెప్పి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా చూడాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాల అధికారులు ఇకపై ప్రజావాణికి వచ్చిన వారితో మాట్లాడి... ఆ వివరాలనూ నమోదు చేయాలన్నారు. అర్జీ తీసుకున్న తర్వాత కచ్చితంగా వారికి రసీదు ఇవ్వాలని ఆదేశించారు.
హనుమంతరావు సౌమ్యుడు..
సంగారెడ్డి టౌన్‌: జిల్లా పాలనాధికారిగా పనిచేసి గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా బదిలీపై వెళ్లిన హనుమంతరావు సౌమ్యుడని పాలనాధికారి శరత్‌ పేర్కొన్నారు. సోమవారం రెవెన్యూ ఉద్యోగుల సంఘం, జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో బదిలీపై వెళ్లిన హనుమంతరావు, కొత్తగా బాధ్యతలు చేపట్టిన పాలనాధికారి శరత్‌లకు ఆత్మీయ అభినందన, సన్మాన కార్యక్రమాలను కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పాలనాధికారి శరత్‌ మాట్లాడుతూ హనుమంతరావు జిల్లాను అగ్రగామిలో నిలిపి, తనదైన ముద్ర వేశారని కొనియాడారు. హనుమంతరావు మాట్లాడుతూ కలెక్టర్‌ శరత్‌ అన్ని విషయాల్లో ప్రణాళికతో ముందుకుసాగుతారని, జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. జిల్లాలో అంకిత భావంతో పనిచేసే అధికారులు ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రమణకుమార్‌, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు రాములు, కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని