logo
Published : 30 Jun 2022 01:51 IST

5 గంటలు.. 62 మందికి పట్టాలు!

హక్కులు పొందడంతో లబ్ధిదారుల హర్షం


పట్టా ధ్రువపత్రాలను చూపుతున్న లబ్ధిదారులు

ఈనాడు, మెదక్‌ -న్యూస్‌టుడే, వెల్దుర్తి: జమునా హేచరీస్‌ ఆక్రమణలో ఉన్న తమ భూములను తిరిగి ఇప్పించడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ తమను భూముల్లోకి రాకుండా అడ్డుకున్నారని, కనీసం బాట లేకుండా చేశారని వారు వివరించారు. రానున్న రోజుల్లో తమకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటల్లోని అసైన్డు భూములను తిరిగి అసలైన లబ్ధిదారులకే అప్పగించే ప్రక్రియ బుధవారం ఉదయం 10 గంటలకు మొదలైంది. మెదక్‌, తూప్రాన్‌, నర్సాపూర్‌ ఆర్డీవోల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం కొనసాగింది. మధ్యాహ్నం 3గంటల వరకు హద్దులు చూపడం, పట్టా పత్రాలు పంపిణీ చేయడం పూర్తి చేశారు. అయిదు గంటల వ్యవధిలో మొత్తం 62 మందికి భూములను చూపి... అవసరమైన ధ్రువపత్రాలను అందించారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో పాటు తెరాసకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు ఇక్కడికి వచ్చారు. పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంపిణీ సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు పటిష్టం చేశారు.

గతేడాది ఏప్రిల్‌లో ఫిర్యాదు

ఈ రెండు గ్రామాల్లో ఉన్న ఎనిమిది సర్వే సంఖ్యల్లోని అసైన్డు భూములను ఆక్రమించారంటూ చాకలి లింగయ్యతో పాటు మరికొంత మంది ఫిర్యాదు చేశారు. గతేడాది ఏప్రిల్‌లో నేరుగా సీఎం కేసీఆర్‌ను కలిసి తమ బాధను చెప్పుకున్నారు. దీంతో ఆ మరుసటి రోజే అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియ పూర్తి చేసి తాజాగా పట్టాలు పంపిణీ చేశారు.


చెర విడిపించి... అప్పగిస్తున్నాం
- కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ

గతంలో పేదలకు ఇచ్చిన భూములను జమునా హేచరీస్‌ సంస్థ ఆక్రమించింది. 85.19 ఎకరాలను వారి నుంచి గుంజుకున్నారు. రోడ్లు వేసి, విద్యుత్తు స్తంభాలూ ఏర్పాటు చేశారు. బాధితులు నేరుగా సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఆక్రమణ నిజమేనని తేలింది. గతంలో ఎవరికయితే కేటాయించారో.. మళ్లీ వారికే కొత్తగా ఇప్పుడు పట్టాలు అందించాం. రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి కాళేశ్వరం జలాలూ రాబోతున్నాయి. పడావుగా ఉన్న భూముల్లో పంటలు పండనున్నాయి.


చాలా సంతోషంగా ఉంది
- కొయ్యల నరసమ్మ, అచ్చంపేట

చాలాఏళ్ల క్రితం ప్రభుత్వం సర్వేసంఖ్య 79లో 1.20 ఎకరాలు పంపిణీ చేసింది. కొన్నేళ్ల క్రితం ఇక్కడ కోళ్లకు సంబంధించిన షెడ్లు కట్టారు. మా భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు మా భూముల్లో సాగిన ఆక్రమణలను గుర్తించారు. మళ్లీ వాటిని మాకే ఇస్తూ పట్టాలిప్పించడం చాలా సంతోషంగా ఉంది. నా భర్త పేరిట ఈ భూములను ఇచ్చారు. ఇప్పుడు ఆయన పక్షవాతంతో బాధపడుతున్నారు. అందుకే నేను వచ్చి ధ్రువపత్రం తీసుకుంటున్నాం. ఇక్కడ మేం సాగు చేసుకునేందుకు అవసరమైన తోడ్పాటు అధికారులు అందించాలని కోరుతున్నా.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని