logo
Updated : 30 Jun 2022 03:04 IST

నాసి విత్తనాలపై.. నిఘా!

దుకాణాల్లో ముమ్మరంగా సోదాలు


దుకాణాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట: ఖరీఫ్‌ వచ్చిందంటే చాలు నాసి విత్తనాలు విక్రయించే వారి బెడద ఎదురవుతోంది. నాసి విత్తనాలు, నిషేధిత రసాయనాలు రైతులకు అంటగడుతూ అక్రమార్కులు మోసాలకు పాల్పడుతుంటారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా పూర్తి స్థాయిలో నివారించలేని పరిస్థితి నెలకొంటోంది. దీంతో నాసి విత్తనాలతో అన్నదాతలు బేజారవుతున్నారు. ఈ క్రమంలో నాసి బెడదను అరికట్టేందుకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. అన్ని మండలాల్లో అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. అక్రమార్కులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది.

పకడ్బందీగా తనిఖీలు..

వానాకాలంలో జిల్లాలో 3,31,280 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో ప్రధానంగా వరి, రెండో పంటగా పత్తి సాగు చేస్తారని ప్రణాళికలు రూపొందించారు. వీటితో పాటు కంది, మొక్కజొన్న, పెసర, మినుము వంటి పంటలు సాగవుతాయని భావిస్తున్నారు. ఇందుకు 45 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఇదే అదునుగా..

జిల్లాలో మొత్తం 230 వరకు ఎరువులు, విత్తనాల దుకాణాలు ఉన్నాయి. సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో కొంత మంది ప్రైవేటు వ్యాపారులు పలు రకాల విత్తన కంపెనీల పేరిట మార్కెట్‌లో విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాటిలో నుంచి నాసి రకాలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ప్రతి ఏటా ఏదో చోట దుకాణాల నిర్వాహకులు నాసి విత్తనాలను అంటగడుతున్నారు.

ఆన్‌లైన్‌లో వివరాలు..

విత్తనాలు కొనుగోలు సమయంలో రసీదులు తీసుకోవాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. నష్టం వాటిల్లినప్పుడు వాటి ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అక్కడక్కడ ఫిర్యాదులు అందుతున్నా రసీదులు లేకపోవడంతో అవన్నీ నీరుగారుతున్నాయి. విత్తనాల సంచులపై ఎక్కడ తయారు చేశారు, మొలకశాతం, స్వచ్ఛత తదితర వివరాలు ముద్రించి ఉండాలి. ఫర్టిలైజర్‌ దుకాణాల్లో ఎరువుల స్టాక్‌ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని డీలర్లకు సూచించారు. ఆయా వివరాల ఆధారంగా లెక్కల్లో తేడా వస్తే లైసెన్స్‌లు రద్దు చేసే అవకాశం లేకపోలేదు.


టాస్క్‌ఫోర్స్‌ బృందాలు..

ఐదేళ్లుగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తుండటంతో ఈ బెడద కాస్త తగ్గింది. జిల్లాలో మెదక్‌, కౌడిపల్లి, నర్సాపూర్‌, రామాయంపేట, పెద్దశంకరంపేట సబ్‌డివిజన్‌లు ఉన్నాయి. జిల్లాకు రాష్ట్ర బృందం, జిల్లా బృందం, మండలానికి ఒక బృందం చొప్పున మూడు బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. రాష్ట్ర బృందంలో వ్యవసాయశాఖ కమిషనరేట్‌ అధికారులు, జిల్లా బృందంలో పాలనాధికారి, అధికారులు, మండల బృందంలో ఏవో, పోలీసు సిబ్బంది సభ్యులుగా ఉన్నారు. నాసి విత్తనాలు, నిషేధిత గ్లైకోసెట్‌ కలుపు మందులపై దృష్టిసారించారు.


నిబంధనలు పాటించాలి

- పరశురాంనాయక్‌, డీఏవో

నాసి విత్తనాలు, నిషేధిత రసాయనాల వంటివి విక్రయించకుండా ఉండటానికి పకడ్బందీగా ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నాం. టాస్క్‌ఫోర్స్‌ బృందాల సహాయంతో తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు పాటించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని