logo
Updated : 30 Jun 2022 03:05 IST

విషం చిమ్ముతున్నా.. విస్మరిస్తున్నారు!

వరదలో కలిపేస్తూ, రోడ్లపై పారబోస్తున్న పరిశ్రమలు
యథేచ్ఛగా నీటి వనరుల కలుషితం
ఈనాడు, సంగారెడ్డి, న్యూస్‌టుడే, జిన్నారం, హత్నూర
గడ్డపోతారం పారిశ్రామికవాడలో అల్లీనగర్‌ రోడ్డుపై వ్యర్థజలాలు

వర్షాలు కురవాలని.. వాగులు, వంకలు పొంగాలని అందరూ కోరుకుంటారు. కొన్ని పరిశ్రమల యజమానులు మాత్రం వానొస్తుందంటే ఎంతగానో సంతోషపడతారు. తమ పరిశ్రమల్లో ఉన్న విషపు జలాలను వరదలో కలిపేయొచ్చని సంబరపడతారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన కాలుష్య నియంత్రణ మండలి విభాగం కాసుల మత్తులో జోగుతుండటమూ వారికి కలిసొస్తోంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అప్పటికప్పుడు హడావుడి చేయడం, అనంతరం అంతా మామూలేన్నట్లు వ్యవహరించడం వీరికే చెల్లుతుంది. అందుకే జిల్లాలోని నీటి వనరులు ఇప్పుడు కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి. పారిశ్రామిక ప్రాంతాల్లోని బోర్ల నుంచి ఘాటైన వాసనలతో నీళ్లు వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మళ్లీ వానాకాలం వచ్చింది. కనీసం ఈసారైనా అధికారులు తమ బాధ్యతలను పక్కాగా నిర్వహించాలని కాలుష్య బాధిత ప్రజలు, రైతులు విన్నవిస్తున్నారు.

ఘాటైన వాసనలతో..

గడ్డపోతారం పారిశ్రామికవాడ అల్లీనగర్‌లో ట్యాంకర్లలో రసాయన వ్యర్థజలాలు తెచ్చి ఇటీవల రోడ్డుపై పోశారు. దాదాపు కిలోమీటరు దూరం ఇలా పారబోస్తూ వెళ్లారు. కొత్తగా వేస్తున్న మట్టిరోడ్డుపై ఉన్న గుంతల్లో ఇవి నిలిచి, వారం పాటు ఆ మార్గంలో ప్రయాణించలేని దుస్థితి నెలకొంది. సమీపానికి వెళితే ఘాటైన వాసనలతో ఇబ్బందులు తప్పలేదు. అధికారులు నమూనా సేకరించి, పరీక్షలు చేసి బాధ్యులైన వారిని పట్టుకుంటామని చెప్పారు. ఇప్పటికీ అడుగు ముందడుగు పడలేదు.

వర్షం కురిస్తే చాలు: హత్నూర, సదాశివపేట, పటాన్‌చెరు, జిన్నారం, కొండాపూర్‌, గుమ్మడిదల తదితర మండలాల్లో రసాయన పరిశ్రమలున్నాయి. వర్షం కురిస్తే చాలు కొన్ని గంటల పాటు పరిశ్రమల నుంచి వరదతో పాటు వ్యర్థజలాలు పారుతూనే ఉంటాయి. కాలువల ద్వారా సమీపంలోని చెరువులు, వాగుల్లోకి చేరిపోతుంటాయి. ప్రహరీకి రంధ్రాలు చేసి విషపునీటిని బయటకు వదులుతుంటారు. ఈ విషయం తెలిసినా కట్టుదిట్టమైన చర్యలకు దూరంగా ఉండిపోతున్నారు.

హత్నూర శివారులోని పొలంలో రంగు మారి..

విధి లేని పరిస్థితిలో: కాలుష్య జలాల వల్ల నక్కవాగు  కలుషితమైంది. పటాన్‌చెరులోని పరిశ్రమలతో పాటు, హత్నూర మండలం గుండ్లమాచనూరు వద్ద ఉన్న కర్మాగారాల నుంచి రసాయన వ్యర్థజలాలు నేరుగా నక్కవాగులో కలుపుతున్నారు. దీంతో ఈ నీటిని సాగు అవసరాలకు ఉపయోగించలేని పరిస్థితి. కొందరు రైతులు కిలోమీటర్ల మేర వాగు  నుంచి పైపులైన్లు వేసుకున్నారు. నీరు పూర్తిగా రంగుమారి ఘాటైన వాసనలు వస్తున్నాయి. కొందరు విధిలేని పరిస్థితిలో ఈ నీళ్లతో పంటలు పండిస్తున్నారు.


చెరువుల్లోకి చేరుతూ..

సదాశివపేట మండలంలో ఉన్న రసాయన పరిశ్రమలు వ్యర్థజలాలను దిగువన ఉన్న వాగులో కలుపుతున్నాయి. అక్కడి నుంచి నేరుగా ఇవి గంగకత్వలోకి చేరుతున్నాయి.  ఎగువన ఉన్న పరిశ్రమల నుంచి వచ్చి కొండాపూర్‌ మండలం  చెర్లగోపులారం చెరువులోకి వస్తున్నాయి. బొంతపల్లిలో ఉన్న పరిశ్రమల నుంచి భారీగా విషపునీళ్లు వచ్చి జిన్నారం మండలంలోని రాయునిచెరువులో కలుస్తున్నాయి. పటాన్‌చెరు నియోజకవర్గంలోనే అత్యధికంగా 700 ఎకరాలకు నీళ్లిచ్చే ఈ వనరు ఇప్పుడు పూర్తిగా రంగు మారింది.  పాశమైలారం పారిశ్రామికవాడ నుంచి వచ్చే జలాలు దిగువన ఉన్న పెద్దచెరువులో కలుస్తాయి. నేరుగా కాలువల ద్వారా ఇందులోకి విషం నింపుతున్నారు. చేపలు చనిపోతున్నాయని, నీళ్లు తాగిన పశువులూ అనారోగ్యం బారిన పడుతున్నాయని చాలా సార్లు స్థానిక రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు.


నోటీసులిస్తున్నాం, నిఘా పెంచాం: రవికుమార్‌, ఈఈ, పీసీబీ

వానాకాలంలో వరద నీళ్లతో పాటు కాలుష్య జలాలు బయటకు వదలకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే మా పరిధిలోని అన్ని పరిశ్రమలకు నోటీసులిచ్చాం. ట్యాంకర్లలో తెచ్చి వ్యర్థజలాలు పారబోయకుండా నిఘా పెంచాం. ఇటీవల అల్లీనగర్‌లో పారబోసిన జలాల నమూనాలు తీసుకున్నాం. విశ్లేషణ ఫలితాలు అందాల్సి ఉంది. ఆ తర్వాత సంబంధిత వ్యక్తులను గుర్తిస్తాం. నీటి వనరుల్లో రసాయనాలు కలవకుండా చూస్తాం.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని