logo

కలుషితాహారం ఘటనలో నలుగురిపై వేటు

మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై సిద్దిపేట సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 22 మంది విద్యార్థినులను వైద్యులు డిశ్ఛార్జి చేశారు. విద్యార్థినులు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.

Published : 30 Jun 2022 01:51 IST

ప్రిన్సిపల్‌ సస్పెన్షన్‌..
విధుల నుంచి డిప్యూటీ వార్డెన్‌, ఇద్దరు వంట సిబ్బంది తొలగింపు

సిద్దిపేట, న్యూస్‌టుడే: కలుషితాహారం తిని 128 మంది బాలికలు అనార్యోగానికి గురైన ఘటనలో బాధ్యులైన నలుగురిపై ప్రభుత్వం వేటు వేసింది. ఈ మేరకు మైనార్టీ గురుకులాల విద్యా సంస్థ రాష్ట్ర కార్యదర్శి షఫీఉల్లా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి భోజనంలో వంకాయ కూరతో మధ్యాహ్నం మిగిలిన చికెన్‌ కూర కలుపుకొని తిన్న పలువురు విద్యార్థినులు ఆ రోజు అర్ధరాత్రి నుంచి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, కళ్లు తిరగటం, ఇతర లక్షణాలతో బాధపడిన విషయం తెలిసిందే. 22 మంది స్థానిక సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందారు. చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనను ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. విధుల్లో అలసత్వం, భోజన నిర్వహణలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలకు ఉపక్రమించారు. పాఠశాల ప్రిన్సిపల్‌ శ్రీలతను సస్పెండ్‌ చేయగా, డిప్యూటీ వార్డెన్‌ రజియా సుల్తానా, వంట సిబ్బంది (హెడ్‌ కుక్‌లు) దుర్దన, నాగరాణిలను విధుల నుంచి తొలగించారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌గా పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు (పీజీటీ) సుప్రియకు, ఇన్‌ఛార్జి డిప్యూటీ వార్డెన్‌గా గణిత ఉపాధ్యాయురాలు (టీజీటీ) మమతకు బాధ్యతలు అప్పగించారు. కొత్త వంట మనుషులను నియమించిన తరువాత ఆ ఇద్దరు వంట సిబ్బందిని తొలగించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


కోలుకున్న విద్యార్థినులు

బాలికలను అంబులెన్సులో పంపిస్తున్న ఆస్పత్రి సిబ్బంది

సిద్దిపేట టౌన్‌: మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై సిద్దిపేట సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 22 మంది విద్యార్థినులను వైద్యులు డిశ్ఛార్జి చేశారు. విద్యార్థినులు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. బుధవారం ఉదయం అదనపు కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ వారిని పరామర్శించారు. విద్యార్థినులను జిల్లా వైద్యాధికారి కాశీనాథ్‌, సూపరింటెండెంట్‌ కిశోర్‌కుమార్‌, రాష్ట క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు పాల సాయిరాం, ఆర్‌ఎంఓ చంద్రశేఖర్‌ దగ్గరుండి పాఠశాలకు పంపించారు. అక్కడినుంచి కొందరిని వారి తల్లిదండ్రులు తమ ఇళ్లకు తీసుకెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని