logo

శిక్షణ.. ఉత్పత్తి కేంద్రంగా సెట్విన్‌

సెట్విన్‌.. ఉత్పత్తి కేంద్రంగా ఎదగనుంది. ఒకప్పుడు శిక్షణలకే పరిమితమైన ఈ సంస్థ.. క్రమంగా ఉత్పత్తుల తయారీ దిశగా అడుగులు వేస్తోంది. పర్యావరణ హితం, మహిళల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేట

Published : 30 Jun 2022 01:51 IST

సిద్దిపేటలో వస్త్ర న్యాప్కిన్ల తయారీ షురూ
స్వయం ఉపాధికి బాటలు


న్యాప్కిన్ల తయారీలో మహిళలు

న్యూస్‌టుడే, సిద్దిపేట: సెట్విన్‌.. ఉత్పత్తి కేంద్రంగా ఎదగనుంది. ఒకప్పుడు శిక్షణలకే పరిమితమైన ఈ సంస్థ.. క్రమంగా ఉత్పత్తుల తయారీ దిశగా అడుగులు వేస్తోంది. పర్యావరణ హితం, మహిళల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేట సహా వివిధ ప్రాంతాల్లో ‘రుతుప్రేమ’ కార్యక్రమం అమలవుతోంది. అందులో భాగంగా పర్యావరణ హితమైన వస్త్రంతో తయారీ చేసిన న్యాప్కిన్లు (శానిటరీ), మెడికల్‌ గ్రేడ్‌ సిలికాన్‌ కప్‌లు పంపిణీ చేస్తున్నారు. వస్త్రంతో తయారీ చేసిన న్యాప్కిన్లను ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఈ తరుణంలో సిద్దిపేటలోని సెట్విన్‌ కేంద్రంలోనే తయారీ చేసి మార్కెటింగ్‌ చేయాలనే యోచన నిర్వాహకులకు తట్టింది. ఇది ఇటీవల కార్యరూపం దాల్చింది. నెల రోజులుగా ముడి సరకును తెప్పిస్తూ.. తయారీ చేస్తున్నారు. సెట్విన్‌ ద్వారా ఏటా 10 కోర్సుల్లో దాదాపు 1000 మంది యువతీ యువకులకు తర్ఫీదు అందిస్తున్నారు. ఇన్నాళ్లు శిక్షణ ఇవ్వగా.. ప్రస్తుతం ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఫలితంగా కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా పలువురికి ఉపాధి కల్పించే అవకాశం ఏర్పడింది.

బెంగళూరు నుంచి ముడిసరకు..

నాణ్యత కలిగిన వస్త్ర న్యాప్కిన్లు కుట్టడంపై గత నెల బెంగళూరుకు చెందిన ప్రతినిధుల బృందం తొలుత 15 మందికి శిక్షణ అందించింది. ఇవి కుట్టాలంటే ప్రత్యేక యంత్రాలు (ఇండస్ట్రియల్‌ మిషన్లు) తప్పనిసరి. అప్పటికే కొంత అవగాహన ఉన్న వారు తర్ఫీదు పొందడం ద్వారా సెట్విన్‌లో సునాయాసంగా తయారీ చేస్తున్నారు. ఒప్పందం మేర ప్రభుత్వానికి లేదా ప్రైవేటుగా విక్రయాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో క్లాత్‌ ప్యాడ్‌ బహిరంగ విపణిలో ధర రూ.700 పలుకుతోంది. స్థానికంగా రూ.150 నుంచి 250 వరకు విక్రయించాలని నిర్ణయించారు. పునర్వినియోగమైన ఈ ఉత్పత్తిని దాదాపు రెండేళ్ల పాటు వినియోగించవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.  ముడి సరకును బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ ఆర్డర్‌ తీసుకొని డిమాండ్‌ మేర సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

తొలిగా 2100 సరఫరా..

మూడు నెలల కిందట సిద్దిపేటలోని ఐదో వార్డును బల్దియా పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకొని ‘రుతుప్రేమ’కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆ వార్డులో విజయవంతం కావడంతో అదే స్ఫూర్తితో జిల్లాలో శాఖల వారీగా ఉద్యోగినులకు అవగాహన కల్పిస్తూ పంపిణీ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు భాగస్వాములవుతున్నారు. క్రమంగా జిల్లాలో కార్యక్రమం విస్తరిస్తున్న తరుణంలో స్థానికంగా నాణ్యతతో తయారీ చేసి విక్రయించడం ద్వారా మహిళలకు ఉపాధి కల్పించే అవకాశం ఏర్పడింది. ఈ విషయమై సెట్విన్‌ జిల్లా సమన్వయకర్త అమీనాభాను ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. బెంగళూరుకు చెందిన స్టోన్‌సూప్‌ సంస్థ సహకారంతో క్లాత్‌ప్యాడ్‌ల తయారీ మొదలెట్టాం. ఇటీవల ఉత్పత్తి నాణ్యతను పరిశీలించిన ఆ సంస్థ ఆమోదం తెలిపింది. తొలి ఆర్డర్‌గా సెట్విన్‌ ద్వారా 2100 క్లాత్‌ ప్యాడ్‌లు తయారీ చేసి ‘రుతుప్రేమ’ కార్యక్రమానికి అందించాం. ప్రైవేటుగాను పలువురు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని