logo

ఉద్రిక్తతకు దారి తీసిన అరెస్టు..

కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులను బుధవారం పరామర్శించేందుకు వెళ్తున్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను మార్గమధ్యన పోలీసులు అరెస్టు చేశారు.

Published : 30 Jun 2022 01:51 IST

తోపులాటలో గాయపడ్డ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌


వెంకట్‌ను తరలిస్తున్న పోలీసులు

సిద్దిపేట, సిద్దిపేట టౌన్‌, చిన్నకోడూరు: కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులను బుధవారం పరామర్శించేందుకు వెళ్తున్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను మార్గమధ్యన పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బలవంతంగా రక్షక వాహనంలోకి తరలిస్తుండగా నాయకులు, పోలీసులకు తోపులాట జరిగింది. దీంతో వెంకట్‌ తల, చేతికి గాయమవడంతో అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులను పరామర్శించేందుకు కరీంనగర్‌ నుంచి సిద్దిపేటకు వస్తున్న వెంకట్‌ను చిన్నకోడూరు మండలం రామునిపట్ల వద్ద రాజీవ్‌ రహదారిపై పోలీసులు అడ్డగించారు. అనుమతి లేదంటూ నిరాకరించారు. అక్కడ పోగైన ఎన్‌ఎస్‌యూఐ, కాంగ్రెస్‌ నాయకులకు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో ఆయనను పోలీసు వాహనంలో ఎక్కిస్తుండగా గాయమైంది. తొలుత తొగుట పోలీసు ఠాణాకు తీసుకెళ్లారు. అనంతరం గజ్వేల్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి శ్రేణులు తీసుకెళ్లాయి. మరోవైపు అరెస్టయిన పలువురు శ్రేణులను చిన్నకోడూరు పోలీసు ఠాణాకు తరలించగా.. అక్కడా నిరసన తెలిపారు. అరెస్టయిన వారిలో టీపీసీసీ అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ, ఇతర నేతలు ఉన్నారు. సిద్దిపేటలోనూ స్థానిక నేతలు మైనార్టీ గురుకుల పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు చేరుకొని అక్కడి నుంచి పంపించారు. ఆందోళనలో కాంగ్రెస్‌ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షుడు బొమ్మల యాదగిరి, రాష్ట మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు కలీముద్దీన్‌, నాయకులు అంజిరెడ్డి, శివ, లక్ష్మీ, మమతారెడ్డి ఉన్నారు. ఈ విషయమై చిన్నకోడూరు ఎస్‌ఐ శివానందంను ‘న్యూస్‌టుడే’ అడుగగా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వెంకట్‌ను అరెస్టు చేశామని తెలిపారు. పోలీసు వాహనంలో తరలించే క్రమంలో ఎలాంటి గాయాలు కాలేదని వివరించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఖండించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని