logo

వార్డుల్లో సమస్యలు పట్టవా..?

వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మెదక్‌ పురపాలిక సర్వసభ్య సమావేశం ఛైర్మన్‌ చంద్రపాల్‌ అధ్యక్షతన జరిగింది. 24వ వార్డు కౌన్సిలర్‌ మేఘమాల మాట్లాడుతూ..

Published : 01 Jul 2022 02:19 IST

పురపాలిక సమావేశంలో అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం

 


అధ్యక్షుడు చంద్రపాల్‌తో మాట్లాడుతున్న కౌన్సిలర్‌ సమియోద్దీన్‌

మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే : వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మెదక్‌ పురపాలిక సర్వసభ్య సమావేశం ఛైర్మన్‌ చంద్రపాల్‌ అధ్యక్షతన జరిగింది. 24వ వార్డు కౌన్సిలర్‌ మేఘమాల మాట్లాడుతూ.... తన వార్డు పరిధిలో మిషన్‌ భగీరథ పనుల కారణంగా రోడ్డు ధ్వంసమైందని, రాకపోకలు సాగించాలంటే అవస్థలు తప్పడం లేదన్నారు. పర్యవేక్షణ కొరవడటంతో విలువైన తాగునీరు వృథాగా పోతుందని, మరికొన్ని ప్రాంతాల్లో నీరు సక్రమంగా రావడమే లేదన్నారు. ఆమెకు మద్దతుగా ఉపాధ్యక్షుడు మల్లికార్జున్‌ గౌడ్‌ మాట్లాడుతూ...పెద్దబజార్‌, నవాబుపేట తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. గత మూడు నెలల నుంచి మిషన్‌ భగీరథ సమస్యలపై సమావేశంలో చర్చించి.. ప్రతిసారీ రికార్డుల్లో రాసుకోవడం తప్ప చేసింది ఏమీ లేదని డీఈఈ మహేశ్‌ను నిలదీశారు. ప్రస్తుతం జలవనరులు ఉన్పప్పటికీ ప్రజలకు సరిపడా నీరు అందించలేక పోవడంతో చెడ్డపేరు తీసుకువస్తున్నారని అధ్యక్షుడు చంద్రపాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 17వ వార్డు కౌన్సిలర్‌ రాజలింగం స్పందిస్తూ మిషన్‌ భగీరథ పనుల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. మరమ్మతులకు రూ.10 లక్షలు కేటాయించామని  డీఈఈ సమాధానం ఇవ్వగా.. 32 వార్డుల్లో మరమ్మతులు చేసేందుకు సరిపోతాయా అని ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన సామగ్రిని అందించాలని 19వ వార్డు కౌన్సిలర్‌ జయరాజ్‌ సూచించడంతో.. విడుతల వారీగా పంపిణీ చేస్తామని చంద్రపాల్‌ తెలిపారు. సీజన్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఆయా వార్డుల్లో తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు.
‘ఈనాడు’ కథనాలపై చర్చ..
జూన్‌ 28న (మంగళవారం) పట్టణంలోని 5 వార్డుల నుంచి వెలువడుతున్న మురుగు.. మంజీరాలో కలిసి కలుషితమవుతున్న తీరుపై ‘మంజీరాలోకి మురుగు’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీన్ని 11వ వార్డు కౌన్సిలర్‌ సమియోద్దీన్‌ సభలో ప్రస్తావించారు. మహబూబ్‌నహర్‌ కాలువలో మురుగు కలవకుండా పెద్ద పైపులను అనుసంధానం చేసి సమస్యను పరిష్కరించాలన్నారు.
ః పట్టణంలో కుక్కల బెడదపై జూన్‌ 16న ‘వణికిస్తూ..కాటేస్తూ..’ శీర్షికతో ‘ఈనాడు’లో కథనం వచ్చింది. దీనిపై ఉపాధ్యక్షుడు మల్లికార్జున్‌గౌడ్‌ సభ దృష్టికి తెచ్చారు. పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో జంతు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి స్థలం సమస్య పరిష్కరించి పనులు చేపడుతామని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని