logo

కలుషిత నీటితోనే.. అధిక సమస్యలు!

సిద్దిపేట, మెదక్‌ జిల్లాల పరిధిలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. కలుషిత భోజనం, నీరు ఇందుకు కారణం. ఆహార సామగ్రిని భద్రపరిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం, రక్షిత మంచినీటిని

Updated : 02 Jul 2022 07:25 IST

ఆహార సామగ్రి భద్రపరిచే విషయంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి

‘ఈనాడు’తో జిల్లా ఆహార పరిరక్షణ అధికారి క్రిష్ణమూర్తి

ఈనాడు, సిద్దిపేట


సిద్దిపేట మైనార్టీ బాలికల గురుకులంలో భోజనం నాణ్యతను పరిశీలిస్తున్న క్రిష్ణమూర్తి

సిద్దిపేట, మెదక్‌ జిల్లాల పరిధిలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. కలుషిత భోజనం, నీరు ఇందుకు కారణం. ఆహార సామగ్రిని భద్రపరిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం, రక్షిత మంచినీటిని వాడకపోవడం, నాణ్యత లేని గుడ్లను ఉడికించి ఇవ్వడం ఇలా పలు అంశాలు విద్యార్థులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. సిద్దిపేటలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని 128 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. చిన్నశంకరంపేట మండలం సూరారం ఉన్నత పాఠశాలలో నీటి కలుషితం వల్ల 15 మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. తాజాగా జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌ గ్రామంలో బీసీబాలుర వసతిగృహంలో ఉదయం అల్పాహారం తిని నలుగురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. ఈ క్రమంలో వసతిగృహాలు, పాఠశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిద్దిపేట జిల్లా ఆహార పరిరక్షణ అధికారి సీహెచ్‌. క్రిష్ణమూర్తి ‘ఈనాడు’తో మాట్లాడుతూ వివరించారు. త్వరలోనే ప్రతి పాఠశాలకు, గురుకులాలకు ఇదే అంశాల గురించి అవగాహన పెంచేలా చర్యలు తీసుకోనున్నామని ఆయన వెల్లడించారు.

* ట్యాంకులో నీళ్లను భోజనం వండేందుకు వినియోగిస్తుంటారు. ఇవి కలుషితం కావడం వల్ల ప్రధానంగా సమస్యలు వస్తుంటాయి. 90 శాతం ఇబ్బందులకు సురక్షితం కాని నీరే కారణం. అందుకే ట్యాంకులపై మూతలు తప్పనిసరిగా ఉండేలా చూడాలి. క్రమం తప్పకుండా ట్యాంకులను శుభ్రం చేయాలి. స్థానికంగా అందుబాటులో ఉండే పరీక్షా కేంద్రాలకు నమూనాలు తీసుకెళ్లి నీటి నాణ్యతా పరీక్షలూ చేయిస్తే మేలు.

* ఆహారాన్ని సిద్ధం చేసే సమయంలో చాలా రకాల వ్యర్థాలను అక్కడే పడేస్తుంటారు. దీనివల్ల కలుషితమయ్యే అవకాశాలుంటాయి. వంటగదుల సమీపంలోకి కుక్కలు, పందులూ వస్తుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలి. కొన్నిసార్లు పాడైపోయిన సరకుల వల్ల ఆహారం కలుషితమవుతుంది. అందుకే భోజనం వండేటప్పుడు ఆయా సరకులు కాలం చెల్లినవా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాలి.

* వంటపాత్రలను శుభ్రం చేసే సమయంలో అందుకోసం ఉపయోగించిన సర్ఫ్‌ లేదా సబ్బు అవశేషాలు ఏమాత్రం మిగిలినా ఇబ్బందులు వస్తాయి. అందుకే వంటపాత్రలను శుభ్రం చేసేటప్పుడు పూర్తిగా అవశేషాలు తొలగేలా చూడాలి.

* పాతచింతపండు వాడి పులుసు చేసినా సమస్యలు వస్తాయి. అందుకే చాలా కాలం నిల్వ ఉంచిన చింతపండును వాడొద్ధు పచ్చిపులుసు చేసే సమయంలో తప్పనిసరిగా కాచిచల్లార్చిన నీటిని ఉపయోగించడం ఉత్తమం. వసతిగృహాలు, పాఠశాలల్లో ఉండే ఆర్వో ప్లాంట్ల నిర్వహణా మెరుగ్గా ఉండాలి. లేని పక్షంలో నీరు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది.

* వంట చేసే ముందు వంటమనుషులు చేతులను శుభ్రంగా కడుక్కునేలా చూడాలి. ఆహారం తినేముందు పిల్లలూ ఇదే పద్థతిని తప్పనిసరిగా పాటించేలా తగిన ఏర్పాట్లు చేయాలి. మాంసాహారాన్ని బాగా ఉడికించిన తర్వాతే వడ్డించాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ మిగిలిపోయిన కూరలను వడ్డించకూడదు.


 

నాణ్యతలేని, కుళ్లిన కోడిగుడ్లను వండిపెట్టొద్ధు ఉడకబెట్టేముందు నీటిలో వేస్తే తేలిన గుడ్లను పక్కనపెట్టేయాలి. కేవలం మునిగిన వాటినే ఉడికించాలి. కుళ్లిపోయినవే తేలుతాయి. ప్రతిసారీ ఇలా చేయాలి.

 


బియ్యం, ఇతర ఆహార పదార్థాలు నిల్వచేసే చోటు శుభ్రంగా ఉండాలి. ఎలుకలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలుకలు ఆహారపదార్థాల్లో మలమూత్రాలను విస్తరించకుండా చూడాలి. వంటమనుషులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. గోర్లు తీసుకోవాలి. ఒకవేళ వారి చేతులకు గాయాలయితే.. మానేవరకు వంటపనికి దూరంగా ఉండాలి. వారికి అంటువ్యాధులు ఏమైనా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు కనీసం ఆరునెలలకోసారైనా స్థానిక వైద్యులతో పరీక్షలు చేయించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని