logo

బోధన ఉత్తమం.. ఫలితం శతశాతం

ఏక్‌ బార్‌, దోబార్‌, తీన్‌బార్‌, చార్‌బార్‌, పాంచ్‌బార్‌, చేబార్‌...ఇదేదో వేలం పాట అనుకుంటే పొరపాటు. పదో తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో వరుసగా ఐదు, ఆరో సంవత్సరం శతశాతం ఉత్తీర్ణత సాధించి ఘనతను చాటుకోవడం విశేషం. ఉపాధ్యాయుల చక్కటి బోధన, విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కింది. ఇలా వరుసగా వంద శాతం ఫలితాలు సాధించిన తీరుపై ప్రత్యేక కథనం.

Published : 03 Jul 2022 01:37 IST

ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలలు

న్యూస్‌టుడే, చేగుంట, పాపన్నపేట, టేక్మాల్‌

నాగ్సాన్‌పల్లి ఉన్నత పాఠశాలలో..

ఏక్‌ బార్‌, దోబార్‌, తీన్‌బార్‌, చార్‌బార్‌, పాంచ్‌బార్‌, చేబార్‌...ఇదేదో వేలం పాట అనుకుంటే పొరపాటు. పదో తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో వరుసగా ఐదు, ఆరో సంవత్సరం శతశాతం ఉత్తీర్ణత సాధించి ఘనతను చాటుకోవడం విశేషం. ఉపాధ్యాయుల చక్కటి బోధన, విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కింది. ఇలా వరుసగా వంద శాతం ఫలితాలు సాధించిన తీరుపై ప్రత్యేక కథనం.

జిల్లాలో చేగుంట, పాపన్నపేట, టేక్మాల్‌లోని జడ్పీ ఉన్నత, తెలంగాణ ఆదర్శ పాఠశాలలు శతశాతం ఫలితాలు సాధించడం విశేషం. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవ చూపి ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో చక్కటి ఫలితాలు సాధించడానికి మార్గం సుగమమైంది.

ప్రత్యేక శ్రద్ధ చూపి..

కరోనా విజృంభణతో 2020 మార్చిలో పాఠశాలలు మూతపడిన విషయం విదితమే. ఆ తర్వాత మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో గత విద్యాసంవత్సరం సెప్టెంబరులో ప్రత్యక్ష తరగతులు మొదలయ్యాయి. అంతకంటే ముందు ఆన్‌లైన్‌, దూరదర్శన్‌ ద్వారా పాఠాలు బోధించారు. ఇక ప్రత్యక్ష బోధన మొదలైనప్పటి నుంచి పది విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇక ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పిల్లల ఇళ్లకు వెళ్లి సందేహాలు తీర్చడం, వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ఫలితాల సాధనకు దోహదం చేశాయి. నిత్యం ప్రత్యేక తరగతులతో పాటు పరీక్షలు నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకొని చరవాణి ద్వారా పర్యవేక్షించారు. తరచూ వారి ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడటం, వారికి సూచనలు చేస్తూ వచ్చారు. సమావేశాలు సైతం నిర్వహించి ఇళ్ల వద్ద చదివించేలా సూచించారు.

లక్ష్యాన్ని నిర్దేశించి..

పాపన్నపేట మండలం కొత్తపల్లి, గాంధారిపల్లి, పొడ్చన్‌పల్లి, కుర్తివాడ, నాగ్సాన్‌పల్లి, యూసూఫ్‌పేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వరుసగా శతశాతం ఉత్తీర్ణత సాధిస్తూ మన్ననలు పొందుతున్నాయి. గత ఐదేళ్లుగా ఇవే ఫలితాలతో దూసుకెళ్తున్నాయి. ఇక్కడి ఉపాధ్యాయులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. నిత్యం ప్రత్యేక తరగతులు చేపట్టారు. రోజూ తెల్లవారుజామున లేపి చదివించేలా తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చారు. తరచూ ఫోన్లు చేయడం, ఆకస్మికంగా ఇళ్లకు వెళ్లి తనిఖీ చేస్తూ విద్యార్థులు చదివేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. లక్ష్యనిర్దేశన చేసి ప్రోత్సహించారు.

* టేక్మాల్‌లోని తెలంగాణ ఆదర్శ పాఠశాల సైతం ఐదేళ్లుగా శతశాతం ఫలితాలు సాధిస్తోంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలు రాగానే నివృత్తి చేశారు. గత విద్యాసంవత్సరంలో వంద మంది వరకు ఉండగా.. ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ చూపి పర్యవేక్షించారు.


ఆరు సార్లు..

కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల

చేగుంట మండలం కరీంనగర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల 2014-15 నుంచి 2021-22 వరకు వరుసగా (కరోనా సమయంలో రెండేళ్లు మినహా) ఆరు సార్లు శతశాతం ఫలితాలతో ముందంజలో నిలిచింది. ప్రధానోపాధ్యాయురాలు నీరజతో పాటు ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉండగా.. మొదటి నుంచి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. పాఠశాల పచ్చదనానికి నిలయం. ప్రహరీ లేకపోయినా ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషితో నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగాయి. రెండు సార్లు స్వచ్ఛ పాఠశాలగా ఎంపికైంది. పది ఉత్తీర్ణతలోనూ ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలిచింది.

* చేగుంట తెలంగాణ ఆదర్శ పాఠశాలలో వరుసగా ఐదేళ్ల నుంచి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ప్రిన్సిపల్‌ భూపాల్‌రెడ్డి పర్యవేక్షణలో ఉపాధ్యాయుల చక్కగా బోధన చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని