logo

డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతోనే అభివృద్ధి

తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సిందేనని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ కేంద్ర సహాయ మంత్రి సంజీవ్‌కుమార్‌ బాల్యన్‌ అన్నారు. శనివారం భాజపా సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు

Published : 03 Jul 2022 01:37 IST

కేంద్ర సహాయ మంత్రి సంజీవ్‌ కుమార్‌

మెదక్‌ రైల్వే స్టేషన్‌ను పరిశీలిస్తున్న కేంద్ర సహాయ మంత్రి సంజీవ్‌ కుమార్‌ బాల్యన్‌,

గడ్డం శ్రీనివాస్‌, తదితరులు

మెదక్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సిందేనని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ కేంద్ర సహాయ మంత్రి సంజీవ్‌కుమార్‌ బాల్యన్‌ అన్నారు. శనివారం భాజపా సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌తో కలిసి మెదక్‌ పట్టణంలోని కోట, రైల్వే స్టేషన్‌, ఇందిరాగాంధీ క్రీడా మైదానాన్ని పరిశీలించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు, కార్మికులు, అన్ని వర్గాల వారు రాష్ట్ర ప్రభుత్వంపై నిరాశగా ఉన్నారన్నారు. 2023 ఎన్నికలో ప్రజలు భాజపాకు అధికారం కట్టబెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం వల్లే ఇంధన ధరలు పెరిగాయని, ప్రజల ఇబ్బందుల దృష్ట్యా కేంద్రం వాటిపై సుంకాన్ని తగ్గించిందని చెప్పారు. ఇక్కడ మాత్రం ప్రజలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారం మోపుతూనే ఉన్నారని విమర్శించారు. సమావేశం అనంతరం కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని, నిర్వహణ అధ్వానంగా ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి రాజశేఖర్‌, నల్లాల విజయ్‌ కుమార్‌, సుధాకర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు నాయిని ప్రసాద్‌, నాయకులు మధు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల బ్రెయిడ్‌ డెడ్‌కు గురై అవయవ దానం చేసి విద్యార్థి మోక్షిత్‌ కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. అతడి తండ్రి శ్రీనివాస్‌ను సత్కరించారు.

తాళాలు పగులగొట్టి.. : భాజపా సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా మెదక్‌కు వచ్చిన కేంద్ర సహాయ మంత్రి బాల్యన్‌ శుక్రవారం రాత్రి స్థానిక కోటలోని హరిత రెస్టారెంట్‌లో బస చేశారు. అనంతరం మంత్రి పర్యటన నేపథ్యంలో బుక్‌ చేసిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి మంత్రి వ్యక్తిగత సిబ్బంది బస చేయడానికి చేరుకోగా ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉంది. సిబ్బంది లేకపోవడంతో అధికారులను సంప్రదించడానికి యత్నించగా అందుబాటులోకి రాలేదు. పట్టణ పోలీసు, రెవెన్యూ వారికి సమాచారం ఇచ్చి తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లారు. ఈ విషయమై గడ్డం శ్రీనివాస్‌ మాట్లాడుతూ. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ప్రోటోకాల్‌ పాటించకపోవడంపై మండిపడ్డారు. దీనిపై ఏఈ రియాజ్‌ను వివరణ కోరగా.. రాత్రి 11.30 గంటలకు వారు వచ్చారని, కాపలాదారుడి తమ్ముడు మృతి చెందడంతో ఆయన అందుబాటులో లేడని చెప్పారు. తాళాలు దొరక పోయే సరికి దగ్గరుండి తీయించామని సమాధానం చెప్పారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని