logo

సర్వర్‌ సమస్యలిక దూరం!

అందుబాటులో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రభుత్వం పలు మార్పులకు శ్రీకారం చుడుతోంది. పారదర్శకతతో పాటు లబ్ధిదారులకు పూర్తి ప్రయోజనం కలిగేలా మార్పులు చేపడుతుండటం విశేషం. ఇందులో భాగంగా ప్రజాపంపిణీ వ్యవస్థలో లబ్ధిదారుల ఇబ్బందులు దూరం చేయడానికి అవస

Published : 03 Jul 2022 01:37 IST

రేషన్‌ డీలర్లకు అందుబాటులోకి 4జీ పీఓఎస్‌ పరికరాలు

న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట

కనుపాపలు వివరాలు తీసుకుంటున్న డీలర్

అందుబాటులో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రభుత్వం పలు మార్పులకు శ్రీకారం చుడుతోంది. పారదర్శకతతో పాటు లబ్ధిదారులకు పూర్తి ప్రయోజనం కలిగేలా మార్పులు చేపడుతుండటం విశేషం. ఇందులో భాగంగా ప్రజాపంపిణీ వ్యవస్థలో లబ్ధిదారుల ఇబ్బందులు దూరం చేయడానికి అవసరమైన సంస్కరణలు చేపట్టింది. ఈ క్రమంలో 4జీ అనుసంధానమైన ఈ-పోస్‌ పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల నుంచి వాటిని వినియోగించనున్నారు.

దుర్వినియోగం అరికట్టేలా.. : పౌరసరఫరాల శాఖలో ఈ-పోస్‌ విధానం పూర్తిగా అమలు జరుగుతూ దుర్వినియోగాన్ని అరికట్టింది. వేలిముద్ర సమస్యల పరిష్కారానికి ఐరిష్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అంతర్జాల వినియోగం ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తూ వడివడిగా 5జీ వైపు అడుగులేస్తోంది. నిత్యావసర సరకుల పంపిణీకి రేషన్‌ దుకాణాల్లో మాత్రం ఇంకా 2జీ, 3 జీ ఆధారిత పరికరాలను వినియోగిస్తుండటంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా సంకేతాల సమస్య లబ్ధిదారులను అవస్థలకు గురిచేస్తోంది. సమస్య పరిష్యారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆధునీకరణ ఈ-పోస్‌ పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రేషన్‌ డీలర్లకు ఇప్పటికే పంపిణీ చేశారు. ఈ నెల మొదటి రోజు నుంచి వినియోగంలోకి వచ్చాయి.


 

తప్పనున్న అవస్థలు : సర్వర్‌ సమస్యలతో 2జీ, 3జీ సిమ్‌లకు సంకేతాలు సక్రమంగా అందకపోవడంతో సరకుల పంపిణీలో జాప్యం ఏర్పడేది. తాజా పరికరాలతో సమస్య దూరం కానుందని డీలర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జియో కంపెనీకి చెందిన 4జీ నెట్‌వర్క్‌తో పని చేసే ఈ-పోస్‌ యంత్రాలను డీలర్లకు అందించారు. ఏదైనా సందర్భంలో సంకేతాలు రాకపోయినా, అక్కడ అందుబాటులో ఉండే ఇతర 4జీ, వైఫై నెట్‌వర్క్‌లను వినియోగించుకోవచ్చు. ఫలితంగా అంతర్జాల వినియోగంలో ఆటంకాలు తొలగిపోనున్నాయి. గతంలో అందజేసిన ఈ-పోస్‌ యంత్రాల కాలపరిమితి ముగియడంతో వాటితో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో వాటి స్థానంలో కొత్త యంత్రాలను అందజేశారు. తూకంలో ఏ మాత్రం తేడా ఉన్నా కొత్త యంత్రాల ద్వారా ప్రక్రియ పూర్తి కాదు. తూకం సరిగా ఉంటేనే ప్రక్రియ పూర్తయ్యేలా వాటిని రూపొందించారు. దీంతో పాటు లబ్ధిదారుకు రసీదు అందించేలా అవకాశం కల్పించారు.


డిజిటల్‌ లావాదేవీలు..

రేషన్‌ దుకాణాల్లో టీ-వ్యాలెట్‌ సేవలు వినియోగించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో అది అంతగా కనిపించడం లేదు. ప్రధానంగా నెట్‌వర్క్‌ సంబంధిత ఇబ్బందులే ఇందుకు ప్రధాన కారణం. తాజా నిర్ణయంతో ఈ సేవల్లోనూ నాణ్యత మెరుగవుతుంది. సరకుల పంపిణీతో పాటు ఇతర సేవలను సైతం టీ-వ్యాలెట్‌ని ప్రజలు వినియోగించుకోవచ్చు. విద్యుత్తు, చరవాణి చెల్లింపులు, రైలు, బస్సు టికెట్ల రిజర్వేషన్లు, ఖాతాల్లో నగదు జమ, ఉపసంహరణ తదితర డిజిటల్‌ లావాదేవీలు అందుబాటులోకి వస్తాయి. దీని వల్ల వినియోగదారులకు సేవలు మరింత సులభం కానున్నాయి. అదే సమయంలో డీలర్లకు కమీషన్‌ పెరగడంతో పాటు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు దూరం కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని