logo

స్వశక్తికి.. సర్వోదయ సహకారం

గ్రామాన్ని దత్తత తీసుకోవడమంటే నాలుగు మొక్కలు నాటడం, మోరీలు శుభ్రం చేయడం కాదు. వీలుదొరికినప్పుడు వచ్చి సమావేశాలు నిర్వహించి వెళ్లిపోవడం అంతకన్నా కాదంటున్నారు సర్వోదయ ఫౌండేషన్‌ ప్రతినిధులు. గ్రామస్థులు స్వశక్తితో ఎదిగేలా చేయడం, మరికొంత మందికి వారు ఉపాధి చూ

Published : 03 Jul 2022 01:37 IST

పెట్టుబడి పెట్టి అండగా నిలిచిన 65 మంది మహిళా వైద్యులు

పుల్కల్‌ మండలం గొంగ్లూరులో ఉత్పత్తుల తయారీలో మహిళా ఉద్యోగులు

గ్రామాన్ని దత్తత తీసుకోవడమంటే నాలుగు మొక్కలు నాటడం, మోరీలు శుభ్రం చేయడం కాదు. వీలుదొరికినప్పుడు వచ్చి సమావేశాలు నిర్వహించి వెళ్లిపోవడం అంతకన్నా కాదంటున్నారు సర్వోదయ ఫౌండేషన్‌ ప్రతినిధులు. గ్రామస్థులు స్వశక్తితో ఎదిగేలా చేయడం, మరికొంత మందికి వారు ఉపాధి చూపే స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమంటున్నారు. అందులో భాగంగా ‘సర్వోదయ మహిళా పారిశ్రామికవేత్తల’ పేరిట కుటీర పరిశ్రమను స్థాపించేలా చొరవ చూపిన వీరు నేడు రెండో దశ ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఉన్న ఉత్పత్తులకు తోడు ‘సర్వో మ్యాజిక్‌’ పేరుతో మరో మూడు రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి డాక్టర్‌ ఆర్‌కే పాలివాల్‌ పాల్గొననున్నారు.

ఇద్దరితో మొదలై... 135 మందికి చేరిక : ఐఆర్‌ఎస్‌ అధికారుల బృందం ఈ గ్రామాన్ని కరోనా కంటే ముందు దత్తత తీసుకుంది. మొదటి దశలోనే వీరు మాస్కుల అవసరాన్ని గుర్తించారు. గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలను ప్రోత్సహించారు. వారిద్దరు ప్రతినెలా రూ.15వేల వరకు సంపాదించగలిగారు. ఈ ఘటనతో కుటీర పరిశ్రమకు బీజం పడింది. మహిళలు సొంతంగా ఎదిగేలా ప్రణాళికలు రూపొందించారు. ఐఆర్‌ఎస్‌ అధికారి డాక్టర్‌ సుధాకర్‌నాయక్‌ ప్రత్యేక చొరవ చూపారు. పలుమార్లు స్థానిక మహిళలు, గ్రామపెద్దలతో సమావేశాలు నిర్వహించారు. తనతో పాటు చదువుకున్న మహిళా వైద్యులతోనూ కుటీర పరిశ్రమ గురించి చర్చించారు. ఉపాధి లేక.. కూలీ చేస్తున్న మహిళల జీవితాల్లో తమ వల్ల కొంతైనా వెలుగు వస్తుందనే ఉద్దేశంతో వారూ ఆసక్తి చూపారు. అలా ఇద్దరితో మొదలై ఇప్పుడు ఇందులో వాటాదారుల సంఖ్య 135కి చేరింది. ఒక్కొక్కరు తమ తాహతును బట్టి రూ.10వేల నుంచి రూ.2లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. అలా రూ.1.99 కోట్లు జమయ్యాయి.

ఫిబ్రవరి నుంచి అవుట్‌లెట్‌ : వీరు చేతితో సబ్బులు తయారు చేస్తున్నారు. రైతుల నుంచి కందులు, పెసర్లు కొని పప్పు సిద్ధం చేస్తున్నారు. కుసుమ, పల్లీలాంటి నూనెలు అందుబాటులో తెచ్చారు. ఈ ఉత్పత్తులను విక్రయించేందుకు సంగారెడ్డి పట్టణంలో అవుట్‌లెట్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు వెళుతూ తమను తాము పరిచయం చేసుకుంటూ ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఇప్పటి వరకు రూ.16లక్షల విలువైనవి అమ్మారు. నాణ్యతలో రాజీపడకుండా వీరు ఉత్పత్తులను సిద్ధం చేస్తుండటంతో మార్కెట్లో క్రమంగా ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు డిటర్జెంట్‌ కేక్‌, పౌడర్‌, లిక్విడ్‌లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

రానున్న రోజుల్లో చిరుధాన్యాలు : ప్రస్తుతం చిరుధాన్యాలకు డిమాండ్‌ అధికంగా ఉంది. హైదరాబాద్‌లాంటి నగరాలు మొదలు గ్రామాల్లోనూ ఎక్కువ మంది వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. అందుకే వీరు చిరుధాన్యాలనూ మార్కెటింగ్‌ చేసేలా ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలోని జహీరాబాద్‌ ప్రాంతంలో చిరుధాన్యాల సాగూ ఎక్కువే. ఇలాంటి అనుకూలతలను దృష్టిలో ఉంచుకొని వీటిని శుద్ధి చేసి వినియోగదారులకు అందించేలా చూడనున్నారు.

సర్వోదయ మహిళా పారిశ్రామికవేత్తల అవుట్‌లెట్‌లో విక్రయానికి సిద్ధంగా నూనెలు


పారదర్శకంగా లెక్కలు

గతంలో కూలీనాలీ పనులు చేసుకునే మహిళలూ ఇప్పుడు సర్వోదయ పారిశ్రామికవేత్తలుగా మారారు. అందరూ వాటాదారులే. దాదాపు 25 మంది ఇందులో ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్కరికి వారి పనిని బట్టి రూ.8వేల నుంచి రూ.15వేల వరకు వేతనాలు అందుకుంటున్నారు. తమకు వాటా ఉన్న సంస్థలోనే పనిచేస్తూ మరింతగా దీనిని అభివృద్ధి చేసేందుకు పాటుపడుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఆరోపణలు, వివాదాలకు తావులేకుండా పక్కాగా పారదర్శకతను పాటిస్తున్నారు. ప్రతినెలా వీరు సమావేశమవుతారు. ఆ నెలలో చేసిన ఖర్చు, ఉత్పత్తుల విక్రయాల ద్వారా వచ్చిన మొత్తం... ఇలాప్రతి లెక్కనూ సభ్యులకు వివరిస్తారు. దేశంలోనే సర్వోదయ మహిళా పారిశ్రామికవేత్తలను ఆదర్శంగా నిలిపే కృషి కొనసాగుతోంది. అది విజయవంతం కావాలని మనమూ ఆకాంక్షిద్దాం.

- ఈనాడు, సంగారెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని