logo

సమస్యలు తీరేదెట్టా?

వానాకాలం ప్రారంభంలో వివిధ రకాల వ్యాధులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తాయి. చలి, జ్వరం, దగ్గు, డెంగీ, టైపాయిడ్‌ వంటి వాటితో ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీస్తుంటారు. అయితే అక్కడ కనీస సౌకర్యాలు లేక అవస్థలు తప్పడంలేదు. సమస్యలను పరిష్కరించేందుకు మూడు నెలలకోసారి

Published : 03 Jul 2022 01:37 IST

ఊసేలేని ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశాలు

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, సదాశివపేట, నారాయణఖేడ్‌, జోగిపేట టౌన్‌, జహీరాబాద్‌ అర్బన్‌

జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో రోగులు

వానాకాలం ప్రారంభంలో వివిధ రకాల వ్యాధులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తాయి. చలి, జ్వరం, దగ్గు, డెంగీ, టైపాయిడ్‌ వంటి వాటితో ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీస్తుంటారు. అయితే అక్కడ కనీస సౌకర్యాలు లేక అవస్థలు తప్పడంలేదు. సమస్యలను పరిష్కరించేందుకు మూడు నెలలకోసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నా, ఏళ్లు గడుస్తున్నా అటువైపు దృష్టి సారించడంలేదు. జహీరాబాద్‌లో మాత్రమే ఇటీవల నిర్వహించారు. మిగతా ప్రాంతాల్లో ఎక్కడా జరగక పోవడం వల్ల వైద్య పరికరాలు మరమ్మతుకు నోచుకోవడం లేదు. ఆవరణలో పరిశుభ్రత పాటించడం లేదు. జిల్లాలో వైద్యా విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలపై కథనం.

జిల్లాలో పటాన్‌చెరు, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, సదాశివపేట ఆసుపత్రులు వైద్యవిధాన పరిషత్‌ పరిధిలో కొనసాగుతున్నాయి. సంగారెడ్డి దవాఖానా ఇటీవలే వైద్య కళాశాల పరిధిలోకి వెళ్లింది. అయినా ప్రజలకు వివిధ సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక్కడ మూడేళ్ల నుంచి సమావేశాల ఊసేలేదు. వీటిని మూడు నెలలకోసారి చేపట్టాల్సి ఉన్నా, ఎవరూ పట్టించుకోవడంలేదు. సమాశంలో జడ్పీ అధ్యక్షురాలు, కలెక్టర్‌, ఎమ్మెల్యే, పురపాలక శాఖ అధ్యక్షురాలు పాల్గొనాల్సి ఉంటుంది.

పూర్తికాని పనులు

ఖేడ్‌ ప్రాంతీయ ఆసుపత్రికి నిత్యం 350 మంది వరకు ఔట్‌పేషెంట్లు వస్తుంటారు. 60 మంది వరకు ఇన్‌పేషెంట్లు వస్తారు. పర్యవేక్షణ లేకపోవడం వల్ల సమస్యలను పట్టించుకునే వారు కరవయ్యారు. పూర్తి స్థాయిలో భవనం లేక  రోగులు అవస్థలు పడాల్సి వస్తోంది. ఎనిమిదేళ్ల కిందట రూ.6 కోట్లతో నూతన భవనాలను నిర్మించి 30 పడకల నుంచి 100 పడకలకు విస్తరించి, వైద్యులు, సిబ్బందిని నియమించారు. అవసరమైన వివిధ పరికరాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి అనుబంధంగా 2015లో మాతా,శిశు సంరక్షణ కేంద్రానికి రూ.12.20 కోట్లతో పనులు చేపట్టారు ఇప్పటికీ  పూర్తికాలేదు. పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. రెండేళ్లుగా సమావేశాలు నిర్వహించలేదు.

ఖేడ్‌లో నిర్మాణంలో మాతా, శిశు సంరక్షణ కేంద్ర భవనం

ఆవరణ బురదమయం

జోగిపేటలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది లేరు. దీనికి తోడు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు. వర్షం కురిస్తేచాలు ఆసుపత్రి ఆవరణం బురదమయంగా మారుతోంది. ఆసుపత్రిలో కాపలా దారులున్నా దొంగతనాలను జరుగుతున్నాయి. ఇటీవలే క్వింటాళ్లన్నర బియ్యం దొంగతనం జరిగింది. అంతకుముందు విద్యుత్తు పరికరాలు అపహరించారు. వార్డుల్లో మురుగు సక్రమంగా వెళ్లడంలేదు. చాలా గదులు, వరండాల్లో ఫ్యాన్లు తిరగడంలేదు, ట్యూబ్ల్‌ైట్లు వెలగడంలేదు. ఈ విషయమై సూపరింటెండెంట్‌ రమేష్‌ను వివరణ కోరగా సమస్యలున్న విషయం వాస్తవమే. ఇటీవలే ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ దృష్టికి తీసుకెళ్లాం.

జహీరాబాద్‌లో పనిచేయని జనరేటర్‌

పనిచేయని ఎక్స్‌రే యంత్రం

సదాశివపేటలో 50పడకల స్థాయి పెంచిన సమస్యలు తీరడం లేదు. ఇక్కడికి నిత్యం బయటి రోగులు 200 మంది వరకు వస్తుంటారు. లోపలి రోగులు మాత్రం ఎవరూ ఉండటం లేదు. సరైన సేవలు అందకపోవడం వల్ల జిల్లా కేంద్ర ఆసుపత్రికి, ప్రైవేట్‌కు వెళుతున్నారు. మూడేళ్లకు పైగా సమావేశాలు నిర్వహించడం లేదు. ఎక్స్‌రే యంత్రం మూలకు చేరి నెలలు గడుస్తోంది. మంచినీటి సౌకర్యం లేదు. వైద్యులు సమయపాలన పాటించడం లేదు.

కార్యరూపం దాల్చని అంశాలు

జహీరాబాద్‌ ఆసుపత్రిలో 50 పడకల మాతాశిశు ఆసుపత్రి, రక్తనిధి కేంద్రం ఏర్పాటుకు మోక్షం దక్కలేదు. ఇక్కడ జనరేటర్‌ మొరాయింపుతో వైద్యసేవల్లో ఇబ్బందులు తప్పడంలేదు. వంద పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిలో వైద్య సేవల్లో వైద్యులు, సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పారదర్శకంగా సేవలు అందించేందుకు ప్రతి మూడు నెలలకు ఛైర్మన్‌ హోదాలో ఎమ్మెల్యే మాణిక్‌రావు అధ్యక్షతన సమావేశాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. అయితే చర్చించిన అంశాలు కార్యరూపం దాల్చడంలేదనే చెప్పాలి. జనరేటర్‌ మరమ్మతుకు రూ.5 లక్షలు కావాలని ఆరోగ్య శాఖ కమిషనర్‌కు ప్రతిపాదన పంపామని ఆసుపత్రి పర్యవేక్షకులు డా.శేషురావు తెలిపారు.


సమస్యలను అధిగమిస్తాం

- సంగారెడ్డి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సేవల సమన్వయకర్త

జిల్లాలో ప్రధాన ఆసుపత్రులల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఆసుపత్రుల అభివృద్ధి సలహా కమిటీ సమావేశాలు మూడు నెలలకోసారి జరిగేలా చూస్తాం. ఇప్పటికే జహీరాబాద్‌లో చేపట్టాం. మిగిలిన చోట్ల కూడా చేయించేలా చూస్తాం. వైద్యులు, మందుల కొరతలేదు. సమయ పాలన పాటించేలా చర్యలు తీసుకుంటాం. సంగారెడ్డిలో వైద్యా కళాశాల, వైద్యా విధాన పరిషత్‌ వైద్యుల మధ్య సమన్వయంతో పని చేయించేలా కృషి చేస్తాం. త్వరలో ఆసుపత్రుల పర్యవేక్షకులతో సమావేశం నిర్వహిస్తాం.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు