logo

ఠాణాలో పెట్రోల్‌తో ఆత్మహత్యాయత్నం!

సోదరుల మధ్య ఉన్న భూమి, ఇతర గొడవల్లో ఎస్‌ఐ జోక్యం చేసుకొని వేధిస్తున్నాడంటూ మెదక్‌ జిల్లా శివ్వంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఆత్మహత్యకు యత్నించిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్‌ఐ తెలిపిన వివరాలు.. శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి

Published : 05 Jul 2022 01:48 IST

శివ్వంపేట, న్యూస్‌టుడే: సోదరుల మధ్య ఉన్న భూమి, ఇతర గొడవల్లో ఎస్‌ఐ జోక్యం చేసుకొని వేధిస్తున్నాడంటూ మెదక్‌ జిల్లా శివ్వంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఆత్మహత్యకు యత్నించిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్‌ఐ తెలిపిన వివరాలు.. శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన బుర్ర మహేశ్‌గౌడ్‌, ఆంజనేయులుగౌడ్‌ల మధ్య పలు విషయాల్లో గొడవలు జరుగుతున్నాయి. మహేశ్‌గౌడ్‌ కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న పొలంలోని బోరు స్టార్టర్‌, పైపులను నాలుగు రోజుల కిందట ఆంజనేయులు గౌడ్‌ ధ్వంసం చేశాడు. మరో రోజు మహేశ్‌ చరవాణిని లాక్కొని దుర్భాషలాడాడు. ఈ మేరకు మహేశ్‌.. సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఆంజనేయులు సైతం మహేశ్‌.. నన్ను ఇష్టానుసారంగా కొడుతున్నాడని ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదవగా విచారిస్తున్నారు. వారిద్దరూ సోమవారం ఠాణాకు రాగా ఎస్‌ఐ రవికాంత్‌రావు మాట్లాడారు. ఈ క్రమంలో ఆంజనేయులు.. తన అన్నకే వత్తాసు పలుకుతున్నావని ఎస్‌ఐపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు రామాయంపేటకు చెందిన సంతోష్‌ కామారెడ్డిలో పోలీసులు, ప్రజాప్రతినిధులు కారణంగా చూపుతూ రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తనతో తెచ్చుకున్న పెట్రోల్‌ను శరీరంపై పోసుకోవడానికి యత్నించగా.. ఎస్‌ఐ అడ్డుకున్నారు. వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఆంజనేయులుగౌడ్‌పై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు. దీనిపై ఆంజనేయులు మాట్లాడుతూ.. తనపై అనవసరంగా ఎస్‌ఐ చేయిచేసుకోవడంతోనే పెట్రోల్‌తో తాను, భార్య, అమ్మతో కలిసి ఆత్మహత్యకు యత్నించామని వాపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని