logo
Updated : 05 Jul 2022 06:26 IST

క్రీడా భవితకు చక్కటి వేదిక

చేగుంట క్రీడా పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

న్యూస్‌టుడే, చేగుంట

లాంగ్‌జంప్‌ చేస్తున్న విద్యార్థిని

క్రీడల్లో ఉత్తమంగా రాణించాలంటే శిక్షణ ఎంతో అవసరం. ఇటు వైపు అడుగేసే విద్యార్థినులకు చేగుంటలోని క్రీడా పాఠశాల చక్కటి వేదికనే చెప్పాలి. ఓ వైపు చదువు, మరోవైపు ఆటలు నేర్పిస్తూ వారి భవితకు మార్గం వేస్తోంది. గిరిజనులను ఈ దిశగా నడిపించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఇక్కడ గిరిజన క్రీడా పాఠశాలను ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో ఇదొక్కటే క్రీడా పాఠశాల కావడం గమనార్హం. ఇందులో ప్రవేశానికి ప్రస్తుతం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి విశేషాలు, వసతుల తీరుపై కథనం.

బాల్‌త్రో సాధన చేస్తూ..

రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్ల కిందట చేగుంటకు గిరిజన బాలికల గురుకులాన్ని మంజూరు చేసింది. ఆ విద్యాసంవత్సరం ఐదో తరగతిని ప్రారంభించగా.. ఏటా అప్‌గ్రేడ్‌ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం జూనియర్‌ కళాశాల స్థాయికి చేరింది. మూడేళ్ల కిందట ఈ గురుకులంలోనే క్రీడా పాఠశాలను ఏర్పాటుచేశారు. వివిధ క్రీడాంశాల్లో తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు వసతులు కల్పించారు. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాలవాసులే కాకుండా నిజామాబాద్‌, కామారెడ్డి, ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, ములుగు తదితర జిల్లాలకు చెందిన గిరిజన బాలికలు ఇందులో చేరేందుకు ముందుకొస్తున్నారు.

శిక్షణ ఇస్తున్న క్రీడాంశాలు..

ప్రస్తుతం చేగుంట క్రీడా పాఠశాలలో అథ్లెటిక్స్‌, జిమ్నాస్టిక్స్‌, రగ్బీ, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, ఫెన్సింగ్‌, వాలీబాల్‌, ఖోఖో తదితర ఆటలకు అవకాశం కల్పించింది. అన్ని రకాల క్రీడలకు ఇందులో శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం అథ్లెటిక్స్‌, జిమ్నాస్టిక్స్‌కు శిక్షకులను నియమించారు. ఇతర క్రీడాంశాలకు సైతం శిక్షకులు త్వరలోనే నియమించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.  మరో నలుగురు శిక్షకులు వస్తే ఇందులో ఉన్న విద్యార్థులను అన్ని విధాలుగా తీర్చిదిద్దవచ్చు. క్రీడా పాఠశాలలో చదువుతున్న చాలా మంది విద్యార్థులు పలు క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటూ బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధిస్తున్నారు. గురుకులం ఆవరణలో క్రీడా మైదానం కూడా సిద్ధం చేస్తున్నారు. రానున్న రోజుల్లో అథ్లెటిక్స్‌ కొరకు సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో విద్యార్థినుల కోసం వ్యాయామశాల కూడా ఉంది. అలాగే పక్కా భవనం, వసతిగృహం కూడా ఉండటంతో చాలా మంది ఇందులో ప్రవేశాలకు యత్నిస్తున్నారు.

40 సీట్లు..

ఐదో తరగతిలో మొత్తం 40 సీట్లు ఉంటాయి. ఇందులో ప్రవేశానికి వందలాది దరఖాస్తు చేస్తుంటారు. ఈ పాఠశాలలో ప్రతి ఏటా పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఇంటర్‌లోనూ ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. ఓ వైపు ఆటలు, మరోవైపు చదువుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది 700 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఏటూరునాగారంలోని గిరిజన బాలుర క్రీడా పాఠశాల ప్రవేశాలకు కూడా చేగుంటలోనే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts