logo
Published : 05 Jul 2022 01:48 IST

రెండు పడకల ఇళ్లు!

పూర్తయినా కేటాయించని వైనం

లబ్ధిదారుల్లో నిరాశ

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, రాయికోడ్‌

కంది మండలం కాశీపూర్‌లో పూర్తయిన..

పేదలకు సొంతింటి కల నెరవేర్చాలన్న సంకల్పంతో సర్కారు రెండుపడకల గదుల ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు.  అయితే కొన్ని ప్రాంతాల్లో పూర్తవ్వగా.. మరి కొన్నిచోట్ల రూపుదాల్చినా లబ్ధిదారులకు కేటాయించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అప్పగిస్తామని ప్రకటిస్తున్నా మళ్లీ వెనుకంజ వేశారు. ఇలా ఏళ్ల నుంచి కట్టినవి ఇవ్వరూ.. పనులు పూర్తి చేయరు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడమేనని సమాచారం. పూర్తయిన ఇళ్లనుంచి విద్యుత్తు తీగలు, కిటీకిలు, తలపులు, తదితర సామగ్రి అపహరణకు గురవుతున్నాయి. మరోవైపు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటే ప్రయోజనముంటుంది.

సంగారెడ్డి జిల్లాలో పట్టణం, గ్రామీణంలో కలిపి 5,505 ఇళ్ల నిర్మాణాలకు స్థలం గుర్తించారు. వాటిని పూర్తి చేసేందుకు రూ.323 కోట్లు అవసరమని ప్రతిపాదించగా, రూ.200 కోట్లు విడుదల చేయడంతో టెండర్లు పూర్తి చేశారు. 5,137 ఇళ్ల పనులు ప్రారంభించగా, ఇప్పటి వరకు 2,355 మాత్రమే పూర్తయ్యాయి. వీటికి రూ.197.64 కోట్లు ఖర్చు చేశామని  అధికారులు వెల్లడించారు. వీటిని లబ్ధిదారులకు అప్పగించాల్సి ఉన్నా, గుర్తింపు, విచారణపేరుతో రెండేళ్ల పాటుగా తాత్సారం సాగుతోంది. మిగిలినవి ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు ఇంకా రూ.123 కోట్లు విడుదల చేస్తే పూర్తికానున్నాయి.


రాయికోడ్‌ మండలం చిమ్నాపూర్‌ శివారులో..

తప్పని ఎదురు చూపులు

జిల్లాలో పూర్తయిన ఇళ్లకు 21,431 మంది అర్జీలు సమర్పించారని రెవెన్యూ అధికారులు తెలిపారు. వీరిని లాటరీ ఎంపిక చేయనున్నారు. అధికారులు విచారించి అర్హుల పేర్లను తహసీల్దార్‌ కార్యాలయాల బోర్డులపై ప్రదర్శించారు. ఈ ప్రక్రియ పూర్తి దశకు వచ్చినట్లే వచ్చి మళ్లీ వాయిదా పడటంతో లబ్ధిదారులు నిరాశకు గురవుతున్నారు.

రెండేళ్లుగా తాత్సారం

సంగారెడ్డి మండలం ఫసల్‌వాది శివారులో పట్టణ వాసులకు, ఫసల్‌వాది, కుల్పగూర్‌ గ్రామాలకు చెందిన వారికి ఇళ్లను ఇవ్వాలని జిల్లా యంత్రాంగం భావించింది. 2015-16లో 329 ఫసల్‌వాదిలో నిర్మించారు. ఇందులో సంగారెడ్డి పట్టణ వాసులకు 265, ఫసల్‌వాది, కుల్పగూర్‌కు 64 ఇళ్లు కేటాయించారు. మూడేళ్ల క్రితం ఇళ్లు పూర్తయినా, లబ్ధిదారుల ఎంపికలో రెండేళ్ల్లు తాత్సారం సాగుతోంది.

కొలిక్కి రాని ప్రక్రియ

ఖేడ్‌ పురపాలికకు సంబంధించి మండలంలోని జూకల్‌ శివారులో నిర్మిస్తున్నారు. ఆరేళ్లుగా విడతల వారీగా 944 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 300 పూర్తయి రెండేళ్లు కావస్తోంది. ఆయా ఇళ్లకు ఏడాదికిందటే 2011 దరఖాస్తులు వచ్చాయి. విచారణ జరిపి అందులో 711 మందిని అర్హులుగా గుర్తించినా, ప్రక్రియ ఇప్పటికీ కొలిక్కిరాలేదు.

అర్జీలు సమర్పించినా

* జహీరాబాద్‌ శివారు రహమత్‌నగర్‌ ప్రాంతంలో 1012 ఇళ్లు పట్టణ వాసులకు మంజూరయ్యాయి. వాటిలో 312 రెండేళ్ల క్రితమే పూర్తి చేశారు. గతేడాది కిందటి నుంచి 8,243 మంది అర్జీలు సమర్పించారు.

* సదాశిపేట పట్టణంలో 100 ఇళ్లు పట్టణ శివారులోని సిద్దాపూర్‌ కాలనీలో రెండేళ్ల క్రితమే పూర్తయ్యాయి. 3,900 మంది అర్జీలు సమర్పించారు. ఇంకా అర్హులను గుర్తించలేదు.

విద్యుత్‌ తీగల అపహరణ

సంగారెడ్డి మండలం ఫసల్‌వాదిలో పూర్తయిన ఇళ్లలోని విద్యుత్‌ తీగలు, స్వీచ్‌ బోర్డులు, తదితర సామగ్రి గుర్తు తెలియని వ్యక్తులు తస్కరించారు. గత ఏడాది దసరా, ఉగాది పండగకు లబ్ధిదారులకు ఇస్తామని అధికారులు ప్రకటించడంతో వాటిని మళ్లీ బిగించారు. వీటిని కూడా ఎత్తుకెళ్లారు. మొత్తం రూ.10 లక్షల విలువైన సామగ్రి అపహరణకు గురైంది. ఈ సంఘలనపై గ్రామీణ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇలా కంది మండలం కాశీపూర్‌, కొండాపూర్‌ మండలం అలియాబాద్‌, సదాశివపేట పట్టణ శివారులోని సిద్ధాపూర్‌లోనూ సామగ్రి చోరీకి గురైంది

నత్తనడకన పనులు

రాయికోడ్‌ మండలం చిమ్నాపూర్‌ శివారులో మూడేళ్ల నుంచి పిల్లర్ల స్థాయిలోనే ఉన్నాయి. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో స్లాబ్‌ పనులు పూర్తి చేశారు. కంది మండలం ఆరుట్ల, చెర్యాల్‌లో స్లాబ్‌ వరకు పూర్తయ్యాయి. ప్రస్తుతం గత రెండేళ్ల నుంచి పనులు నిలిచాయి. ఇలాంటి పరిస్థితి జిల్లాలోని అన్ని మండలాల్లో నెలకొంది.


ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం

-  ప్రసాద్‌, నోడల్‌ అధికారి, సంగారెడ్డి

ఇళ్ల నిర్మాణాల పనులకు నిధులు లేవు. ప్రభుత్వానికి నివేదిక పంపాం. వచ్చిన తర్వాత గుత్తేదారులకు బిల్లులు చెల్లింపులు చేస్తాం. ఇళ్లు పూర్తయిన వాటి విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటాం. కట్టిన ఇళ్లలో సామగ్రి చోరీకి గురికాకుండా గుత్తేదారులే జాగ్రత్తలు తీసుకోవాలి. పర్యవేక్షణ చూసుకోవాల్సిందే.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts