logo

‘ఆపరేషన్‌ ముస్కాన్‌’తో స్వేచ్ఛ!

బాలల మోముల్లో చిరునవ్వులు చిందించడమే లక్ష్యంగా ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో బందీగా మారుతున్న బాల్యాన్ని.. వెట్టి నుంచి విముక్తి కల్పిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణం వైపు నడిపించేందుకు

Updated : 05 Jul 2022 10:06 IST

న్యూస్‌టుడే, సిద్దిపేట

బైక్‌ సర్వీసింగ్‌ సెంటర్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న బృందం

బాలల మోముల్లో చిరునవ్వులు చిందించడమే లక్ష్యంగా ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో బందీగా మారుతున్న బాల్యాన్ని.. వెట్టి నుంచి విముక్తి కల్పిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణం వైపు నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా ఏటా ఆపరేషన్‌ స్మైల్‌, ముస్కాన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. జులై నెలలో నిర్వహించే ఆపరేషన్‌ ముస్కాన్‌ ఇటీవల జిల్లాలో ఆరంభమైంది. రెండేళ్లుగా కరోనాతో నామమాత్రం కొనసాగిన ముస్కాన్‌ను ఈసారి పకడ్బందీగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం దృష్టి సారించింది. గడిచిన ఐదేళ్లలో మొత్తం 207 మందికి విముక్తి కల్పించారు. అందులో 192 మంది బాలురు, 15 మంది బాలికలు ఉండటం గమనార్హం.

ప్రత్యేక బృందాలతో..

ప్రధానంగా బాల కార్మికులకు విముక్తి కల్పించడం సహా తప్పిపోయిన చిన్నారుల ఆచూకీని కొనుగొనేందుకు ప్రతి సంవత్సరం ఆపరేషన్‌ ముస్కాన్‌ నిర్వహిస్తున్నారు. ముస్కాన్‌-8.. ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌ డివిజన్ల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, కార్మిక, విద్యా శాఖ, చైల్డ్‌ లైన్‌.. సంయుక్తంగా డివిజన్‌ను ఒక బృందాన్ని కేటాయించారు. తనిఖీలు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రధానంగా పరిశ్రమలు, ఇటుక బట్టీలు, దుకాణాలు, హోటళ్లపై దృష్టి సారించనున్నారు. 18 ఏళ్లలోపు బాలలను పనుల్లోకి తీసుకోవద్దు. ఒకవేళ బాల కార్మికులను గుర్తిస్తే అతన్ని సంరక్షించి బాలల సంక్షేమ సమితి ఎదుట అధికారులు హాజరుపర్చుతారు. ఇతర రాష్ట్రాల బాలబాలికలయితే సంరక్షణ కేంద్రాలకు తరలిస్తారు. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ చేసి అప్పగిస్తారు. యజమానిపై కార్మిక చట్టాలను ప్రయోగిస్తారు.

‘దర్పణ్‌’..

సిద్దిపేట బాల సదనం (ప్రభుత్వం), బెజ్జంకి, కొండపాక, గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌లో స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఆయా చోట్ల 6 నుంచి 18 ఏళ్లలోపు వయసున్న వారు 100 మంది ఆశ్రయం పొందుతున్నారు. అందులో అనాథలు సహా కుటుంబ సభ్యుల సంరక్షణ కోల్పోయిన వారు ఉన్నారు. తప్పిపోయిన చిన్నారుల జాడను కనుగొనడంలో భాగంగా కేంద్రాలను సందర్శించే అధికారులు ‘దర్పణ్‌’ యాప్‌ ద్వారా గుర్తించే ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ యాప్‌లో అప్పటికే అదృశ్యమైన చిన్నారుల వివరాలు నమోదై ఉంటాయి. సాంకేతికత ఆధారంగా గుర్తించనున్నారు. ఒకవేళ తప్పిపోయిన చిన్నారులు స్థానిక కేంద్రాల్లో ఉంటే సంబంధిత వివరాలు యాప్‌లో నమోదు చేయనున్నారు.

బాల్య వివాహాలకు అడ్డుకట్ట..

బిక్షాటన చేసే చిన్నారులను సంరక్షిస్తారు. నేరుగా బాలలు లేదా చిన్నారులతో కలిసి బిక్షాటన చేసే వారిని గుర్తించి విచారించనున్నారు. అందులో ఎవరి వద్దనైనా.. బాలలు ఉంటే వ్యక్తులను వాకబు చేయనున్నారు. బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయనున్నారు. వీధి బాలలు, బడి ఈడు పిల్లలను గుర్తించి.. అనుగుణంగా బడుల్లో చేర్పించనున్నారు. ఎక్కువ శాతం వలస కార్మికులు వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, పలు రంగాల్లో ఉపాధి కోసం జిల్లాకు వస్తున్నారు. ఒడిశా, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వందల సంఖ్యలో తరలివస్తున్నారు. కొందరు కుటుంబ సభ్యులతో సహా వచ్చి పనుల్లో పాలుపంచుకున్నారు. ఇటుక బట్టీలు, ఇతర చోట్ల ఎక్కువ శాతం బాలలు పనుల్లో కనిపిస్తున్నారు. తనిఖీలు ముగిశాక మళ్లీ తిరిగి పనుల్లోకి వస్తున్నారు. ఒక నెలతోనే తనిఖీలు సరిపెట్టుకోకుండా నిరంతర ప్రక్రియగా చేపడతారు. తద్వారా ప్రభుత్వ లక్ష్యం చేరుకోవచ్చు.


పనుల్లో పెట్టుకుంటే చర్యలు

- మహేందర్‌, అదనపు డీసీపీ, ముస్కాన్‌ నోడల్‌ అధికారి

వివిధ విభాగాల్లో కలిపి 100 మంది అధికార యంత్రాంగం ముస్కాన్‌ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. హోటళ్లు, ఇటుక బట్టీలు, ఇతర ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించాం. బాల కార్మికులు లేదా ఇతర విభాగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటే డయల్‌ - 100 లేదా 1098, పోలీసు కమిషనరేట్‌ వాట్సాప్‌ నం. 79011 00100 సంప్రదించవచ్చు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయి. బాలలను పనుల్లో పెట్టుకున్నా, హింసకు గురిచేసినా చర్యలు తప్పవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని