logo
Published : 05 Jul 2022 01:48 IST

‘పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే చర్యలు’

ప్రజావాణిలో 45 అర్జీల స్వీకరణ

వినతులు ఇచ్చేందుకు బారులు తీరిన అర్జీదారులు

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: ప్రజావాణిలో వచ్చే అర్జీలను క్షణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కారం అయ్యేలా చూడాలని జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ అన్నారు. పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. భూసంబంధిత, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 45 అర్జీలు, వినతులు వచ్చాయి. అదనపు పాలనాధికారి (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో చెన్నయ్య, ఏవో అబ్దుల్‌ రెహ్మాన్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

* అకారణంగా తనను వేధిస్తున్న ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఓ విద్యార్థిని కలెక్టర్‌కు మొరపెట్టుకుంది. హుస్నాబాద్‌ ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదవుతున్న విద్యార్థిని హరిణి తనపై ప్రిన్సిపల్‌ శ్రీదేవి అభాండాలు మోపుతోందని తల్లిదండ్రులతో  కలసి వినతిపత్రం సమర్పించింది. తగిన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా విద్యాధికారి రవికాంత్‌రావును కలెక్టర్‌ ఆదేశించారు.

* బెస్ట్‌ అవైలబుల్‌ పథకం కింద ప్రైవేటు పాఠశాలలకు ఎంపికైన విద్యార్థులను వివిధ రుసుములు చెల్లించాలంటూ నిర్వాహకులు డిమాండ్‌ చేస్తున్నారని తల్లిదండ్రులు వాపోయారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ సిద్దిపేటలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పలువురు విద్యార్థులు బెస్ట్‌ అవైలబుల్‌ పథకం ద్వారా ఇటీవల చేరారన్నారు. ఉచితంగా విద్య అందించాల్సి ఉండగా ప్రవేశ రుసుము, ఏకరూప దుస్తులు, పుస్తకాల పేరిట సొమ్ము చెల్లించాలంటున్నారని ఫిర్యాదు చేశారు.

* కూతురు ప్రిన్సికి జనన ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలంటూ సిద్దిపేటకు చెందిన సంజన వినతిపత్రం సమర్పించారు. తమ స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా అని, మూడేళ్లుగా సిద్దిపేటలో నివాసం ఉంటున్నట్లు.. కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్చామని తెలిపారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts