logo

నూతన మార్గదర్శకం.. పక్కాగా మధ్యాహ్న భోజనం..

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. తాజాగా పలు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఇప్పటికే విటమిన్లు (పోషకాలు) కలిపిన బియ్యాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు వారంలో మూడు రోజులు గుడ్డు

Published : 06 Aug 2022 01:01 IST

న్యూస్‌టుడే, మెదక్‌

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. తాజాగా పలు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఇప్పటికే విటమిన్లు (పోషకాలు) కలిపిన బియ్యాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు వారంలో మూడు రోజులు గుడ్డు ఇచ్చేందుకు ధర రూ.5కు పెంచారు. అయినా నాణ్యమైన భోజనం అందించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇటీవల పలు చోట్ల మధ్యాహ్న భోజనం తిని పిల్లలకు అస్వస్థతకు గురవడంతో నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఒప్పంద పత్రం..

పిల్లలకు పోషకాహారం అందించాలన్న సంకల్పంతో మధ్యాహ్న భోజన పథకాన్ని పక్కాగా కొనసాగించేలా ప్రభుత్వం పలు సూచనలు చేస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. పరిశుభ్రమైన వాతావరణంలో అమలు చేయాలని, రోజువారీ మెనూ వివరాలను గోడలపై రాయించాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చింది. నాణ్యత పాటిస్తు వారంలో మూడు సార్లు ఉడికించిన కోడిగుడ్డును విధిగా అందించాలని సూచించింది. ఇందుకు వంట ఏజెన్సీల నుంచి రాతపూర్వకంగా ఒప్పంద పత్రం తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. భోజనాన్ని ముందుగా ప్రధానోపాధ్యాయుడు లేదంటే ఉపాధ్యాయుడు రుచి చూసిన తర్వాతే పిల్లలకు వడ్డించాలని ఆదేశించింది.

యాప్‌లో వివరాలు నమోదు..

పథకంలో సాంకేతికతను వినియోగించనున్నారు. ఇందుకు ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు మిడ్‌ డే మీల్స్‌ (ఎండీఎం) యాప్‌ను చరవాణిలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పాఠశాల పేరు నమోదు చేయాలి. నిత్యం ఉదయం 11.59 గంటల కంటే ముందే ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ విభాగాల వారీగా విద్యార్థుల వివరాలు సేకరించాలి. మధ్యాహ్నం 12 గంటల్లోపు వాటిని అప్‌లోడ్‌ చేయాలి. సాంకేతిక కారణాల వల్ల ఏ రోజైనా నమోదు చేయకుంటే ఎంఈవోకు సమాచారం ఇవ్వాలి. ఇందులో నమోదు ఆధారంగానే విద్యాశాఖ బిల్లులు చెల్లిస్తుంది.

నిర్వాహకులకు ఊరట

అప్పులు తెచ్చి పిల్లలకు వండి పెడుతున్న వంట కార్మికుల కష్టాలకు తెరపడనుంది. ఈ పథకంలో బిల్లులు సరిగా రాక నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇకపై సకాలంలో గౌరవ వేతనాలు, వంట ఖర్చులు అందనున్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచే సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ అకౌంట్‌ విధానం ద్వారా నేరుగా ఏజెన్సీల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు. ఇప్పటికే నిర్వాహకుల ఖాతాల వివరాలు సేకరించారు. నిధుల విడుదల ఎవరి వద్ద పెండింగ్‌లో ఉందనే విషయాన్ని పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా తెలుసుకోవచ్చు.

నిబంధనలు ఇలా..

* ప్రతి పాఠశాలలో విద్యార్థులతో మధ్యాహ్న భోజన కమిటీ ఏర్పాటు.

* వంట ఏజెన్సీకి బియ్యంతో పాటు ఇతర సరకులు కమిటీ సమక్షంలో తూకం వేసి వివరాలు నమోదు చేయాలి.

* అధికారుల తనిఖీల్లో రిజిస్టర్‌ వివరాలు, పాఠశాలల్లో నిల్వల్లో తేడాలుంటే ప్రధానోపాధ్యాయుడిదే బాధ్యత.

* ఆహారాన్ని వేడిగా వడ్డించడంతో పాటు శుద్ధి జలాన్ని సరఫరా చేయాలి.

* ప్రత్యేక భోజనశాల ఏర్పాటు.

* చేతులు కడుక్కునేందుకు సబ్బులు అందుబాటులో ఉంచాలి.

* వంటల్లో నాణ్యత పాటించేలా ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించాలి.

* పాఠశాలల్లో కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేసి కూరగాయలు పెంచాలి.


పక్కాగా అమలయ్యేలా.. రమేశ్‌కుమార్‌, డీఈవో

పథకం పక్కా అమలుకు జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా పాటించాలి. యాప్‌లో ప్రతి రోజు వివరాలు నమోదు చేయాలి. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో దీనిని పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని