logo
Published : 06 Aug 2022 01:01 IST

దారి మళ్లిస్తారు.. కనుమరుగు చేస్తారు!

ప్రవాహానికి అడ్డంకులు సృష్టించేలా పనులు

నామమాత్ర చర్యలకే అధికారులు పరిమితం

- ఈనాడు, సంగారెడ్డి

జిల్లాలో కొన్ని చోట్ల స్థిరాస్తి వ్యాపారులు వాగులు, వంకలనూ వదలడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లిస్తున్నారు. ప్రవాహానికి ఆటంకం కలిగేలా పనులు చేస్తున్నారు. ఇలాంటి వారిమీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు. దీంతో భారీగా వర్షాలు కురిసినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. జహీరాబాద్‌ మండలంలోని హుగ్గెళ్లి, మునిపల్లి మండలంలోని బుధేరా శివారులోని ఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.


అరకిలోమీటరు పొడవునా.. పైపులతో మూసివేత

హుష్కి వాగు కుంచించుకుపోయేలా వేసిన పైపులు

జహీరాబాద్‌ మండలంలోని హుగ్గెళ్లిలో హుష్కి వాగు ఉంది. గ్రామం సమీపం నుంచే ఇది ప్రవహిస్తుంది. అలా వెళ్లిన వరద నీరు వాగు ద్వారా చివరకు నారింజలో కలుస్తుంది. దాదాపు 30 అడుగుల వెడల్పు ఉంటుంది. దీనిని కుంచించుకుపోయేలా చేశారు. అరకిలోమీటరు పొడవునా పైపులతో మూసేశారు. వరదలు వస్తే ప్రవాహం సాఫీగా సాగే పరిస్థితులు లేవు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ పనులు చేస్తున్నారు. స్థానిక యువకుడు, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సురేష్‌ అప్పటి నుంచి రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదులు అందిస్తూనే ఉన్నారు. ప్రజావాణికీ పలుమార్లు వచ్చి వినతులు అందించారు. ఇదే విషయమై స్థానిక తహసీల్దారు నాగేశ్వరరావును వివరణ కోరగా... ఒక్కొక్కటిగా పైపులు తొలగిస్తున్నారన్నారు. పూర్తిస్థాయిలో తీయకపోతే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు. దీంతో ప్రస్తుతం పైపులన్నీ తొలగించారని ఆయన తెలిపారు. ఇలాంటి వారిమీద చర్యలకు ఉపక్రమించకుండా కేవలం హెచ్చరికలకే అధికారులు పరిమితమవుతున్నారు. పైపులను తొలగించడంతో పాటు ధ్వంసమైన కాలువను తిరిగి పునరుద్ధరించి, వరద నీరు సాఫీగా దిగువకు పోయేలా తగిన ఏర్పాట్లు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.


మంజీరాలోకి ప్రవాహం చేరకుండా..

బుధేరా శివారులో అసంపూర్తి కాలువ

మునిపల్లి మండలంలోని బుధేరా శివారులోని కాలువ ఇది. సహజసిద్ధంగా ఏర్పడింది కాదు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం నుంచి వానాకాలంలో వరద నీరు నేరుగా జాతీయ రహదారిని దాటుతూ మంజీరా నదిలో కలుస్తాయి. రెవెన్యూ రికార్డుల్లో ఈ కాలువ ఉన్నట్లు స్పష్టంగా ఉంది. అయినా కొన్నిరోజుల క్రితం ఈ కాలువ దారిని మార్చేశారు. గతంలో ప్రవాహం సాఫీగా సాగేలా ఉన్న మార్గాన్ని పూర్తిగా మట్టితో కప్పేశారు. ఒక పక్కనుంచి సగం వరకు కాలువ తీసి మధ్యలో ఆపేశారు. దీంతో వానలు కురిసినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నేరుగా మంజీరాలోకి ప్రవాహం చేరకుండా పొలాలు, ఇతరుల భూముల్లోకి మళ్లుతున్నాయి.

రెండు శాఖల మధ్య సమన్వయం లేక..

వాస్తవానికి ఇలాంటి విషయాల్లో రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలి. వారి మధ్య సమన్వయం కొరవడినట్లు ఈ రెండు ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాదికారులు ఇలాంటి అంశాలపై దృష్టి సారించాలి. ప్రవాహ దిశను మార్చేలా పనులు చేయాలంటే కచ్చితంగా నీటిపారుదల శాఖ నుంచి స్పష్టమైన అనుమతులుండాలి. ఇక్కడ అలాంటివేవీ లేకుండానే ఎవరికి నచ్చినట్లు వాళ్లు పనులు చేస్తూ కాలువలు, వాగులు కుంచించుకుపోయేందుకు కారణమవుతున్నారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts