logo

చిగురించిన ఆసరా ఆశలు!

ఎట్టకేలకు దరఖాస్తుదారుల ఆశలు నెరవేరబోతున్నాయి. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని 57 ఏళ్ల వయస్సు గల వారికి ఆసరా పింఛను అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడంపై వారికి ఊరట కలిగినట్లయింది.

Published : 10 Aug 2022 01:46 IST

న్యూస్‌టుడే, మెదక్‌


మెదక్‌ ప్రాంతీయ ఆసుపత్రి డయాలసిస్‌ వార్డులో రోగులు

ఎట్టకేలకు దరఖాస్తుదారుల ఆశలు నెరవేరబోతున్నాయి. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని 57 ఏళ్ల వయస్సు గల వారికి ఆసరా పింఛను అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడంపై వారికి ఊరట కలిగినట్లయింది. ఈ నేపథ్యంలో జిల్లాలో అధికారులు ఈనెల 15న పింఛను పంపిణీకి కసరత్తు చేస్తున్నారు. 65 ఏళ్లు దాటిన వారికి వృద్ధాప్య, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులకు ప్రతి నెలా పింఛను ఇస్తున్నారు. దివ్యాంగులకు రూ.3,016, మిగతా కేటగిరీల వారికి రూ.2,016 చొప్పున ఖాతాల్లో జమవుతోంది. జిల్లాలో ప్రస్తుతం 1,00,248 మందికి పింఛను ఇస్తున్నారు. ఇందుకుగాను ప్రతి నెలా రూ.21.05 కోట్లు వెచ్చిస్తున్నారు.

16 వేల మందికి పైగా అవకాశం...
ఆసరా పథకానికి అర్హత వయస్సు 65 నుంచి 57 ఏళ్లకు కుదిస్తున్నట్లు ముఖ్యమంత్రి 2019లో ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలో 57 ఏళ్లు, ఆపైబడి ఉన్న వారు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 16,858 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా పాపన్నపేట మండలంలో దరఖాస్తు చేసుకున్నారు. వారంతా చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు. పలుమార్లు మంత్రులు ప్రకటన చేయగా, 2022-23 రాష్ట్ర బడ్జెట్‌లో సైతం ప్రస్తావించారు. ఎట్టకేలకు ఇటీవల సీఎం చేసిన ప్రకటన వారికి కాస్త ఊరటనిచ్చింది. ఇదిలా ఉంటే వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులతో పాటు ఒంటరి మహిళల పింఛను కోసం 9,281 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి పింఛను మంజూరుపై స్పష్టత లేదు. మరోవైపు డయాలసిస్‌ రోగులకు పింఛను ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మెదక్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్‌ వార్డు ఉండగా.. ఇక్కడికి ప్రతి నెలా సుమారు 60 మంది రోగులు వస్తుంటారు. మిగతా ఇరవై మంది హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు వెళ్తున్నారు. వారికి నెలకు రూ.2,106 పింఛను అందనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పింఛన్ల మంజూరు ప్రక్రియ చేపడుతామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని