logo

వరండాలో వంట.. కళ్లకు మంట!

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు నిర్వాహకులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఒక వైపు వానలు, మరోవైపు వంట గదులులేక వరండాలే ఆధారమవుతున్నాయి. ఇక తరగతుల్లోకి పొగ వ్యాపించి పిల్లలు చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. కొన్నిచోట్ల గదులున్నా స్థలం సరిపోవటంలేదు.

Published : 10 Aug 2022 01:46 IST

పొగతో విద్యార్థుల...
ప్రత్యేక గదుల్లేక నిర్వాహకుల అవస్థలు
న్యూస్‌టుడే, చేగుంట


చేగుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో...

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు నిర్వాహకులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఒక వైపు వానలు, మరోవైపు వంట గదులులేక వరండాలే ఆధారమవుతున్నాయి. ఇక తరగతుల్లోకి పొగ వ్యాపించి పిల్లలు చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. కొన్నిచోట్ల గదులున్నా స్థలం సరిపోవటంలేదు. సర్కారు బడుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని పాఠశాలలకు మాత్రమే అక్షయపాత్రద్వారా  సరఫరా చేస్తుండగా, మిగతా ప్రాంతాల్లో ఆవరణలోనే వంట వండుతున్నారు. అయితే వీరికి సరైన సౌకర్యాలు లేక సతమతమవుతున్నారు. వర్షాకాలంలో వారి తిప్పలు చెప్పనలవి కాదు. వానలకు కర్రలు తడిసి విపరీతమైన పొగ వ్యాపిస్తోంది. దీనివల్ల నిర్వాహకులతో పాటు విద్యార్థులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కట్టెలు మండకపోవటంవల్ల వంటలు కూడా సరిగా ఉండటం లేదు. ముఖ్యంగా అన్నం ఉడకటంలేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.

జడ్పీ ఉన్నత పాఠశాలలకు కష్టం
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువ మంది చదువుకుంటున్నారు. వారికి వంట చేసేందుకు గది పెద్దగా ఉండాలి. అయితే ప్రభుత్వం గతంలో చిన్న గదులను నిర్మించింది. అందులో వంట చేయటం ఏమాత్రం కుదరటంలేదు. దీంతో చెట్ల కింద, వరండాలే దిక్కవుతున్నాయి. జిల్లాలో కొన్ని బడుల్లో మాత్రమే వంటగదులను వినియోగిస్తున్నారు. కనీసం వంటపాత్రలు, నిత్యావసర సరకులు కూడా నిల్వచేసుకోలేని పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో వంట గదులు శిథిలావస్థకు చేరాయి. వర్షం కురిస్తే ఉరుస్తున్నాయి.

జిల్లాలో పాఠశాలలు ఇలా
ప్రాథమిక: 624
ప్రాథమికోన్నత:128
జడ్పీ ఉన్నత: 148
ఆదర్శ పాఠశాలలు:7
మొత్తం విద్యార్థులు: 92,245

ఇదీ పరిస్థితి..
చేగుంట మండలం వడియారం, చేగుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో వంటగదులులేవు. వడియారం పాఠశాలలో ఒక పక్క తరగతులు, మరో వైపు మధ్యాహ్న భోజనం వంటలు చేస్తున్నారు. కట్టెలు తడిసిపోయి ఉండటంవల్ల పొగ ఎక్కువగా వస్తుంది. చేగుంటలో అసంపూర్తిగా ఉన్న తరగతి గదుల్లో వంట చేస్తున్నారు. ఇక్కడ వంట గది నిర్మాణం అసంపూర్తిగా ఉంది. నార్సింగిలో 500 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ వంట గది చిన్నగా ఉండటంవల్ల ఆరుబయట చేస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా చాలా పాఠశాలల్లో వంటగదుల కొరత తీవ్రంగా ఉంది. మక్కరాజుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో కూడా ఆరుబయటనే వంటలు చేస్తున్నారు. రామాయంపేట బాలికల పాఠశాలలో చిన్నరేకుల షెడ్డు వేశారు.చల్మెడ, నిజాంపేట జడ్పీ పాఠశాలల్లో ఆరుబయట వండుతున్నారు. వెల్దుర్తి మండలం బండపోసాన్‌పల్లి, మంగళపర్తి తదితర పాఠశాలల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. పాపన్నపేట జడ్పీ ఉన్నత పాఠశాల, పెద్ద, చిన్న హరిజనవాడ ప్రాథమిక పాఠశాల, తమ్మాయిపల్లి, కొంపల్లి, రాజ్యతండా, తుమ్ముతండా తదితర ప్రాథమిక పాఠశాలలో సైతం ఆరుబయటే  వండుతున్నారు. ఇలా ప్రతి మండలంలో ఉన్న జడ్పీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో నెలకొంది.

‘మన ఊరు..మన బడి’లో నిర్మిస్తాం : - రమేష్‌కుమార్‌, డీఈవో, మెదక్‌
‘మన ఊరు..మన బడి’ మొదటి విడతలో మంజూరైన పాఠశాలల్లో నిర్మాణం చేపట్టి పూర్తిచేస్తాం. రెండో విడతలో మంజూరయ్యాక మిగతా వాటిల్లో ఏర్పాటు చేస్తాం. ఉపాధి హామీ నిధులతో వంటగదులను నిర్మించుకునే అవకాశం ఉంది. సమస్య అధికంగా ఉన్న చోట ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని