logo

ముందు చూపు కొరవడి.. ముంపు ప్రాంతాల్లో నిర్మించి..

సంగారెడ్డి మండలం కొత్లాపూర్‌ పోచమ్మకుంట శిఖంలో వైకుంఠధామం నిర్మించారు. ఇందుకోసం రూ.12 లక్షలు వెచ్చించారు. ప్రస్తుతం కుంట పూర్తిగా నిండి, శ్మశానవాటికలోకి చేరింది. ఇక్కడ ఇప్పటి వరకు అంత్యక్రియలు నిర్వహించలేదు. స్నానపు గదులకు పలు చోట్ల పగుళ్లు రావడంతో సిమెంట్‌ పూశారు.

Published : 10 Aug 2022 01:46 IST

అస్తవ్యస్తంగా వైకుంఠధామాల నిర్మాణం

* సంగారెడ్డి మండలం కొత్లాపూర్‌ పోచమ్మకుంట శిఖంలో వైకుంఠధామం నిర్మించారు. ఇందుకోసం రూ.12 లక్షలు వెచ్చించారు. ప్రస్తుతం కుంట పూర్తిగా నిండి, శ్మశానవాటికలోకి చేరింది. ఇక్కడ ఇప్పటి వరకు అంత్యక్రియలు నిర్వహించలేదు. స్నానపు గదులకు పలు చోట్ల పగుళ్లు రావడంతో సిమెంట్‌ పూశారు.

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, గుమ్మడిదల, కంగ్టి ,మునిపల్లి

* కంగ్టి మండలం జమ్గిలో గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో కట్టడం వల్ల ఇప్పటి వరకు వినియోగంలోకి రాలేదు. అక్కడికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేదు. ఇదే మండలం దెగుల్‌ వాడిలో ఇదే పరిస్థితి నెలకొంది. తుర్కవాడగావ్‌, రాంతీర్థ్‌ గ్రామాలకు దూరంగా నిర్మించారు. ఇప్పటి వరకు వాటిని వినియోగించలేదు.
* గుమ్మడిదల మండలం రాంబాయిలోని దయ్యాలకుంటలో వైకుంఠధామం నిర్మించారు. వర్షా కాలంలో ఎవరైనా మృతి చెందితే నీళ్లలోనుంచి వెళ్లాల్సి వస్తోంది. అనువుగాని చోట కట్టడం వల్ల ఇబ్బందులు తప్పడంలేదని పలువురు వాపోతున్నారు.
* మునిపల్లి మండలం గార్లపల్లి గ్రామశివారులో శ్మశానవాటికి నిర్మించారు. ముంపు ప్రాంతం కావడం వల్ల సింగూర్‌ ప్రాజెక్టు నీరు వస్తోంది. వేసవిలోనూ ఇక్కడ నీరు ఉండటంతో ప్రయోజనం లేకుండా పోయింది.

ఇలా జిల్లాలో చాలా చోట్ల ఇలాంటి దుస్థితి నెలకొంది. పల్లెల్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు పడుతున్న అవస్థలను దూరం చేయాలన్న సంకల్పంతో సర్కారు శ్మశాన వాటికల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే స్థానిక అధికారులు అనువైన ప్రాంతాలను ఎంపిక చేయలేదు. దీంతో లక్ష్యం నెరవేరడంలేదు. ప్రస్తుతం వాటి పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడో ఒక చోట నిర్మిద్దామనే ఆలోచన తప్ప, ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్న విషయాన్ని విస్మరించారు. చాలా చోట్ల చెరువు, కుంటల శిఖం భూముల్లో కట్టారు. వీటి వల్ల గుత్తేదారులకే మేలు జరిగిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో వ్యాప్తంగా ఊరూరా వైకుంఠధామాలు నిర్మాణాలు పూర్తి చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద పనులు చేపట్టారు. ఒక్కో దానికి రూ.లక్షలు వెచ్చించారు. మొట్ట మొదటి సారిగా కంది మండలం చెర్లగూడెంలో ఓ వైకుంఠధామం పనులను 2017లో పూర్తి చేశారు. అదే స్ఫూర్తితో... 2019లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్మాణాల స్థల సేకరణ నుంచి సౌకర్యాలు కల్పించేందుకు పంచాయతీ రాజ్‌ (పీఆర్‌ ), రెవెన్యూ, పోలీస్‌ శాఖల భాగస్వామ్యంతో నిర్మాణాలు చేపట్టారు. అందులో రెండు స్నానాల గదులు, వెయింటింగ్‌ హాల్‌ , కార్యాలయం గది, దుస్తులు మార్చుకునేందుకు పురుషులకు, స్త్రీలకు అందులోనే అటాచ్‌డ్‌ శౌచాలయం నిర్మించినా, చాలా చోట్ల స్థానికులకు వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోవడం గమనార్హం..


గుమ్మడిదల మండలం రాంబాయి కుంటలో ఇలా..

ఎంపీడీవోలదే పూర్తి బాధ్యత : సీ.హెచ్‌. శ్రీనివాస్‌రావు, డీఆర్‌డీఓ.
జిల్లాలో వైకుంఠధామాల నిర్మాణాలకు సంబంధించి ఎంపీడీవోలదే పూర్తి బాధ్యత. స్థానికంగా ప్రజలకు ఉపయోగపడే చోట నిర్మించాలని ఆదేశాలిచ్చాం. నీటి వనరుల శిఖం భూముల్లో కట్టినవి, అసంపూర్తిగా ఉన్నవాటి గురించి వివరాలను తెప్పించుకుంటాం. ప్రజలకు ఉపయోగ పడకుండా నిరుపయోగంగా ఉండటం సరికాదు. వినియోగించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాం.

జిల్లాలో ఇలా..
పంచాయతీలు: 647
పూర్తయిన శ్మశాన వాటికలు 647
వెచ్చించిన నిధులు  రూ.77.80 కోట్లు
ఒక్కోదానికి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని