logo

కన్నీటి.. పొలం!

వానాకాలంలో పంటలు సాగు చేసిన రైతుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. పలుచోట్ల పత్తి, మొక్కజొన్న, కూరగాయాల పంటలు నీట మునిగిపోయి దెబ్బతిన్నాయి.

Published : 10 Aug 2022 01:46 IST

పత్తి, మొక్కజొన్నకు తీవ్ర నష్టం
న్యూస్‌టుడే, గజ్వేల్‌, మిరుదొడ్డి


రిమ్మనగూడలో దెబ్బతిన్న పత్తి పంట ఇలా..

వానాకాలంలో పంటలు సాగు చేసిన రైతుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. పలుచోట్ల పత్తి, మొక్కజొన్న, కూరగాయాల పంటలు నీట మునిగిపోయి దెబ్బతిన్నాయి. వేలకు వేలు పెట్టుబడి పెట్టిన రైతులు పాడైన పంటలను చూసి కన్నీమున్నీరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో దాదాపు 5.60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 2.50 లక్షల ఎకరాల్లో వరి, 2 లక్షల ఎకరాల్లో పత్తి, 50 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 30 వేల ఎకరాల్లో కందితో సహా ఇతర పంటలు సాగవనున్నాయని ప్రతిపాదించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియటంతో పంటలు అతలాకుతలం అయ్యాయి. వరి మినహాయిస్తే ఇతర పంటలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. ముఖ్యంగా నల్లరేగడి అధికంగా ఉన్న గజ్వేల్‌, జగదేవపూర్‌, మిరుదొడ్డి, వర్గల్‌, కొండపాక, చేర్యాల పరిసర ప్రాంతాల్లో పత్తి, మొక్కజొన్న పొలాల్లో వాననీరు వీడటం లేదు. వారాల తరబడి అలాగే ఉండిపోవటంతో మొక్కలు కళ్లిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇప్పటిదాకా 600 ఎకరాల్లో ఉద్యాన పంటలు,  2 వేల ఎకరాలకుపైగా పత్తి, 1,300 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. ఈ లెక్కన దాదాపు రూ.40 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి.. పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


ప్రజ్ఞాపూర్‌లో మొక్కజొన్న తీరు..


కొంత దెబ్బతిన్నా.. వదలొద్దు

- శివప్రసాద్‌, జిల్లా వ్యవసాయాధికారి

అధిక వర్షాలతో నీరు చేరిన పంటలకు సంబంధించి మళ్లీ ఎండ కాస్తే ఎదుగుతాయి. కొంత మేర దెబ్బతిన్నా మిగిలిన పంటను వదిలిపెట్టకుండా మెలకువలతో పాటించి కాపాడుకోవాలి. సగటున 33 శాతానికి మించి పంటలు పాడైనట్లు మాకు ఎలాంటి నివేదిక రాలేదు. ఈమేరకు పంట నష్టం అంచనా అవకాశాలు లేవు. జిల్లా వ్యాప్తంగా తమ శాఖ అధికారులు పర్యటిస్తూ రైతులకు మనోధైర్యాన్ని చెబుతూ.. సూచనలు, సలహాలు ఇస్తున్నారు.


ప్రభుత్వమే ఆదుకోవాలి

- బాలరాజు, రిమ్మనగూడ, గజ్వేల్‌ మండలం

నాలుగు ఎకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశా. ఇప్పటిదాకా మొత్తం రూ.50 వేలు పెట్టుబడికి వ్యయం చేశా. భారీ వర్షాలతో పంట నీట మునిగింది. ఇప్పటికీ చాలా వరకు నీళ్లు ఉన్నాయి. దిగుబడి చేతికి వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి.


గతంలో ఎప్పుడూ ఇలా చూడలే..

నాగులు, ధర్మారం, మిరుదొడ్డి మండలం

రూ.55 వేల పెట్టుబడి పెట్టి నాలుగు ఎకరాల్లో పత్తి వేశా. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పాడైపోయింది. అక్కడక్కడ మిగిలిన మొక్కలతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. అధిక వర్షాలతో ఇంతగా పాడైంది ఎప్పుడూ చూడలే. ఈసారి లాభాలు వస్తాయని ఆశిస్తే ఇలా జరిగింది. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేయించి.. పరిహారం ఇవ్వాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని