logo

మహనీయుల త్యాగాలు మరవొద్దు..: మంత్రి

ఎంతో మంది మహానీయుల త్యాగ ఫలితమే నేటి భారతదేశం.. అలాంటి వారి త్యాగాలు మరవకుండా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.

Published : 10 Aug 2022 01:46 IST


ములుగులో జాతీయ జెండాలతో హరీశ్‌రావు, జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ తదితరుల ప్రదర్శన

ములుగు, న్యూస్‌టుడే: ఎంతో మంది మహానీయుల త్యాగ ఫలితమే నేటి భారతదేశం.. అలాంటి వారి త్యాగాలు మరవకుండా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ములుగులో జరిగిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ, అంబేడ్కర్‌, బాబుజగ్జీవన్‌రాం, చాకలి ఐలమ్మ విగ్రహాలు పూలమాలలు వేసి నివాళులు అర్పించి.. ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈనెల 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని మంత్రి సూచించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలసి మువ్వన్నెల జెండాతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ములుగు అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో జిల్లా వజ్రోత్సవ కమిటీతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడాలేని విధంగా వజ్రోత్సవాలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాలను పంపిణీ చేస్తున్నామన్నారు. 15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. చివరి రోజు ఎల్‌బీ స్టేడియంలో ముగింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, పోలీస్‌ కమిషనర్‌ శ్వేత, జిల్లా అదనపు పాలనాధికారి ముజమ్మిల్‌ఖాన్‌, డీపీవో దేవకీదేవీ, గడాధికారి ముత్యంరెడ్డి, సర్పంచి బట్టు మాధవి, గజ్వేల్‌, ఒంటిమామిడి ఏఎంసీ ఛైర్మన్లు మాదాసు శ్రీనివాస్‌, జహంగీర్‌, డీసీసీడీ డైరెక్టర్‌ అంజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ లావణ్య, జడ్పీటీసీ సభ్యురాలు జయమ్మ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని