logo

సమష్టిగా అడుగేసి.. వనాలు సృష్టించి..

పచ్చదనం ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. సకల జీవరాశుల మనుగడకు తప్పనిసరి. అందుకే రాష్ట్ర ప్రభుతం స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా వన మహోత్సవం నిర్వహించనుంది. ఇప్పటికే హరితహారం పేరిట ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది.

Published : 10 Aug 2022 01:46 IST

పచ్చదనం ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. సకల జీవరాశుల మనుగడకు తప్పనిసరి. అందుకే రాష్ట్ర ప్రభుతం స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా వన మహోత్సవం నిర్వహించనుంది. ఇప్పటికే హరితహారం పేరిట ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటి సంరక్షించడంతో అవన్నీ ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. మరోవైపు కేంద్రం అడవుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తోంది. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో పలు పాఠశాలల్లో విద్యార్థులు మొక్కల బాధ్యతలను తీసుకొని సంరక్షిస్తున్నారు. పల్లెల్లో గ్రామస్థులంతా వాటిని కాపాడుతున్నారు. వీరిని ఆదర్శంగా, స్వాతంత్య్ర స్ఫూర్తితో వనాల దీప్తికి అందరం అడుగేయాల్సిన అవసరం ఉంది.


పట్టుబట్టి.. వనంగా మార్చుకొని..


కరీంనగర్‌ జడ్పీ పాఠశాలలో..

ఆ పాఠశాలలోకి అడుగుపెట్టగానే పచ్చదనమే స్వాగతం పలుకుతుంది. ఇది చేగుంట మండలం చందాయిపేట, కరీంనగర్‌ గ్రామాల్లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల ఘనత. ఆరేళ్ల కిందట తొలి అడుగేయగా.. ఇప్పుడు ఆహ్లాదానికి నిలయంగా మారాయి. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో అప్పటి ప్రధానోపాధ్యాయురాలు గంగాబాయి నేతృత్వాన మొక్కలు నాటారు. ఆయా వాటిని పిల్లలే చూసుకున్నారు. సెలవుల్లోనూ నీటి తడులు అందిస్తున్నారు. ఏటా మొక్కలకు విద్యార్థులు రాఖీ కడుతూ వాటితో ఉన్న అనుబంధాన్ని పెనవేసుకుంటున్నారు. కరీంనగర్‌ జడ్పీ పాఠశాల ఏడేళ్ల క్రితం బోసిపోయి కనిపించేది. ప్రధానోపాధ్యాయుడు అమరశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులంతా సమష్టిగా మొక్కలు నాటి కళకళలాడేలా చేశారు.

- న్యూస్‌టుడే, చేగుంటపల్లె..


హరిత లోగిలి

అదో మారుమూల పల్లె. సర్పంచి రవీందర్‌నాయక్‌, స్థానికుల కృషితో అది హరితలోగిలిగా మారింది. రోడ్డుకు ఇరువైపులా చెట్లు ప్రజలకు పచ్చని అందాలను పంచుతున్నాయి. గ్రామ ప్రవేశంలో వృక్షాలే స్వాగతం పలుకుతాయి. లోపల సైతం ఆహ్లాదం సంతరిచుకుంది. హరితహారం కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయడంతో ఇది సాధ్యమైంది. ప్రతి ఇంటికి అయిదు మొక్కలను పంపిణీ చేసి గ్రామస్థులతో నాటించారు. దీంతో ఏ ఇంట చూసినా పచ్చదనం కనిపిస్తుంది. ఇక తండా చుట్టారా ఎత్తయిన కొండలు మరింత ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. మురుగు కాలువలు, సీసీ రోడ్లు, పెంకుటిళ్లకు పచ్చని వృక్షాలు తోడై సరికొత్త అందాల్ని తెచ్చిపెట్టాయి.

- న్యూస్‌టుడే, హత్నూర


150 ఎకరాలలో..

కోమటిబండ.. మిషన్‌ భగీరథ పథకానికి ఆయువుపట్టు. ఇక్కడే పథకాన్ని ప్రారంభించిన విషయం విదితమే. రాష్ట్రానికే ఆదర్శంగా ఉంచాలన్న సంకల్పంతో అధికారులు ఇక్కడ ప్రత్యేకంగా నిర్మించిన ఆర్చి, మొక్కలు, ఎల్‌ఈడీ దీపాలు, నీటి ఫౌంటెయిన్‌ అన్నింటి వద్ద పచ్చదనం ఉట్టిపడుతోంది. ఎత్తయిన కొండ ఆహ్లాదంగా మారింది. మొత్తం 50 ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేశారు. పథకానికి సంబంధించి ఈఈ, డీఈ కార్యాలయాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. 1.40 కోట్ల లీటర్ల పెద్ద సంపులు, 1 కోటి లీటర్ల రెండు పెద్ద ట్యాంకుల ద్వారా గజ్వేల్‌ నియోజకవర్గ ప్రజలకు దాహార్తీని తీర్చుతున్నాయి. సుమారు 150 ఎకరాల్లో లక్షల్లో నాటిన మొక్కలు ఇప్పుడు చెట్లుగా మారి సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

- న్యూస్‌టుడే, గజ్వేల్‌


మారిన రూపురేఖలు


బొంరాస్‌పేటలో మండల సముదాయం ఆవరణలో..

బొంరాస్‌పేట మండల పరిషత్‌, తహసీల్దారు కార్యాలయాల ఆవరణలో 800 వృక్షాలు కనిపిస్తాయి. ఎనిమిదేళ్ల కిందట అప్పటి అధికారులు ప్రత్యేక చొరవ చూపి మొక్కలు నాటించారు. వాటి సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. నీటి తడుల కోసం బిందు పరికరాలు బిగింపజేశారు. అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కల సంరక్షణ ఎదుగుదలకు కృషి చేశారు. సిబ్బంది శ్రమదానంతో పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించారు. ప్రస్తుతం రెండు కార్యాలయాల పరిసరాల్లో ఏపుగా పెరిగి పచ్చందాలతో హరితశోభను సంతరించుకోగా కార్యాలయాలకు వచ్చే ప్రజలకు చల్లని నీడను అందిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, పోలీస్టేషన్‌ కార్యాలయాలు పచ్చదనంతో అలరాతున్నాయి.

- న్యూస్‌టుడే, బొంరాస్‌పేట


నా దేశం.. నా జెండా

సంస్కృతి సంప్రదాయాల్లో మేటి నా దేశం
మహనీయుల మేధావుల పుణ్య దేశం
పురాణ ఇతిహాస శాస్త్రాలు దేశదేశాలకు పరిచయం చేసిన ధర్మదేశం
భిన్నత్వంలో ఏకత్వమై ఆప్యాయత చూపు సుందర దేశం
అపార మేధాసంపత్తి తరగని వనరుల దేశం
స్నేహ హస్తం అందించే సౌశీల్యం
నలువైపులా జాతీయ జెండా రెపరెపలు
ఉప్పొంగే ప్రతి ఒక్కరి దేశాభిమానం
శాంతి సౌభ్రాతృత్వాల సంకేతం నాజెండా..!

- అమ్మన సంతోష్‌కుమార్‌రెడ్డి, కవి, ఉపాధ్యాయుడు, మెదక్‌
- న్యూస్‌టుడే, చేగుంట


గంట చప్పుడు..

జోగిపేట పట్టణం అనగానే గుర్తుకొచ్చేది క్లాక్‌టవర్‌ (మధ్యరంగం). 18వ శతాబ్దంలో దీన్ని నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. పట్టణం నడిమధ్యలో నిర్మించడంతో క్లాక్‌టవర్‌ను మధ్యరంగంగా ప్రజలు నామకరణం చేసి పిలుచుకున్నారు. 1955 ఏప్రిల్‌ 25న ఆ టవర్‌కు నలువైపులా ఉన్న గళ్లల్లో దామోదర్‌ కంపెనీ యాజమాన్యం సహకారంతో గడియారాలు బిగించారు. నిత్యం ఉదయం పూట మోగే ఆ గంట చప్పుడుకు స్థానికులతో పాటు చుట్టూ ఉన్న 20 గ్రామాలవాసులు మేల్కోనేవారు.

కొత్త శోభ..
మధ్యరంగానికి పగుళ్లు రావడం, గడియారాలు చెడిపోవడంతో ఆనాటి కళ తప్పింది. ఇటీవల అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ దానిపై ప్రత్యేక దృష్టి సారించారు. దాని మరమ్మతులకు, గడియారాల ఏర్పాటుకు రూ.12 లక్షలు మంజూరు చేయించారు. నలువైపులా చెడిపోయిన పాత గడియారాలు తీయించి కొత్త వాటిని ఏర్పాటు చేయించారు. రాత్రివేళల్లోనూ తెలిసేలా ప్రత్యేకంగా ఉన్నాయి. గంట గంటకు చప్పుడు వచ్చే విధంగా స్పీకర్లు బిగించారు. పగుళ్లను బాగు చేసి కొత్తగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. ముందు తరాల వారు గుర్తు పెట్టుకునేలా అందంగా మారుస్తున్నారు. త్వరలో దీని ప్రారంభోత్సవం కూడా ఉంటుందని పుర కమిషనర్‌ అశ్రిత్‌కుమార్‌ చెప్పారు. 

- న్యూస్‌టుడే, జోగిపేట


మువ్వన్నెలు.. ఆకట్టుకునేలా..

నాటి రాచరికానికి ప్రతీక అది. ఇప్పుడది దేశభక్తి, జాతీయ భావాన్ని చాటేలా రూపురేఖలు మార్చారు. అదే సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్‌లోని బురుజు. జాతీయ పతాకంలోని మూడు రంగులను అలంకరించారు. స్వాతంత్య్రం రాకముందు ఈ బురుజును నిర్మించారు. పెద్ద బండరాళ్లతో నిర్మించిన ఈ కట్టడం నిర్వహణ లోపించి, చెట్లు పెరగడంతో కూలే స్థితికి చేరింది. ఈ దశలో చారిత్రక కట్టడాన్ని భావి తరాల కోసం కాపాడేందుకు ప్రస్తుత సర్పంచి జిల్లెల అశోక్‌రెడ్డి నిర్ణయించుకొని చర్యలు చేపట్టారు. రెండేళ్ల క్రితం అడుగేసి చెట్లు తొలగించారు. సిమెంట్‌, ఇసుక కాంక్రీట్‌ మిశ్రమం వేయించడంతో పాటు మూడు రంగులు వేయించారు. సైనికులు, రైతుల చిత్రాలతో పాటు బతుకమ్మ చిత్రాలు, కాకతీయ కళాతోరణం, పాడి పంటల చిత్రాలతో తీర్చిదిద్దారు. ఇలా ఇప్పుడు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

- న్యూస్‌టుడే, హుస్నాబాద్‌ గ్రామీణం


త్యాగధనులను స్మరించుకుందాం..


లింగమయ్యగౌడ్‌ను సత్కరిస్తున్న ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌

జోగిపేట టౌన్‌, న్యూస్‌టుడే: ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్య్ర కోసం త్యాగం చేసిన త్యాగధనులను స్మరించుకోవాలని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు. మంగళవారం జోగిపేటలోని క్లాక్‌ టవర్‌ వద్ద స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో కలిసి ఆయన జెండాను పంపిణీ చేశారు. అంతకుముందు పట్టణానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు గడీల లింగమయ్యగౌడ్‌ను సత్కరించారు. స్వాతంత్య్ర కోసం ఆయన చేసిన పోరాటాన్ని అడిగి తెలుసుకున్నారు. అదనపు పాలనాధికారి వీరారెడ్డి, పురపాలిక ఛైర్మన్‌ గూడెం మల్లయ్య, వైస్‌ ఛైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


బంధించినా.. పోరాటం ఆపకుండా..

స్వాతంత్య్ర పోరాటంలో పాపన్నపేట మండలానికి ఓ పేజీ ఉండటం గమనార్హం. దీనికి కారణం ఈ ప్రాంతానికి చెందిన శెట్టి అడివప్ప. చిన్నతనం నుంచే దేశభక్తి ఎక్కువ. దేశం దాస్యశృంఖలాలను తెంచేందుకు ఉద్యమంలో అడుగుపెట్టారు. అప్పటికే నిజాô రాజులు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నా.. బ్రిటీష్‌ విధానాలను వ్యతిరేకించి స్వాతంత్య్రోద్యమ పోరాటంలో పాల్గొన్నారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసి గుల్బర్గా జైలులో బంధించింది. కొన్నాళ్లకు విడుదలైనా తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. మరో మూడుసార్లు సైతం అరెస్టు చేశారు. చివరి వరకు తన పంథాను వీడలేదు. మరోవైపు స్వాతంత్య్రం వచ్చాక నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం తామ్ర పత్రం అందించి పింఛను సైతం అందించి గౌరవించింది. ఆ తర్వాత శెట్టి అడివప్ప మూడు సార్లు పాపన్నపేట సర్పంచిగా సేవలు అందించి గ్రామ ప్రజల మన్ననలు పొందారు. 80 ఏళ్ల వయసులో 1993 జనవరి 17న మృతి చెందారు. ఈయన మనవడు శెట్టి బసంతప్ప ఒకసారి, మనుమరాలు ఉషారాణి సర్పంచులుగా పని చేశారు.

- న్యూస్‌టుడే, పాపన్నపేట


వజ్రోత్సవం.. జెండా సంకల్పం


రామాయంపేటలో...

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, మెదక్‌, గజ్వేల్‌ గ్రామీణ, వికారాబాద్‌ టౌన్‌: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి. మన పతాక ఖ్యాతి ప్రపంచానికి చాటేలా కార్యక్రమాలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఇందులో భాగంగానే ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 14 నాటికి సదరు ప్రక్రియ పూర్తిచేయడానికి ప్రణాళిక రూపొందించారు. 15న స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం. ఇందులో భాగంగా నాలుగు జిల్లాల్లో పంపిణీ మొదలైంది. అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు మహిళా సంఘాల సభ్యులు కీలకపాత్ర పోషించనున్నారు. జెండాలను సిరిసిల్ల నుంచి తెప్పించారు.

* సంగారెడ్డి జిల్లాలో 3.50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికే 80 వేల జెండాలు చేరాయి. మెదక్‌ జిల్లాలో 1.19 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటివరకు లక్ష మేర వచ్చాయి. వికారాబాద్‌లో 2.48 లక్షల జెండాలు అవసరమని గుర్తించారు. ప్రస్తుతం లక్ష మేర జిల్లాకు చేరుకున్నాయి. సిద్దిపేట జిల్లాలో 3 లక్షల మేర పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు.


మంచి మాట

‘సముద్రంలో చారెడు నీళ్లు కలుషితమైతే సముద్రమంతా కలుషితమైనట్లు కాదు.. ఎక్కడో ఓ చేదు అనుభవం ఎదురైతే మానవత్వం మంటగలిసినట్లు కాదు.’

- మహాత్మాగాంధీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని