logo

ఆరోగ్యభాగ్యం

స్వాతంత్య్రం సాధించిన తొలి నాళ్లలో అరకొరగా ఉన్న వైద్యసేవలు.. ప్రస్తుతం మెరుగుపడ్డాయి. ఒకప్పుడు ప్రధాన పట్టణాలకే పరిమితమైన దవాఖానాలు నేడు పల్లెల్లోనూ అందుబాటులోకి వచ్చాయి. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటుపరంగా సేవలు

Published : 12 Aug 2022 01:08 IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు మెరుగు...
మాతా శిశు సంరక్షణపై నజర్‌
- న్యూస్‌టుడే, మెదక్‌

జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం

స్వాతంత్య్రం సాధించిన తొలి నాళ్లలో అరకొరగా ఉన్న వైద్యసేవలు.. ప్రస్తుతం మెరుగుపడ్డాయి. ఒకప్పుడు ప్రధాన పట్టణాలకే పరిమితమైన దవాఖానాలు నేడు పల్లెల్లోనూ అందుబాటులోకి వచ్చాయి. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటుపరంగా సేవలు అందుతున్నాయి. మరో వైపు 58 రకాల పరీక్షలను ఒకే చోట చేసేలా డయాగ్నోస్టిక్‌ హబ్‌ ఏర్పాటుతో రోగులపై ఆర్థికభారం తొలగింది. స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించుకుంటున్న నేపథ్యంలో జిల్లాలో వైద్యసేవల తీరుతెన్నులపై కథనం.

ప్రస్తుతం జిల్లాలో ఒకటి పట్టణ ఆరోగ్య, 18 గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రాలు ఉన్నాయి. ఇది వరకు ఒక ఏఎన్‌ఎంతోనే సేవలు సరిపెట్టేవారు. 2006 నుంచి రెండో ఏఎన్‌ఎంను కేటాయించారు. మాతాశిశు సంరక్షణ, క్షయ, కుష్ఠు, ఎయిడ్స్‌, మలేరియా, వినికిడిలోపం, మానసిక ఆరోగ్యం... తదితరాలకు సంబంధించి నిరంతరం వైద్యసిబ్బంది వివరాల సేకరణ.. రోగులను గుర్తించడం, మందులు అందజేయడం వంటివి నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా మాతా శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సాధారణ ప్రసవం జరిగేలా, తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 2017లో కేసీఆర్‌ కిట్‌ పథకం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగపిల్లాడైతే రూ.12 వేలు అందజేస్తున్నారు. పలు రకాల వస్తువులతో కిట్‌ను పంపిణీ చేస్తున్నారు. మెదక్‌లో రూ.17 కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని గత నెలలో అందుబాటులోకి తీసుకువచ్చారు. జులై నెలలో జిల్లా వ్యాప్తంగా 990 కాన్పులు అయ్యాయి. అందులో 788 ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగడం గమనార్హం. 24 గంటల పాటు కొనసాగే పీహెచ్‌సీల్లో సైతం ప్రసవాలు ప్రతి నెలా పది వరకు చేస్తున్నారు. ప్రత్యేకంగా లేబర్‌ గదులను నిర్మించారు.

రామాయంపేట ఆసుపత్రి

ఉచిత రవాణా..
జిల్లాలో జులై వరకు 4,272 మందికి 108 అంబులెన్స్‌ సేవలందాయి. ఇక గర్భిణులు, బాలింతలకు 102 వాహనం ద్వారా ఇంటి వద్దనే దింపుతున్నారు. జులై నెల వరకు 7,898 మందిని గమ్యస్థానాలకు చేరవేశారు. మొన్నటి వరకు 104 వాహనాల ద్వారా గ్రామాలకు వెళ్లి వ్యాధిగ్రస్థులకు ఉచితంగానే మందులు అందజేశారు.

కార్పొరేట్‌ తరహాలో...
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్‌ తరహాలో సేవలు అందిస్తున్నారు. 2014లో హైరిస్క్‌ కేంద్రం రాగా, ఐసీయూతో పాటు డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవలనే ఐదు పడకల నుంచి పది పడకలకు పెంచారు. నవజాత శిశు కేంద్రంతో పాటు రక్తనిధి కేంద్రాన్ని అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం రేడియాలజీ విభాగం ఏర్పాటుకు నూతన భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కరోనా సమయంలో రోగులకు వైద్యం అందించేందుకు ఆక్సిజన్‌ ప్లాంట్‌ను నెలకొల్పారు. మరో వైపు జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల్లో రోగుల నుంచి నమూనాలు సేకరిస్తున్నారు. పరీక్షించడానికి మెదక్‌లో డయాగ్నోస్టిక్‌ హబ్‌ ఏర్పాటు చేశారు. గతేడాది హబ్‌ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 39,974 రోగుల నుంచి 66,598 నమూనాలను సేకరించారు. 6.66 లక్షల పరీక్షలను నిర్వహించారు. 24 గంటల పాటు సేవలు అందిస్తుండడంతో రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

నమ్మకం పెరిగింది..
- వెంకటేశ్వర్‌రావు, జిల్లా వైద్యాధికారి

ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులంటే ఇటీవల కాలంలో నమ్మకం పెరిగింది. కేసీఆర్‌ కిట్‌ రాకతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువగా కాన్పులు జరుగుతున్నాయి. 108, 102 వాహనాల రాకతో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం చేరువైంది.



 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని