logo

ఇక ఈ-వాహన ఛార్జింగ్‌ కేంద్రాలు...

తరచూ పెరుగుతున్న పెట్రో, డీజిల్‌ ధరలు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాలపై పలువురు చోదకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో వాహనాలు కొనుగోలు చేస్తున్న పలువురు ఇంటి వద్ద

Published : 12 Aug 2022 01:08 IST

ఇరు జిల్లాల్లో ఏర్పాటుకు కసరత్తు
న్యూస్‌టుడే, సిద్దిపేట

రచూ పెరుగుతున్న పెట్రో, డీజిల్‌ ధరలు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాలపై పలువురు చోదకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో వాహనాలు కొనుగోలు చేస్తున్న పలువురు ఇంటి వద్ద ఛార్జింగ్‌ చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఆ ఇబ్బందులు తీరనున్నాయి. టీఎస్‌రెడ్‌కో (తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరు అభివృద్ధి సంస్థ) నేతృత్వంలో ఎలక్ట్రిక్‌ వాహన ఛార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు మొదలైంది. ఫలితంగా ఛార్జింగ్‌ వాహనాలను సులువుగా ఛార్జ్‌ చేసుకునే సదుపాయం చేరువ కానుంది. సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో మొత్తం 31 ప్రాంతాల్లో కేంద్రాలు అందుబాటులోకి వచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో టీఎస్‌రెడ్‌కో నేతృత్వంలో ఈ-వాహన ఛార్జింగ్‌ కేంద్రాలను సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో త్వరలో ఏర్పాటు దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇరు జిల్లాల్లో ప్రభుత్వ శాఖల సమన్వయంతో స్థలపరిశీలన పూర్తి చేసి రాష్ట్ర కార్యాలయానికి ప్రతిపాదించారు. క్షేత్రస్థాయిలో సర్వే అనంతరం ఖరారు చేసి కంపెనీలను ఆహ్వానించనున్నారు. ఇరు జిల్లాల్లో జాతీయ, రాజీవ్‌, ప్రధాన రహదారులను ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేయనున్నారు. రెవెన్యూ, పౌరసరఫరాలు, ర.భ., పర్యాటక శాఖ సహకారంతో శాఖల పరిధిలో స్థలాలను గుర్తించారు. సిద్దిపేట జిల్లాలో తొలుత 17 కేంద్రాల ఏర్పాటుకు సంకల్పించారు. అందులో పౌరసరఫరాలకు సంబంధించిన స్థలాలు -  6, పర్యాటక - 3, రెవెన్యూ - 6, ర.భ. - 2 ఉన్నాయి. మెదక్‌ జిల్లాలో 14 ఏర్పాటు చేయనుండగా.. పౌరసరఫరాలు - 6, ర.భ. శాఖ సంబంధిత 8 స్థలాల్లో ఏర్పాటు కానున్నాయి. ఒక్కో చోట 300 - 1000 చదరపు గజాల వరకు ప్రతిపాదించారు.

మూడు నెలల్లోగా..
సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో ఒకప్పటితో పోల్చితే ఈ-వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. రెండేళ్లుగా ఈ మార్పు కనిపిస్తోంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతరత్రావి దాదాపు 2 వేలకు పైగా ఉన్నాయి. కేంద్రాలు రానుండటంతో వాహన ఛార్జింగ్‌ ప్రక్రియ సులువుగా మారనుంది. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట కోమటిచెరువు, బూరుగుపల్లి, ఇర్కోడు, దౌల్తాబాద్‌, తిమ్మాపూర్‌, తొగుట, గజ్వేల్‌, నంగునూరు, చిన్నకోడూరు మండలం మెట్టుపల్లి, మల్లారం, ప్రజ్ఞాపూర్‌ (హరిత హోటల్‌), నాగులబండ వద్ద ఎల్‌వీ ప్రసాద్‌ ఆసుపత్రి సమీపంలో, ములుగు, లకుడారం, పందిళ్ల, బస్వాపూర్‌, తోటపల్లిలో స్థలాల గుర్తింపు పూర్తయింది. మెదక్‌ జిల్లాలో పాపన్నపేట, శంకరంపేట (ఏ), నర్సాపూర్‌, తూప్రాన్‌, చేగుంట, రామాయంపేటలో ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇప్పటికే టీఎస్‌రెడ్‌కో రాష్ట్ర కార్యాలయం ఐవోసీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంలో స్థలాలకు సంబంధించిన శాఖలు లేదా యజమానులకు కొంత మేర చెల్లించనున్నారు. వచ్చే మూడు నెలల్లో కేంద్రాలు అందుబాటులోకి తెచ్చేందుకు సంబంధిత విభాగం అధికారులు శ్రమిస్తున్నారు.

అరగంట నుంచి గంటలోపు..
ఛార్జింగ్‌ను యూనిట్‌ చొప్పున విక్రయించనున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.18 నుంచి 20 వరకు వెచ్చించనున్నట్లు సమాచారం. ద్విచక్ర వాహనాల్లో 3 నుంచి 4 యూనిట్లు, కారుకు 75 యూనిట్ల వరకు ఛార్జింగ్‌ చేసే అవకాశం ఉండనుంది. బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా అర గంట నుంచి గంటలోపు ఛార్జింగ్‌ చేయనున్నారు. ఆయా చోట్ల అనుమతులు పూర్తయితే 30 కిలో వాట్స్‌, 60 కిలో వాట్స్‌ సామర్థ్యంతో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఇరు జిల్లాల టీఎస్‌రెడ్‌కో మేనేజర్‌ రామ్మోహన్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన, తక్కువ ధరకే నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఈ-వాహన ఛార్జింగ్‌ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని