logo

మొక్కుబడి.. హడావిడి!

యువకులు, చిన్నారులను ఆటల వైపు మళ్లించాలి. వారిని శారీరకంగా, మానసికంగా బలిష్టులుగా తీర్చిదిద్దాలి. తెలంగాణ క్రీడా ప్రాంగణాల లక్ష్యమిదే. అయితే క్షేత్రస్థాయిలో వాటిని ఏర్పాటు చేస్తున్న తీరు ఈ లక్ష్యాన్ని చేరుకుంటామనే భరోసా కలిగించడం

Published : 12 Aug 2022 01:08 IST

క్రీడాపాంగణాల ఏర్పాటులో ఇదీ తీరు
ఈనాడు, సంగారెడ్డి, న్యూస్‌టుడే, చేర్యాల,  సిర్గాపూర్‌, నర్సాపూర్‌

సంగారెడ్డి పురపాలిక పరిధి చాణక్యపురికాలనీలో నామమాత్రంగా ఏర్పాటు ఇలా..

యువకులు, చిన్నారులను ఆటల వైపు మళ్లించాలి. వారిని శారీరకంగా, మానసికంగా బలిష్టులుగా తీర్చిదిద్దాలి. తెలంగాణ క్రీడా ప్రాంగణాల లక్ష్యమిదే. అయితే క్షేత్రస్థాయిలో వాటిని ఏర్పాటు చేస్తున్న తీరు ఈ లక్ష్యాన్ని చేరుకుంటామనే భరోసా కలిగించడం లేదు. కేవలం లెక్కల కోసం.. ఉన్నతాధికారులకు చెప్పేందుకే హడావుడిగా బోర్డులు పాతి... చిన్న పనులు చేసి మమ అనిపిస్తున్నారు. చాలా చోట్ల భూమిని చదును కూడా చేయడం లేదు.

నాలుగు రాడ్లు పాతేస్తున్నారు
ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని చాలా క్రీడా ప్రాంగణాలను పరిశీలిస్తే... కేవలం కొంత మట్టిని చదును చేసి.. కసరత్తు చేసేందుకు వీలుగా నాలుగు ఇనుపరాడ్లు పాతేశారు. ఆటలు ఆడేందుకు పూర్తిగా ఈ ప్రాంగణాన్ని సిద్ధం చేయడం లేదు. భూమిని మంచిగా చదును చేయాలి. ఖోఖో, వాలీబాల్‌, కబడ్డీ కోర్టులు ఏర్పాటు చేయాలి. లాంగ్‌జంప్‌ పిట్‌ నిర్మించాలి. వీటిని పూర్తిస్థాయిలో పాటించడం లేదు. ఉన్నతాధికారులు ఈ పనులపై ప్రత్యేక దృష్టిసారిస్తేనే ప్రయోజనముంటుంది.

సిద్దిపేట జిల్లాలో 528 ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని అంచనా రూపొందించారు. ఇప్పటికే దాదాపు 240 వరకు అందుబాటులోకి తెచ్చామంటున్నారు. వినియోగం ఆ స్థాయిలో లేదు.

మెదక్‌ జిల్లాలో 550 లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 73 చోట్ల పనులు పూర్తయినట్లు చెబుతున్నారు. 40 ప్రాంగణాలను ప్రారంభించారు.

సంగారెడ్డి జిల్లాలోని పురపాలికల్లో 199 నిర్మించాలి. ఇప్పటి వరకు 60చోట్ల పనులు పూర్తయ్యాయి. కేవలం 19 మాత్రమే ప్రారంభించారు. వీటిలో చాలా వరకు ఆటలు ఆడటానికి అనువుగా లేవు. జిల్లాలోని గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లో కలిపి 734 లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 384 పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.

లక్ష్మణ్‌నాయక్‌తండాలో పూర్తికాని పనులు

క్షేత్రస్థాయిలో పరిస్థితి..

సంగారెడ్డి పురపాలిక చాణక్యపురికాలనీలో కసరత్తు చేసే వీలుగా నామమాత్రంగా పనులు చేపట్టారు. గతంలో హరితహారంలో నాటిన మొక్కలు ఇక్కడ పెరగలేదు. ఇప్పుడు ఆ ప్రదేశంలోనే క్రీడా ప్రాంగణం అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు రూ.2.5లక్షలు ఖర్చుచేసినట్లు అధికారులు చెబుతున్నా, ఎవరూ వినియోగించని పరిస్థితి.

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పురపాలిక పరిధిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో ప్రైవేటు వాహనాలను అధిక సంఖ్యలో నిలుపుతుంటారు. దీనిని క్రీడా ప్రాంగణానికి ఎంపిక చేశారు. ఇక్కడా అదే పరిస్థితి. నాలుగు రాడ్లు పాతారు. బోర్డు పెట్టారు. ఇతర ఏ పనులూ చేపట్టలేదు.

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం  ముస్త్యాలలో వాలీబాల్‌ కోసం రెండు రాడ్లు పాతారు. ఖోఖో ఆడేందుకు రెండు రాడ్లు బిగించారు. కనీసం భూమి చదును చేయలేదు. కనీసం ఈ పని చేయలేదని క్షేత్రస్థాయికి వెళ్లి చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు రూ.4.50లక్షల వరకు నిధులు వెచ్చించామంటున్నారు. ఇది గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరం ఉంది. పూర్తిస్థాయిలో పనులు చేసినా ఇక్కడొచ్చి ఆడుకోవడమనేది కష్టమే.

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలం లక్ష్మణ్‌నాయక్‌తండాకు సమీపంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం. రూ.3.60లక్షల అంచనాతో పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు కొన్ని పనులు మాత్రమే చేశారు. మిగతా పనులేవీ పూర్తికాకపోయినా, బోర్డును ముందే ఏర్పాటు చేశారు. మిగతా చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి.


చేర్యాల మండలం ముస్త్యాలలో..

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts