logo

మనమే కావాలి.. ప్రకృతికి ‘రక్ష’!

సోదరుల క్షేమం కోరుతూ.. ఆనందంగా జీవించాలని ఆశీర్వదిస్తూ అక్కాచెల్లెల్లు రాఖీ కడతారు. సోదరీ, సోదరుల మధ్య బంధాన్ని, వారి ఆప్యాయతలకు ఈ పండగ ప్రతిబింబం. ఈ స్ఫూర్తినే స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రస్ఫుటించింది. భారతావనిని భవిష్యత్తుతరాలకు అందించాలన్న లక్ష్య బంధనంతో ముందుకు సాగారు.

Published : 12 Aug 2022 01:08 IST

కంకణబద్ధులై ముందుకు సాగాల్సిన తరుణమిదే..

ఈనాడు, సంగారెడ్డి

సోదరుల క్షేమం కోరుతూ.. ఆనందంగా జీవించాలని ఆశీర్వదిస్తూ అక్కాచెల్లెల్లు రాఖీ కడతారు. సోదరీ, సోదరుల మధ్య బంధాన్ని, వారి ఆప్యాయతలకు ఈ పండగ ప్రతిబింబం. ఈ స్ఫూర్తినే స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రస్ఫుటించింది. భారతావనిని భవిష్యత్తుతరాలకు అందించాలన్న లక్ష్య బంధనంతో ముందుకు సాగారు. మనమంతా రానున్న తరాలకు ఆహ్లాదకర వాతావరణం.. పరిసరాలు.. సమయానికి వర్షాలు.. ఇతరత్రా దక్కాలంటే ప్రకృతికి రక్షగా నిలవాల్సిన అవసరముంది. ఆనాటి మహనీయుల స్ఫూర్తితో అడుగేయాల్సిన తరుణం ఆసన్నమైంది. నేటి రక్షాబంధన్‌ రోజున ఇందుకు ప్రతినబూనుదాం.

జలం.. మనకు బలం
మన జీవనంలో జలం ఎంతో ప్రధానం. అందుకే జలసంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. వాననీటి రక్షణ మనందరి బాధ్యతనే విషయాన్ని గుర్తించాలి. ఇంటి నిర్మాణ సమయంలో తప్పనిసరిగా ఇంకుడుగుంత తవ్వించాలి. తద్వారా భూగర్భజలాలు పెరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మిషన్‌ కాకతీయను చేపట్టింది. నీటి వనరుల్లో పూడిక తీసి వాటిని బలోపేతం చేసింది.

సంగారెడ్డి పట్టణానికి చెందిన వసంత్‌ 30 ఏళ్లుగా వాననీటినే తాగుతున్నారు. ఇంటిపై కురిసిన వర్షం నీటిని ఒడిసిపట్టి ఏడాదంతా వాడుకుంటున్నారు. ఇంట్లో అన్ని అవసరాలకూ ఇవే సరిపోతున్నాయి. ఈ దిశగా కనీసం కొందరైన వాననీటిని ఇలా సంరక్షించి వాడుకుంటే భూగర్భంపై ఒత్తిడి భారీస్థాయిలో తగ్గిపోతుంది. సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్‌ ఇంటింటా ఇంకుడుగుంతల ఏర్పాటుతో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆ స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ఈ నిర్మాణాలను ఒక ఉద్యమంలా చేపట్టారు.

పచ్చదనానికి  ‘వృక్షా బంధన్‌’..
నానాటికీ అటవీ విస్తీర్ణం తగ్గిపోతుంది. వివిధ అవసరాలకు ఇష్టానుసారంగా చెట్లను నరికివేస్తున్నారు. కానీ ఆ స్థాయిలో మొక్కలు నాటి రక్షించకుంటే తిప్పలే. పుట్టినరోజు, పెళ్లివేడుక.. ఇలా ఏ సందర్భాన్నైనా వృక్షా బంధన్‌గా మార్చితే సత్ఫలితాలు ఖాయం. రాష్ట్ర ప్రభుత్వం హరితహారంలో భాగంగా ఏటా మొక్కలు నాటి సంరక్షణకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఏడు విడతలు పూర్తయ్యాయి. ఎనిమిదో విడత కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలో 1.13 కోట్లు, సిద్దిపేటలో 40 లక్షలు, మెదక్‌లో 34.42 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు.

ప్రత్యామ్నాయమే మేలు..
ప్లాస్టిక్‌ పేరు వింటేనే పర్యావరణవేత్తలు హడలిపోతున్నారు. దీని వినియోగం పెరిగి ఎక్కడ చూసినా ఈ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. మనం వినియోగించే దానిలో 60 శాతమే పునర్‌ వినియోగిస్తున్నారు. వందల ఏళ్లయినా నేలలో కరగదు. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ సంచులను జులై 1 నుంచి నిషేధించారు. ఈ తరుణంలో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటే మేలు.

హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దోసపాటి రాము కొన్నేళ్లుగా ప్లాస్టిక్‌పై పోరాటం సాగిస్తున్నారు. సంగారెడ్డిలో పర్యటించి టిఫిన్స్‌ బాక్స్‌ ఛాలెంజ్‌ గురించి అందరికీ వివరించారు. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుందాం. మనం కూడా చేతి సంచి తీసుకెళ్దాం. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు చొరవతో స్టీల్‌ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. ఇళ్లలో జరిగే వేడుకుల్లో స్టీలు వస్తువులు వాడేలా చూస్తున్నారు. జిల్లాలోని కొన్ని చికెన్‌, మటన్‌ విక్రయించే దుకాణాలకు టిఫిన్‌ బాక్స్‌ తీసుకెళ్తే కొంత డిస్కౌంట్‌ కూడా ఇస్తున్నారు.


సైనిక పురి.. ధనసిరి!
న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌

జవాన్లు, పోలీసుల జన్మభూమిగా ఆ గ్రామం జేజేలు అందుకుంటోంది. వంద మందికి పైగా దేశసేవలో పునీతులవుతున్నారు. దేశ రక్షణకు మేము సైతం అంటూ సైనికులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆ గ్రామమే తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని జహీరాబాద్‌ మండలం ధనసిరి గ్రామం.

సిపాయి నుంచి సుబేదార్‌ వరకు వివిధ హోదాలలో గ్రామానికి చెందిన వారు సైన్యంలో సేవలందిస్తున్నారు. పోలీసు శాఖలోనూ కానిస్టేబుల్‌ నుంచి వలయాధికారి హోదా వరకు తమదైన గుర్తింపు చాటుతున్నారు. సెలవు దినాల్లో గ్రామానికి వచ్చిన మిలటరీ అధికారులు, శిక్షకులు, సైనికులు స్థానిక యువతకు సైపుణ్యాలపై అవగాహన కల్పిస్తుండటంతో గ్రామం నుంచి అత్యధికులు అటువైపు అడుగేశారు. ప్రస్తుతం కమాండ్‌, బ్రిగేడియర్‌, హవాల్దార్‌, ఫిజికల్‌ ట్రైనర్‌, లాస్‌నాయక్‌, నాయక్‌ సుబేదార్‌, సుబేదార్‌, జవాన్లుగా పలువురు సేవలందిస్తున్నారు. ప్రస్తుతం 54 మంది విధులు నిర్వహిస్తుండగా, 46 మంది ఉద్యోగ విరమణ పొందారు. మార్గదర్శకంగా గ్రామానికి చెందిన విశ్రాంత సైనికాధికారులు చంద్రశెట్టి, నాగిశెట్టి సోదరులు ఐదున్నర దశాబ్దల కాలంగా గ్రామస్థులు సైన్యంలో చేరి సేవలందించేలా వీరిద్దరూ శిక్షణ  ఇస్తున్నారు.

జమ్ము-కశ్మీర్‌ సరిహద్దులో గాండ్ల విశ్వనాథం బృందం


రెపరెపలాడాలి..
భావితరాల స్వేచ్ఛ స్వాతంత్య్రాల కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి.. వినీల గగనాల త్రివర్ణ పతాకమై.. ఆశీస్సులు అందిస్తుంటే.. 75 ఏళ్లు చకచకా గడిచిపోయాయి అమృతోత్సవమో.. వజ్రోత్సవమో.. నేటితరం.. భావితరానికి నాటి త్యాగపరతంత్రత పోరాటపటిమ గూర్చి నూరి పోయాల్సిన సమయంలో.. ఇంటిటా జాతీయ పతాకం రెపరెపలాడాల్సిందే.

- అమరవాది రాజశేఖరశర్మ, తెలుగు ఉపాధ్యాయుడు, గజ్వేల్‌
- న్యూస్‌టుడే, గజ్వేల్‌ గ్రామీణ


మంచిమాట

* విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలిపోయేది కాదు.. అది అచంచలమైనది. హిమాలయమంత స్థిరమైనది.

* స్వేచ్ఛ ఎప్పటికీ విలువైనది కాదు.. అది జీవనాధారం.. మనిషి జీవించడానికి ఏమీ చెల్లించడు.

- మహాత్మాగాంధీ


పోరాటయోధుడు.. శిక్షకుడు..

బోగయ్యగారి వెంకటరాజేశ్వర జ్యోషి.. స్వాతంత్రోద్యమ చరిత్రలో తనకంటూ ఓ పేజీని సృష్టించుకున్న సమరయోధుడు. పెద్దశంకరంపేటకు చెందిన ఈయన స్థానికంగా యువతకు చేరదీసి బ్రిటిష్‌ నిరంకుశత్వంపై పోరాటం చేశారు. ఎంతోమంది యువకులకు శిక్షణ ఇచ్చి వాలంటీర్లుగా తయారు చేశారు. వారితో కలిసి ఉద్యమం సాగించారు. మరోవైపు నిజాం ప్రభుత్వంపై కూడా పోరాడారు. వీటి ఫలితంగా బ్రిటీష్‌ ప్రభుత్వం ఈయన్ను అరెస్టు చేసి జైలు శిక్ష విధించింది. ఔరంగాబాద్‌ జైలులో ఆరు నెలల పాటు శిక్ష అనుభవించారు. మర్రి చెన్నారెడ్డి, వి.బి.రాజులతో కలిసి రాజేశ్వర జ్యోషి గ్రంథాలయ ఉద్యమం నిర్వహించి అప్పట్లో పెద్దశంకరంపేటలో శ్రీ రామచంద్ర గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేశారు. దీని ద్వారా స్థానికులను చైతన్యవంతులు చేసేందుకు తనవంతు పోరాటం చేశారు. సాతంత్య్రం అనంతరం తన వెంటన నడిచిన ఎంతో మందికి స్వాతంత్ర సమరయోధుల పింఛను కూడా లభించింది.

- న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట


చారిత్రక కట్టడం.. మధుర జ్ఞాపకం..

సిద్దిపేటలోని లాల్‌కమాన్‌, బురుజు కట్టడాలు.. ఘనమైన చరిత్రను పుణికిపుచ్చుకున్నాయి. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ నిర్మాణాలు.. వందల ఏళ్ల కిందట నిర్మించినట్లుగా ప్రతీతి. పూర్వం లాల్‌ కమాన్‌.. పట్టణానికి ప్రధానంగా ద్వారంగా ఉండేది. దీన్ని ఆనుకొని పట్టణం చుట్టూ శత్రు దుర్బేధ్యమైన ప్రహరీ, దానికి అనుసంధానంగా నాలుగు బురుజులు ఉండేవి. వాటిపై నుంచి సైనికులు పహారా కాసేవారు. కాలక్రమేణా ప్రహరీ, మూడు బురుజులు అంతర్థానమయ్యాయి.  ప్రస్తుతం ఒకటే మాత్రమే మిగిలి ఉంది. స్వాతంత్య్ర ఆవిర్భావం అనంతరం సిద్దిపేటలో తొలిసారిగా బురుజుపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినట్లు పెద్దలు చెబుతుంటారు. నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలిగిన తరువాత 1948 సెప్టెంబరులో దసరా పండుగ రోజు మొదటగా జాతీయ పతాకాన్ని బురుజుపై ఎగురవేసినట్లు చరిత్రకారులు చెబుతారు. ఆయా చారిత్రక కట్టడాలపై నాటి నుంచి జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నారు.

- న్యూస్‌టుడే, సిద్దిపేట


సమాచారమేదీ తెల్వకపోయేది..
- జానమొళ్ల నారాయణరెడ్డి,  చౌదర్‌పల్లి, బొంరాస్‌పేట

స్వాతంత్య్రం వచ్చినప్పుడు నా వయసు 13. అప్పట్లో రజాకార్లదే హల్‌చల్‌. ఎవరి పనులు వారు చేసుకునేవారు. అప్పట్లో ప్రచార సాధనాలు లేకపోవడంతో ఏ సమాచారం అందకపోయేది. ఆనాటి మహనీయులు వచ్చిన విషయం తెలియనిచ్చే వారు కాదు. తాండూరు, హైదరాబాద్‌ వంటి పట్టణాల్లోనే గొడవలు జరుగుతున్నట్లు మా పెద్దలు చెబుతుండేవారు.

- న్యూస్‌టుడే, బొంరాస్‌పేట


జెండా ’ తూప్రాన్‌

జెండా దగ్గర ఉన్నా.. అంటే చాలు తూప్రాన్‌వాసులు ఠక్కున గుర్తుపడతారు. అంతగా ఆ ప్రాంతానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ప్రాంతంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆగస్టు 15, జనవరి 26న జెండాను ఆవిష్కరిస్తున్నారు. ఇక దసరా పండగ రోజు పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఇక్కడే మొదటగా పూజలు చేయడం ఆనవాయితీ.

- న్యూస్‌టుడే, తూప్రాన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని